Stock Market: దేశీయ సూచీలకు లాభాల జోరు.. సెన్సెక్స్ 750 పాయింట్లు జంప్..
ABN, Publish Date - Nov 29 , 2024 | 04:01 PM
ఫార్మా, ఇన్‌ఫ్రా, కమోడిటీ రంగాలు రాణించడం స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సోల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు వరుసగా మూడో రోజు కూడా భారీ లాభాలను ఆర్జించాయి.
గురువారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు శుక్రవారం లాభాల బాటలో పయనించాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించి లాభాల్లోనే రోజును ముగించాయి. ఫార్మా, ఇన్‌ఫ్రా, కమోడిటీ రంగాలు రాణించడం స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సోల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు వరుసగా మూడో రోజు కూడా భారీ లాభాలను ఆర్జించాయి. ఇక, నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే పయనించి లాభాల్లో ముగిసింది (Business News).
గురువారం ముగింపు (79, 0043)తో పోల్చుకుంటే 10 పాయింట్ల స్వల్ప నష్టంతో ఫ్లాట్‌గా ఉదయం మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నెమ్మదిగా లాభాల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత రోజంతా లాభాల బాటలోనే సాగింది. ఒక దశలో 900 పాయింట్లు లాభపడి 79, 923 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు 759 పాయింట్ల లాభంతో 79, 802 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 13 పాయింట్ల లాభంతో రోజును ప్రారంభించింది. చివరకు 216 పాయింట్ల లాభంతో 24, 131 వద్ధ స్థిరపడింది.
సెన్సెక్స్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ, ఎల్‌ఐసీ ఇండియా, హడ్కో షేర్లు లాభాలు అందుకున్నాయి. పూనావాలా ఫిన్‌కార్ప్, కోల్గేట్, హెచ్‌ఎఫ్‌సీఎల్, కేపీఐటీ టెక్నాలజీస్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 91 పాయింట్ల లాభంతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.48గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 29 , 2024 | 04:01 PM