US Market Update: ట్రంప్‌పై ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు.. భారీగా పెరిగి తగ్గిన యూఎస్ మార్కెట్లు
ABN , Publish Date - Apr 10 , 2025 | 10:20 PM
ట్రంప్ టారిఫ్ రిలీఫ్ ప్రకటనే తడవుగా అటు ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు కూడా బాగా పెరిగాయి. జపాన్ నిక్కీ ఇండెక్స్ ఏకంగా రెండు వేల పై చిలుకు పెరిగింది. అమెరికా టెక్ సూచీ, నాస్‌డాక్, ఎస్‌అండ్‌పీ 500, డౌజోన్స్ భారీగా లాభపడ్డాయి.

Trump Insider Trading Allegations: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ప్రభావం ఆదేశం మీదే ఎక్కువగా కనిపిస్తోంది. యూఎస్ మార్కెట్లన్నీ దాదాపు వారం రోజులుగా అతలాకుతలమౌతున్నాయి. చివరికి ప్రపంచ దేశాలపై విధించిన కొత్త టారిఫ్స్ 90 రోజుల పాటు నిలిపివేస్తూ ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకున్నా ఇంకా అమెరికా మార్కెట్లలో అలజడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకన్న విషయానికొస్తే, 90 రోజుల పాటు రెసిప్రోకల్ టారిఫ్స్ నిలిపివేస్తూ ట్రంప్ సర్కారు అధికారిక ప్రకటన వెలువరించిన వెంటనే యూఎస్ మార్కెట్లు అన్నీ ఉవ్వెత్తున లేచాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. యూఎస్ టెక్ 100, యూఎస్ 30, డౌజోన్స్, ఎస్ అండ్ పి 500 వంటి అమెరికా స్టాక్ మార్కెట్ ఇండెక్సులు విపరీతమైన వేగంతో పెరగడంతో అమెరికాలో నిన్న సంబరాలు చేసుకున్నారు. ఇదే తడవుగా అటు ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు కూడా బాగా పెరిగాయి. జపాన్ నిక్కీ ఇండెక్స్ ఏకంగా రెండు వేల పై చిలుకు పెరిగింది. అమెరికా టెక్ సూచీ అయిన నాస్‌డాక్ 12 శాతం మేర రాణించింది. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 9.5 శాతం, డౌజోన్స్ 8 శాతం మేర లాభపడ్డాయి. డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన మీడియా కంపెనీ షేర్లు భారీగా పెరిగి 22.67 శాతం మేర లాభాల్లో ముగిశాయి.
అయితే, అమెరికాలో ఈ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ఇవాళ గురువారం మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచీ భారీగా పతనమౌతున్నాయి. పైన చెప్పిన అన్ని ఇండెక్సులు రెడ్ లోనే నడుస్తున్నాయి. 90 రోజుల పాటు టారిఫ్స్ పాజ్ చేశారు కదా మరెందుకు యూఎస్ మార్కెట్లు పెరిగి మళ్లీ పడుతున్నాయన్నది అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న. అయితే, దీనికి కారణం ఏంటంటే, అమెరికాలో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ, దీనిపై దర్యాప్తు కోరుతున్నారు. సుంకాల మినహాయింపు ప్రకటన కంటే ముందు ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు.. ఈ వివాదానికి కారణమైంది.
సుంకాల వాయిదా ప్రకటనకు ముందు ఉదయం డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో అధికారిక హ్యాండిల్ నుంచి కొన్ని పోస్టులు పెట్టారు. 'బి కూల్: అంతా సక్రమంగా జరుగుతుంది. అమెరికా ఇంతకు ముందుతో పోలిస్తే మరింత మెరుగుగ్గా రాణిస్తుంది' అని మొదట ఓ పోస్ట్ పెట్టారు. కాసేపటి తర్వాత 'కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం' అంటూ మరో పోస్ట్ పెట్టారు. చివర్లో DJT అని జోడించారు. డొనాల్డ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్‌ను డీజేటీగా వ్యవహరిస్తారు.
అయితే, ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత సుంకాలపై డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయం ప్రకటించారు. ఈ కంపెనీలో ట్రంప్‌నకు 53 శాతం మేర వాటా ఉంది. దీంతో ఆయన వ్యక్తిగత సంపద 415 మిలియన్ డాలర్ల మేరకు పెరిగింది. ఈ మీడియా సంస్థను ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ నిర్వహిస్తున్నారు. ట్రంప్ ఈ పిలుపునివ్వడం.. కొన్ని గంటల తర్వాత టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటున్నారు డెమోక్రట్లు. దీంతో మళ్లీ ఇవాళఒక్కసారిగా యూఎస్ మార్కెట్లు పడిపోతున్నాయి. కాగా, ట్రంప్ పోస్ట్‌ను కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ సమర్థించారు. అమెరికా గొప్ప దేశం అని చెప్పడం ఆయన ఉద్దేశమన్నారు. అమెరికా అధ్యక్షుడిగా దేశ ఆర్థికవ్యవస్థపై, మార్కెట్లపై నమ్మకాన్ని పాదుకొల్పే బాధ్యత ఆయనపై ఉందంటూ వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కుష్ దేశాయ్ కూడా అధ్యక్షుడి చర్యకు మద్దతు పలికారు.
ఇవి కూడా చదవండి:
సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ
రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్
ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఆ జట్లకే చాన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి