SBI Interest Rates: ఎస్‌బీఐ అనూహ్య నిర్ణయం.. పెరగనున్న ఈఎంఐలు!
ABN, Publish Date - Jul 15 , 2024 | 01:01 PM
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ (SBI) నుంచి రుణం తీసుకోవడం ఇవాళ్టి (సోమవారం) నుంచి మరింత ప్రియం కానుంది. వడ్డీ రేట్లు భారం పెరగనుంది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ (SBI) నుంచి రుణం తీసుకోవడం ఇవాళ్టి (సోమవారం) నుంచి మరింత ప్రియం కానుంది. వడ్డీ రేట్లు భారం పెరగనుంది. ఈ మేరకు వేర్వేరు కాల పరిమితులకు సంబంధించిన లోన్లపై ఎంసీఎల్ఆర్‌ను (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్) 10 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. సవరించిన రేట్లు నేటి నుంచి (జులై 15, 2024) అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
గృహ, వాహనాలతో పాటు ఇతర రుణాలకు ఎంసీఎల్‌ఆర్ పెంపు వర్తిస్తుందని వివరించింది. తాజా పెంపుతో వరుసగా రెండు నెలల్లో ఎస్‌బీఐ వడ్డీ రేట్లను పెంచినట్టయింది. జూన్ నెలలో కూడా ఎస్‌బీఐ రుణ రేట్లను సవరించిన విషయం తెలిసిందే. ఫలితంగా ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానించిన లోన్లకు సంబంధించి రుణగ్రహీతలపై ఈఎంఐల(EMI) భారం పెరగనుంది.
ఎస్‌బీఐ కొత్త వడ్డీ రేట్లు ఇవే..
ఒక నెల వ్యవధి రుణంపై ఎంసీఎల్‌ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు మేర పెంచడంతో వడ్డీ రేటు 8.35 శాతానికి పెరిగిందని ఎస్‌బీఐ వెల్లడించింది. ఇక మూడు నెలల రుణంపై ఎంసీఎల్‌ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.40 శాతానికి చేరుకుందని వివరించింది. ఇక 6 నెలలు, ఒక ఏడాది, 2 సంవత్సరాల కాలానికి సంబంధించిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేట్లు 10 బేసిస్ పాయింట్లు మేర పెంచడంతో వాటి వడ్డీ రేట్లు వరుసగా 8.75 శాతం, 8.85 శాతం, 8.95 శాతాలకు పెరిగాయి. ఇక మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు మేర పెంచడంతో రుణంపై వడ్డీ రేటు 9 శాతానికి చేరిందని వివరించింది.
అసలు ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటి?
ఎంసీఎల్ఆర్ (Marginal Cost of Funds Based Lending Rate) అనేది రుణ రేటుని తెలియజేస్తుంది. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఇటీవల జరిగిన ద్వైమాసిక సమీక్షా సమావేశంలో రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్టు నిర్ణయించింది. దీంతో అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందాలనుకున్న రుణగ్రహీతలకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులు వడ్డీ రేట్ల విషయంలో రుణగ్రహీతలకు ఉపశమనం దక్కుతుంది.
ఇవి కూడా చదవండి
యూజర్లకు మళ్లీ షాకిచ్చిన ఎయిర్ టెల్
అనంత్-రాధిక పెళ్లిలో టెక్నాలజీ చుశారా.. ఓ రేంజ్‌లో వాడేశారు
For more Business News and Telugu News
Updated Date - Jul 15 , 2024 | 01:09 PM