Share News

రెండేళ్లలో మరో 6 ప్లాంట్లు

ABN , Publish Date - Sep 03 , 2024 | 05:45 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే అరబిందో ఫార్మా జెనరిక్స్‌ రంగంలో దూసుకుపోతోంది. ఫార్మా రంగంలో అత్యంత కీలకమైన యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) తయారీ కోసం 1986లో ఏర్పాటైన ఈ కంపెనీ.. ఇతర ఫార్మా కంపెనీల కొనుగోళ్లు, కొత్త ప్లాంట్ల

రెండేళ్లలో మరో 6 ప్లాంట్లు

రూ.1,000 కోట్లతో బయోలాజిక్స్‌ ప్లాంట్‌

2023-24లో రూ.29,000 కోట్ల టర్నోవర్‌

అరబిందో ఫార్మా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే అరబిందో ఫార్మా జెనరిక్స్‌ రంగంలో దూసుకుపోతోంది. ఫార్మా రంగంలో అత్యంత కీలకమైన యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) తయారీ కోసం 1986లో ఏర్పాటైన ఈ కంపెనీ.. ఇతర ఫార్మా కంపెనీల కొనుగోళ్లు, కొత్త ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ప్రస్తుతం భారత ఫార్మా రంగంలో మేటి సంస్థగా ఎదిగింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 350 కోట్ల డాలర్ల (సుమారు రూ.29,300 కోట్లు) టర్నోవర్‌ నమోదు చేసింది.


భారీ విస్తరణ బాటలో: కంపెనీ ప్రస్తుతం 29 ఉత్పత్తి యూనిట్లతో ఏటా 5,000 కోట్లకు పైగా ఫార్ములేషన్లు, 19,000 టన్నుల ఏపీఐల ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంది. వీటికి తోడుగా వచ్చే రెండేళ్లలో మరో ఆరు కొత్త ఉత్పత్తి యూనిట్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. మార్కెట్‌ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ప్రత్యేక ఔషధాలపై దృష్టి పెట్టింది. దీనికి తోడు అమెరికాతో సహా ప్రఽధాన మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల ఇండోనేషియాలో ఫైజర్‌/వయాట్రిస్‌ కంపెనీల నుంచి 17 బ్రాండ్లను కొనుగోలు చేసి, అక్కడి మార్కెట్‌పై పట్టు సాధించేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే 14 బయోసిమిలర్‌ ఔషధాల అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. ఇవిగాక మరో 14 పెప్టైడ్‌ ఏపీఐల కోసం డీఎంఎఫ్‌లను అమెరికాలో ఫైల్‌ చేసింది. కాగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద రూ.2,500 కోట్ల పెట్టుబడితో పెన్సిలిన్‌-జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.

బయోలాజిక్స్‌లోకి ప్రవేశం

అరబిందో ఫార్మా ఈ మధ్యనే బయోలాజిక్స్‌ ఔషధాల కాంట్రాక్టు తయారీలోకి ప్రవేశించింది. ఇందుకోసం ‘థెరానియమ్‌ బయోలాజిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో ప్రత్యేక అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసింది. బయోలాజిక్స్‌ కోసం త్వరలో రూ.1,000 కోట్లతో ఏటా రెండున్నర నుంచి మూడు కోట్ల వయల్స్‌ ఉత్పత్తి సామర్ధ్యంతో ప్రత్యేక యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్‌ నుంచి కాంట్రాక్టు పద్దతిలో బయోసిమిలర్స్‌ సరఫరా చేసేందుకు ఎంఎస్‌డీ కంపెనీతో మాస్టర్‌ సర్వీస్‌ ఒప్పందం (ఎంఎస్‌ఏ) కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులు తమ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళతాయని అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్‌, ఎండీ కే నిత్యానంద రెడ్డి తెలిపారు.

Updated Date - Sep 03 , 2024 | 05:45 AM