TDP Woman Leader : ఆదిమూలం వేధించారు!
ABN, Publish Date - Sep 06 , 2024 | 04:04 AM
తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అదే పార్టీకి చెందిన మండల స్థాయి మహిళా నాయకురాలు సంచలన ఆరోపణలు చేశారు.
తిరుపతిలో హోటల్‌కు పిలిచి పలుమార్లు లైంగిక దాడిచేశారు
రాత్రి సమయాల్లో ఫోన్ చేసేవారు
బయటకు చెబితే చంపేస్తానన్నారు
నా భర్త సూచనలతో వ్యవహారం
మొత్తం పెన్ కెమెరాలో రికార్డ్ చేశా
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటిపై
ఆ పార్టీ మహిళా నేత ఆరోపణలు
ఆధారాలు బయట పెట్టిన బాధితురాలు
బాబు సీరియస్.. సస్పెన్షన్ వేటు
పంజాగుట్ట/తిరుపతి/అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అదే పార్టీకి చెందిన మండల స్థాయి మహిళా నాయకురాలు సంచలన ఆరోపణలు చేశారు. ఆదిమూలం తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను, తన కుటుంబాన్నీ చంపేస్తానని బెదిరించారని ఆరోపించారు. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని, లేకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని
సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె తన భర్తతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలు, వీడియోలు, మొబైల్ కాల్ లిస్ట్ వంటి ఆధారాలను రిలీజ్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఆదిమూలం టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చారు. దీనిని నేను తీవ్రంగా వ్యతిరేకించా. అయినా బాబు ఆదేశాల మేరకు ఇతర నాయకులను కలుపుకొని ఆదిమూలంను గెలిపించాం. ఒకే పార్టీకి చెందిన వాళ్లం కావడంతో నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. అప్పటి నుంచి వేధించడం ప్రారంభించారు. రాత్రి సమయాల్లో ఫోన్లు చేసి.. తనతో గడపడానికి హోటల్‌కు రావాలని ఒత్తిడి చేసేవారు. పలుమార్లు తిరస్కరించా.
దీంతో నన్ను, నా కుటుంబ సభ్యులను అంతుచూస్తానని బెదిరించారు. ఆయన వేధింపులు భరించలేక మాట్లాడదామనే ఉద్దేశంతో జూలై 6న తిరుపతిలోని ఓ హోటల్ గదికి వెళ్లా. అక్కడే నాపై ఆదిమూలం అత్యాచారం చేశారు. ఎవరికైౖనా చెబితే చంపేస్తానని బెదిరించారు. దీంతో గతిలేని పరిస్థితిలో ఆయనకు లొంగిపోవాల్సి వచ్చింది. అలా నాపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. అర్థరాత్రులు ఫోన్లు చేస్తుడడంతో నా భర్త గట్టిగా నిలదీశారు. దీంతో జరిగిన విషయం చెప్పా. నా భర్త సూచనతో పెన్ కెమెరా పట్టుకుని హోటల్‌కు వెళ్లా. ఆ గదిలో పెన్ కెమెరా పెట్టి ఆదిమూలం బాగోతాన్ని రికార్డ్ చేశా’’ అని బాధితురాలు వివరించారు.
ఆదిమూలం వేధింపులు పెరగడంతో ఆయనను దూరం పెట్టానని, అప్పటి నుంచి తమ ఇంటి చుట్టూ గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారని తెలిపారు. దీంతో ఈ విషయం మొత్తాన్నీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లకు వివరిస్తూ లేఖ రాసినట్టు చెప్పారు. తన వద్ద అన్ని సాక్ష్యాలూ ఉన్నాయని తెలిపారు. రోజుకో అమ్మాయితో ఆదిమూల ఎంజాయ్ చేేసవారని, ఇలా ఎంతో మందిని టార్చర్ చేశారని బాధితురాలు ఆరోపించారు. తన కార్యకలాపాలకు తిరుపతిలోని భీమా ప్యారడైజ్ హోటల్‌ను అడ్డాగా మార్చుకున్నారని తెలిపారు. ఆదిమూలం బారి నుంచి మహిళలను కాపాడాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తనకు, తన కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే సామూహిక ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు.
కుట్ర చేశారు: ఎమ్మెల్యే
మహిళా నాయకురాలి ఆరోపణలతో సత్యవేడు ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. మార్ఫింగ్ చేసిన వీడియోలతో తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘‘నేను తప్పు చేయలేదు. ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధం. నా బిడ్డల సాక్షిగా చెబుతున్నా.. ఆ మహిళ నియోజకవర్గ తెలుగు మహిళా నేతగా మాత్రమే తెలుసు. ఇతర పరిచయాలు లేవు. నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన రమేశ్‌బాబుతో పాటు పార్టీలోని మునుస్వామి యాదవ్, గిరిబాబు, బాలరాజు తదితర నాయకులు పన్నిన కుట్ర’’ అని ఆదిమూలం ఆరోపించారు. కాగా, ఎమ్మెల్యే సొంత మండలమైన భీముని చెరువులో మహిళలు ఆదిమూలానికి మద్దతు తెలిపారు. ఈ ఆరోపణల వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు.
టీడీపీ శ్రేణుల అనుమానాలు
ఆదిమూలం ఎన్నికల ముందే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు జగన్ టికెట్ నిరాకరించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆదిమూలం తనను లైంగికంగా వేధించారంటూ టీడీపీ మహిళా నేతే ఆరోపించడం సంచలనంగా మారింది. అయితే.. ఈ విషయంలో అనేక సందేహాలు ఉన్నాయని స్థానిక టీడీపీ నేతలు చెబుతున్నారు. బాధితురాలు మొదట్లోనే పోలీసులకు, పార్టీ అధిష్ఠానానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని, జూలై 10న ఆధారాలు సేకరించాక అప్పుడే ఫిర్యాదు చేయకుండా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఎస్పీకి, విజయవాడలో హోం మంత్రి, డీజీపీలకు ఫిర్యాదు చేసే అవకాశముండగా, హైదరాబాదులో మీడియా సమావేశం పెట్టడంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో బాధితురాలు మరికొందరు నేతలతో కలసి స్వతంత్ర అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ఇచ్చి ప్రచారం చేశారని పోలింగ్‌కు ముందే ఆదిమూలం ఆరోపించారు. ఫొటోలు, వీడియోలు చూపి ఎమ్మెల్యేతో కొందరు బేరసారాలు సాగించారన్న వాదన కూడా వినిపిస్తున్నారు. భారీమొత్తంలో నగదు డిమాండ్ చేశారని, ఎమ్మెల్యే నిస్సహాయత వ్యక్తం చేయడంతో తెర వెనుక వ్యక్తులు.. ఈ వ్యవహారాన్ని వైసీపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చేరవేసినట్టు చెబుతున్నారు.
ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు
గంటల వ్యవధిలోనే టీడీపీ నిర్ణయం
ఇందుకా గెలిపించింది: సీఎం సీరియస్
పార్టీ పరంగా విచారణకు కమిటీ
టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సొంత పార్టీ తెలుగు మహిళా నేత చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. రాజకీయంగా దుమారం రేగింది. దీంతో గంటల వ్యవధిలోనే టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. ఆదిమూలంపై పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో పాటు ఈ వ్యవహారంపై పార్టీపరంగా విచారణకు కమిటీ వేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, గురువారం సీఎం చంద్రబాబు విజయవాడలో వరదపై సమీక్ష జరుపుతున్నప్పుడు ఈ వ్యవహారం ఆయన దృష్టికి వచ్చింది. వీడియోలు వాస్తవమేనని నిఘా వర్గాలు ధ్రువీకరించడంతో తక్షణమే చర్యలు చేపట్టారు. ‘వీరిని ప్రజలు గెలిపించింది ఎందుకు? వీరు చేస్తోందేమిటి? వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయండి’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఆరోపణల తీవ్రత దృష్ట్యా వివరణ కోరాల్సిన అవసరం కూడా లేదన్నారు. దీంతో వెంటనే పల్లా ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
Updated Date - Sep 06 , 2024 | 04:04 AM