హోండా, నిస్సాన్ విలీనం
ABN, Publish Date - Dec 24 , 2024 | 05:40 AM
టోక్యో: జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజాలు హోండా, నిస్సాన్ చేతులు కలిపాయి. మార్కెట్లో పోటీని తట్టుకుని, కార్ల మార్కెట్లో తమ స్థానం పటిష్ఠం చేసుకునేందుకు రెండు కంపెనీలు విలీనం కావాలని నిర్ణయించాయి. ఈ మేరకు...
మేమూ మీతోనే:మిత్సుబిషి..చేయి కలిపిన జపాన్ ఆటో దిగ్గజాలు
టోక్యో: జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజాలు హోండా, నిస్సాన్ చేతులు కలిపాయి. మార్కెట్లో పోటీని తట్టుకుని, కార్ల మార్కెట్లో తమ స్థానం పటిష్ఠం చేసుకునేందుకు రెండు కంపెనీలు విలీనం కావాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఉభయ కంపెనీల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. నిస్సాన్‌తో ఇప్పటికే భాగస్వామ్యం ఉన్న మిత్సుబిషి కంపెనీ కూడా హోండా, నిస్సాన్లతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. మూడు కంపెనీలతో ఒక జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పన కోసం చర్చలు ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ మేరకు హోండా సీఈఓ తోషిహిరో మైబ్, నిస్సాన్ సీఈఓ మకోటో ఉచిడా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రక్రియ పూర్తయితే విలీన కంపెనీ అమ్మకాల్లో ప్రపంచంలోనే మూడో స్థాయిలో నిలుస్తుంది.
మూడు కంపెనీల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే అది 5,500 కోట్ల డాలర్ల (రూ.4.68 లక్షల కోట్లు) విలువ గల కంపెనీగా మారుతుంది. వాస్తవానికి హోండా, నిస్సాన్ కంపెనీల మధ్య ఈ ఏడాది మార్చి నుంచి పరిమిత భాగస్వామ్యం ఉంది. కొత్తతరం వాహన ఇంటెలిజెన్స్, విద్యుదీకరణలో సహకరించుకునేందుకు ఒక భాగస్వామ్యంపై రెండు కంపెనీలు మార్చి 15న ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు అంగీకరిస్తూ ఆగస్టు ఒకటో తేదీన మరో ఎంఓయూపై సంతకాలు చేశాయి. ఇప్పుడు తమ వ్యాపారాలను కూడా సమీకృతం చేసి ప్రపంచంలోనే ఆటో రంగంలో మూడో దిగ్గజంగా మారేందుకు సమాయత్తం అవుతున్నాయి. మరోపక్క నిస్సాన్ కంపెనీకి కూడా ఫ్రాన్స్‌కు చెందిన రెనోతో భాగస్వామ్యం ఉంది.
దీనివల్ల హోండా, నిస్సాన్, రెనో, మిత్సుబిషి నాలుగు కంపెనీ భాగస్వామ్యం జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం టయోటా, జర్మనీ ఆటో దిగ్గజం ఫోక్స్‌వేగన్‌కు కూడా గట్టి పోటీ ఇవ్వగలుగుతుందంటున్నారు. అయితే విలీనం తర్వాత కూడా టయోటానే మార్కెట్ నంబర్ వన్‌గా నిలుస్తుంది. 2023లో టయోటా 1.15 కోట్ల కార్లు తయారుచేసింది. కొత్తగా చేతులు కలిపిన మూడు కంపెనీలు ఉమ్మడిగా 80 లక్షల కార్లు (హోండా 40 లక్షలు, నిస్సాన్ 34 లక్షలు, మిత్సుబిషి 10 లక్షలు) మాత్రమే ఉత్పత్తి చేశాయి.
విలీనం ఎవరికి లాభం?
ప్రస్తుతం ప్రపంచం యావత్తు పెట్రో ఉత్పత్తులపై నడిచే కార్ల స్థానంలో పర్యావరణ అనుకూలమైన విద్యుత్ వాహనాలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈవీల తయారీకి ప్రాధాన్యం ఇచ్చే దిశగా వ్యూహాలు మార్చుకుంటున్నాయి. ఈ విభాగంలో జపాన్ ఆటో కంపెనీలు ప్రత్యర్థుల కన్నా చాలా వెనుకబడి ఉన్నాయి. చైనాకు చెందిన బీవైడీ, జీపెంగ్, నియో, లీ ఆటో వంటి కంపెనీలు తక్కువ ధరలో హైబ్రిడ్, విద్యుత్ కార్లు అందించడం ద్వారా జపాన్ ఆటో దిగ్గజాల మార్కెట్‌కు పెను సవాలు విసురుతున్నాయి. ఈవీల ఉత్పత్తిలో హోండా, నిస్సాన్ చాలా వెనుకబడి ఉన్నాయి.
ఈ రెండు కంపెనీలు భారత మార్కెట్లో త్వరలో ఈవీలు ప్రవేశపెట్టే ప్రయత్నంలో ఉన్నాయి. హోండా ఎలివేట్ ఎలక్ర్టిక్ ఎస్‌యూవీని, నిస్సాన్ అరియా ఎలక్ర్టిక్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది మార్కెట్లో ప్రవేశపెట్టనున్నాయి. ఈ రెండు ఈవీలు ప్రస్తుత భాగస్వామ్యంలో భాగంగా ఉంటాయా లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. అయినప్పటికీ హోండా, నిస్సాన్ కంపెనీలు తమ వనరులు సమీకృతం చేసుకునేందుకు, పరిశోధన, అభివృద్ధి వ్యయాలను తగ్గించుకునేందుకు, కొత్త టెక్నాలజీ కార్ల తయారీపై దృష్టి కేంద్రీకరించేందుకు ఈ విలీనం దోహదపడుతుందని నిపుణులంటున్నారు. మరోపక్క ఈ భాగస్వామ్యం ద్వారా నిస్సాన్ నుంచి హోండాకు భారీ ఎస్‌యూవీలకు అవసరమైన బాడీ ఫ్రేమ్ కూడా అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు, బ్యాటరీ-విద్యుత్ వాహనాలు, గ్యాస్-విద్యుత్ హైబ్రిడ్ వాహనాల తయారీలో నిస్సాన్‌కు అనుభవం ఉంది. కొత్త తరం ఈవీలు, హైబ్రిడ్ వాహనాల తయారీలో ఈ అనుభవం ఉపయోగపడుతుంది.
విలీన ప్రక్రియ ఎలా?
రెండు కంపెనీలకు మాతృ సంస్థగా వ్యవహరించేందుకు ఒక జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు చేస్తారు. వాటాదారులు, రెగ్యులేటరీ అధికారుల అనుమతులు లభించిన అనంతరం హోల్డింగ్ కంపెనీకి షేర్లను బదిలీ చేస్తాయి. అనంతరం నిస్సాన్ పునరుజ్జీవ ప్రక్రియను నిలకడగా అమలు పరుస్తారు. నిస్సాన్, హోండా రెండూ జాయింట్ హోల్డింగ్ కంపెనీకి అనుబంధ కంపెనీలుగా ఉంటాయి. 2026 ఆగస్టు నాటికి నిస్సాన్, హోండా కంపెనీల డీలిస్టింగ్ ప్రక్రియ పూర్తి చేసి జాయింట్ హోల్డింగ్ కంపెనీ షేర్లను టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్ చేయాలని నిర్ణయించారు.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరణ టయోటా, ఫోక్స్‌వేగన్ పోటీని తట్టుకునేందుకే...
భారత్‌లో అవకాశాలు అపారం
పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ, మౌలిక వసతుల అభివృద్ధితో వర్థమాన దేశాలైన భారత్, బ్రెజిల్ మార్కెట్లు ప్రపంచ ఆటోమొబైల్ కంపెనీలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయి. సుజుకీ భాగస్వామ్యంలోని మారుతి సుజుకీ ఇప్పటికే భారత్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంది. అందుబాటు ధరల్లో చక్కని ఇంధన సామర్థ్యం గల కార్లకు జపాన్ పెట్టింది పేరు. ఈ కారణంగానే టయోటా, హోండా, నిస్సాన్ కూడా భారత మార్కెట్లో మంచి వాటా కలిగి ఉన్నాయి. హోండా సిటీ సెడాన్‌తో 1998లో, నిస్సాన్ మైక్రా హ్యాచ్బాక్తో 2010లో భారత మార్కెట్లో ప్రవేశించాయి. భారత మార్కెట్లో ప్రవేశించి ఇంతకాలం అయినా రెండు కంపెనీలు తక్కువ పరిమిత ఉత్పత్తులతోనే నెట్టుకొస్తున్నాయి.
ప్రస్తుతం హోండా నుంచి సిటీతో పాటు అమేజ్ కాంపాక్ట్ సెడాన్, ఎలివేట్ ఎస్యూవీ మార్కెట్లో ఉండగా నిస్సాన్ నుంచి మాగ్నైట్, ఎక్స్-ట్రయల్ మాత్రమే ఉన్నాయి. ఆటో డీలర్ల సంఘం (ఫాడా) గణాంకాల ప్రకారం నవంబరు నాటికి హోండా మార్కెట్ వాటా 1.39 శాతం ఉండగా నిస్సాన్ 0.73 శాతం ఉంది. ఈ విలీనంతో వారు మరిన్ని కొత్త కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా హోండా, నిస్సాన్‌ల విలీనం భారత ఆటో కంపెనీలకు సవాలు విసిరే ఆస్కారం సైతం ఉంది. ఆ సవాలును దీటుగా ఎదుర్కొనాలంటే భారత ఆటోమొబైల్ పరిశ్రమ కూడా సరికొత్త టెక్నాలజీలతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాలు, ఇన్నోవేషన్ల దిశగా అడుగేయవలసి రావచ్చు.
Updated Date - Dec 24 , 2024 | 05:40 AM