ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: ఒక్కసారిగా వైసీపీ డీలా.. సడన్‌గా ఏమైందా అని ఆరాతీస్తే..?

ABN, Publish Date - Feb 26 , 2024 | 03:08 AM

AP Elections 2024: సార్వత్రిక ఎన్నికలకు ముంగిట అధికారపక్షం ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఆ పార్టీ ముఖ్య నేతల నుంచి కార్యకర్తల దాకా ఎవరిలోనూ ఎన్నికల సంరంభమే కనిపించడం లేదు..

  • నేతలు, కార్యకర్తల ముఖాల్లో కనిపించని జోష్‌

  • పరాజయం తప్పదని తేల్చేసిన సర్వేలు

  • ఏడు జాబితాల్లో అసెంబ్లీకి 65 మంది పేర్లే

  • 33 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు మొండిచేయి

  • తొలి జాబితాలోనే 99 పేర్లతో ప్రతిపక్షాల హుషారు

(అమరావతి-ఆంధ్రజ్యోతి) :

సార్వత్రిక ఎన్నికలకు ముంగిట అధికారపక్షం వైసీపీ (YSR Congress) ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఆ పార్టీ ముఖ్య నేతల నుంచి కార్యకర్తల దాకా ఎవరిలోనూ ఎన్నికల సంరంభమే కనిపించడం లేదు. వైసీపీ ఓటమి ఖాయమని ప్రజల్లో విస్తృత ప్రచారం జరుగుతుండడం, ఐ-ప్యాక్‌, సొంత సర్వేలూ అవే చెబుతుండడం.. వాటి సాకుతో 33 మంది సిటింగ్‌లకు సీఎం జగన్మోహన్‌రెడ్డి మొండిచేయి చూపడం.. వంటి పరిణామాలు నేతల్లో నిస్తేజానికి ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అలాగే కొందరు ఎమ్మెల్యేలను తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిచి.. ఈ దఫా మీరు ఓడిపోతున్నారు.. టికెట్లు ఇవ్వనని తేల్చేస్తున్నారు. నోరున్నవాళ్లు నిలదీస్తున్నారు.. లేనివాళ్లు ఉసూరుమంటూ బయటికొస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయి పరిస్థితి చూశాక టికెట్లు రాకపోవడమే మేలనుకుంటున్నవారూ ఉన్నారు.

అటు నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గడంతో.. ప్రచార పటాటోపం కోసం వైసీపీ పెద్దలు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల నుంచి ప్రధాన కూడళ్ల దాకా ‘సిద్ధం’ అంటూ జగన్‌ కటౌట్‌లు పెట్టుకుంటున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చాలా మంది సిటింగ్‌లలో టికెట్లు వస్తాయో రావోనన్న ఉత్కంఠే లేదు. టికెట్లు వచ్చినవారూ సంతోషం వ్యక్తం చేయడం లేదు. టికెట్లు దక్కనివారిలో నిరాశానిస్పృహలు, ఆగ్రహావేశాలు అస్సలు లేవు. ఇక ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకున్నవారు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న దాఖలాలూ పెద్దగా కనిపించడం లేదు. అభ్యర్థుల ప్రకటనకు ముందు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంతో కొద్ది మంది నేతలైనా ఊళ్లలో తిరిగేవారు. ఇప్పుడా కార్యక్రమం ముగిసిపోవడంతో .. కొత్త ఇన్‌చార్జులు గ్రామాల్లో ప్రచారానికి ఇంకా దిగలేదు. ఇప్పటిదాకా ఏడు జాబితాల్లో 65 మంది ఇన్‌చార్జుల పేర్లు ప్రకటించారు. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలకు టికెట్‌ దక్కకపోయినా, నియోజకవర్గాల్లో వారి అనుచరులు ఆందోళనలు, నిరసనలకు దిగడం లేదు. ఓడిపోయి ఆర్థికంగా చితికిపోవడం కంటే.. ఎన్నికల రేసుకు దూరంగా ఉంటే గౌరవమైనా నిలబడుతుందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు.

ఓటమి సంకేతాలు..?

నిరుడు డిసెంబరు 27వ తేదీన జగన్‌ 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. ముగ్గురు మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, మేరుగ నాగార్జున, విడదల రజని సిటింగ్‌ స్థానాలను మార్చారు. సురేశ్‌ను ఎర్రగొండపాలెం (ఎస్సీ) నుంచి కొండపి (ఎస్సీ) స్థానానికి.. నాగార్జునను వేమూరు (ఎస్సీ) నుంచి సంతనూతలపాడు (ఎస్సీ)కి.. రజనిని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు బదిలీచేశారు. అలాగే మాజీ మంత్రి మేకతోటి సుచరితను ప్రత్తిపాడు (ఎస్సీ) నుంచి తాడికొండ (ఎస్సీ)కి బదలాయించారు. ప్రస్తుత స్థానాల్లోనే పోటీచేస్తే ఓటమి తప్పదని సర్వేల్లో తేలడమే దీనికి కారణం. ఈ మార్పుల ద్వారా వారి ఓటమి ఖాయమని ముఖ్యమంత్రే పరోక్షంగా సంకేతాలిచ్చార్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వ్యక్తమైంది. 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటికి ఏడు జాబితాల్లో 65 మంది అసెంబ్లీ, 16 ఎంపీ సీట్లకు మాత్రమే ఇన్‌చార్జులను ఖరారుచేశారు. లోలోపల సిటింగ్‌లు అసంతృప్తిగా ఉండడం, కొందరు టీడీపీ వైపు చూస్తుండడంతో.. వారిని బుజ్జగించడానికి.. మళ్లీ సర్వేలు చేస్తున్నామని.. ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తే వారికే తిరిగి టికెట్లు ఇస్తామని వైసీపీ పెద్దలు లీకులిచ్చారు. ఇది కొత్త ఇన్‌చార్జుల్లో అలజడి రేపుతోంది. దీంతో వారిలో చాలా మంది ప్రచారానికి ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ శనివారం తమ తొలి జాబితాలోనే 99 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడం వైసీపీ నేతలను విస్మయానికి గురిచేయగా.. ఆయా పార్టీల కార్యకర్తల్లో కదనోత్సాహాన్ని నింపిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 26 , 2024 | 09:26 AM

Advertising
Advertising