రెచ్చిపోయిన ప్రేమోన్మాది
ABN, Publish Date - Oct 20 , 2024 | 07:26 AM
ఓ యువకుడు బాలికకు ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి.. అడవిలోకి తీసుకెళ్లి నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 80 శాతానికిపైగా గాయపడ్డ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
బాలికపై హత్యాయత్నం
అడవిలోకి తీసుకెళ్లి లైటర్‌తో నిప్పు పెట్టిన యువకుడు
80 శాతానికి పైగా గాయాలతో విషమ స్థితిలో ఇంటర్ విద్యార్థిని
సీఎం చంద్రబాబు సీరియస్.. నిందితుడి అరెస్టుకు ఆదేశం
బద్వేలు/గోపవరం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఓ యువకుడు బాలికకు ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి.. అడవిలోకి తీసుకెళ్లి నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 80 శాతానికిపైగా గాయపడ్డ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన బాలిక ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బాలిక నివాసం ఉండే వీధికే చెందిన విఘ్నేశ్ కడపలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి సన్నిహితంగా మెలిగేవాడు. ఆరు నెలల క్రితమే విఘ్నేశ్‌కు వివాహం కాగా ప్రస్తుతం అతని భార్య గర్భవతి. వీరు కడపలో నివాసం ఉంటున్నారు. ఇదిలావుంటే, విఘ్నేశ్ శుక్రవారం రాత్రి బాలికకు ఫోన్ చేసి ‘‘నువ్వు లేకపోతే చచ్చిపోతాను.
నీతో మాట్లాడాలి బయటకు రా’’ అని చెప్పాడు. దీంతో భయపడ్డ బాలిక శనివారం ఉదయం కళాశాలకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వచ్చింది. అనంతరం ఆటోలో నెల్లూరు రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న విఘ్నేశ్ కూడా ఆటో ఎక్కాడు. ఇద్దరూ ఆటోలో పీపీకుంట వద్ద ఉన్న సెంచురీ ప్లైవుడ్ సమీపంలో దిగారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. విఘ్నేశ్ తన వద్ద ఉన్న లైటర్‌తో బాలిక దుస్తులకు నిప్పు పెట్టి పరారయ్యాడు. మంటలకు తాళలేక బాలిక కేకలు వేస్తూ జాతీయ రహదారి వైపు పరుగులు పెట్టింది. ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ లారీ డ్రైవరు ఆమెను గమనించి వెంటనే లారీని ఆపి.. తన వద్ద ఉన్న దుప్పటి తీసుకొచ్చి మంటలు ఆర్పివేశాడు.
స్థానికంగా ఉన్న ఓ మహిళ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బద్వేలు రూరల్ సీఐ నాగభూషణం, ఎస్‌ఐ శ్రీకాంత్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బాలిక పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. బాలిక శరీరం దాదాపు 80 శాతం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కడప ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. హత్యాయత్నం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంటర్ విద్యార్థినిపై హత్యాయత్నం ఘటనపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో ఫోన్‌లో మాట్లాడారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు.
Updated Date - Oct 20 , 2024 | 07:26 AM