అమరావతికి నిధులొస్తున్నాయ్!
ABN, Publish Date - Oct 20 , 2024 | 03:15 AM
రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కొరత తీరనుంది. దీనికోసం ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవల్‌పమెంట్ బ్యాంకులు 1.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.13,600 కోట్లు) అప్పుగా ఇవ్వనున్నట్లు సీఆర్డీఏ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రాజధానికి రూ.13,600 కోట్ల అప్పు
డిసెంబరులో 10% అడ్వాన్స్‌గా ఇవ్వనున్న ఆర్థిక సంస్థలు
జనవరి నెలాఖరు నాటికి మొదటి విడత రుణం విడుదల
మరో రూ.1400 కోట్లు భరించనున్న కేంద్ర ప్రభుత్వం
కాలపరిమితి, మారటోరియం వ్యవధిపై త్వరలోనే స్పష్టత
డిసెంబరులో 10% అడ్వాన్స్ ఇవ్వనున్న వరల్డ్ బ్యాంకు, ఏడీబీ
అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కొరత తీరనుంది. దీనికోసం ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవల్‌పమెంట్ బ్యాంకులు 1.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.13,600 కోట్లు) అప్పుగా ఇవ్వనున్నట్లు సీఆర్డీఏ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏడీబీ బోర్డు సమావేశం డిసెంబరు 8న, ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశం జరుగుతుందని, వాటిలో ఈ అప్పు ప్రతిపాదనను ఆమోదిస్తారని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయన్నారు. రుణం మొత్తం రూ.13,600 కోట్లను ఐదేళ్ల పాటు పలు విడతల్లో ఇస్తారని, ఈ డిసెంబరులోనే 10 శాతాన్ని అడ్వాన్స్‌గా ఇస్తారని వివరించారు. వచ్చే జనవరి నెలాఖరున మొదటి విడత అప్పు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ అప్పుపై మారటోరియం వ్యవధి 5 నుంచి 15 ఏళ్ల వరకు ఉండేలా వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఇది వడ్డీ రహిత రుణమని, దీని కాలపరిమితి, మారటోరియం పీరియడ్, ఇతర నిబంధనలపై నవంబరు 8 నాటికి స్పష్టత వస్తుందని వెల్లడించారు. ఈ అప్పును ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో చేర్చితే రాష్ట్ర అవసరాలకు అప్పులు తగ్గుతాయి కాబట్టి దాని పరిధికి బయట కేంద్రం అనుమతిస్తోందని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు.
కేంద్రం భరించేది 9.33 శాతమే
అమరావతి నిర్మాణం కోసం ఏడీబీ, వరల్డ్ బ్యాంకు నుంచి వస్తున్న అప్పును తిరిగి చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అమరావతి ఫేజ్-1 కోసం ప్రతిపాదించిన రూ.15,000 కోట్ల అప్పులో రూ.13,600 కోట్లు ఏడీబీ, ప్రపంచ బ్యాంకు నుంచి రాగా, మిగిలిన రూ.1,400 కోట్లను కేంద్రం భరిస్తుంది. ఇదేమీ ప్రత్యేకమైన సాయం కాదు. సాధారణంగా ఈఏపీ ప్రాజెక్టులకు కేంద్రం 10శాతం వరకు రాష్ట్రాలకు సాయం చేస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు డాలర్ల రూపంలో అప్పులిస్తాయి. వాటిని తిరిగి డాలర్లలోనే చెల్లించాలి.
ప్రస్తుతం ఒక డాలర్ విలువ రూ.84గా ఉంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇవ్వనున్న 1.6 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించే సమయానికి వాటి విలువ భారీగా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. అమరావతికి వచ్చే అప్పు కాలపరిమితి దాదాపు 50 ఏళ్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే రాబోయే 50 ఏళ్లలో డాలర్ విలువకు అనుగుణంగా రాష్ట్ర ఖజానాపై భారం కూడా పెరుగుతుంది. రాష్ట్రానికి గుదిబండలా మారే అంతర్జాతీయ అప్పుల కంటే దేశీయ సంస్థల నుంచి తీసుకోవడం సమంజసమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాబార్డు, పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీలతో పాటు అనేక సంస్థలు అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటున్నారు.
Updated Date - Oct 20 , 2024 | 06:29 AM