IMF: ఆ ఏడాదికల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: గీతా గోపీనాథ్
ABN, Publish Date - Aug 16 , 2024 | 07:16 PM
భారత్ 2027 వరకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ అంచనా వేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ 2027 వరకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ అంచనా వేశారు. భారత్ వృద్ధి రేటు... అంచనాల కంటే మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ప్రైవేట్ వినియోగం పుంజుకుంటుందనీ, రుతుపవనాలు అనుకూలంగా ఉండటంతో దేశవ్యాప్తంగా పంటల విస్తీర్ణం పెరిగిందని ఆమె తెలిపారు.
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "భారత వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో మేం ఊహించిన దానికంటే చాలా మెరుగ్గా ఉంది. దానిని కొనసాగించేందుకు తీసుకునే చర్యలు ఈ ఏడాది మా అంచనాలపై ప్రభావం చూపుతాయి. ప్రైవేట్ వ్యయాలు కూడా పుంజుకోవడం మేం గమనిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా వినియోగం పుంజుకోవడం ఆర్థిక వృద్ధికి మంచి సంకేతం. 2023లో ప్రైవేటు వ్యయాల వృద్ధి 4 శాతం మాత్రమే ఉంది. గ్రామాల్లో వ్యయాలు పెరిగేకొద్ది ప్రైవేటు వ్యయాల వృద్ధి కూడా పెరుగుతుంది. వర్షాలు బాగా కురవడంతో పంట ఉత్పత్తి సాధ్యమవుతుంది. తద్వారా గ్రామీణ వినిమయం కూడా పుంజుకుంటుంది. ఈ కారణాలతోనే భారత వృద్ధి రేటు అంచనాలు వేశాం" అని ఐఎంఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ గీతా గోపినాథ్ వెల్లడించారు.
కేంద్రం అంచనాల కంటే ఎక్కువే..
ఎఫ్ఎంసీజీ, ద్విచక్ర వాహనాల విక్రయాలు, అనుకూల రుతుపవనాల డేటాను పరిగణనలోకి తీసుకుని ఐఎంఎఫ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి రేటు అంచనాను 7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తాజా ద్రవ్య విధాన కమిటీ ప్రకటనలలో అంచనా వేసిన దానికి ఇది అనుగుణంగా ఉంది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ 2024-25కుగానూ జీడీపీ వృద్ధి రేటును 7.2 శాతంగా అంచనా వేశారు. ఎంపీసీ 2024-25 Q1కి వాస్తవ జీడీపీని 7.1 శాతంగా, Q2 వద్ద 7.2 శాతంగా, Q3 వద్ద 7.3 శాతంగా, Q4లో 7.2 శాతంగా అంచనా వేశారు. కేంద్ర బడ్జెట్ - 2024కి ఒక రోజు ముందు విడుదల చేసిన ఆర్థిక సర్వే జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం కంటే ఐఎంఎఫ్ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
Updated Date - Aug 16 , 2024 | 07:16 PM