Sara Sharif Case: తాళాలు దాచిందని కూతుర్ని చంపేశాడు.. ఛీ వీడు తండ్రా?
ABN, Publish Date - Nov 02 , 2024 | 04:23 PM
Sara Sharif Case: కాపాడాల్సిన తండ్రే కాలయముడైతే! బాగోగులు చూసుకోవాల్సినోడే ఉసురు తీయాలని అనుకుంటే.. ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మనం చెప్పుకోబోయే ఓ వ్యక్తి గురించి తెలిస్తే ఛీ వీడు తండ్రేనా అని అనకమానరు.
Sara Sharif Case: తల్లిదండ్రుల్లో ఎక్కువగా తల్లి గొప్పతనం గురించే చాలా మంది చెబుతుంటారు. అయితే నాన్న ఏమీ తక్కువ కాదు. పిల్లల పెంపకం దగ్గర నుంచి విద్యాబుద్ధులు చెప్పించడం, ఎదుగుదల, పెళ్లి వరకు అన్ని విషయాల్లోనూ తండ్రి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు తండ్రితో మంచి అనుబంధం ఉంటుంది. గారాబంగా పెంచుతారు కాబట్టి తండ్రి అంటే వాళ్లకు ఎంతో ఇష్టం. అయితే కొందరు వ్యక్తులు మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. పిల్లల్ని అడ్డగోలుగా కొడుతూ, తిడుతూ నాన్న అనే పేరు చెబితే జడుసుకునేలా చేస్తారు. తండ్రి అనే పిలుపునకు కళంకం తీసుకొస్తారు. అలాంటి ఓ తండ్రి గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం..
గుంజీలు తీయించి చంపేశాడు
ఆ పాపకు పదేళ్లు. ఎంతో అందంగా ఉంటుంది. అందరు పిల్లల్లాగే ఆనందంగా సాగాల్సిన బాల్యం. ఆడుతూ, పాడుతూ చదుకోవాల్సిన వయసు. కానీ సైకో తండ్రి వల్ల ప్రాణాలు కోల్పోయింది. తండ్రి చేసిన టార్చర్‌కు చనిపోయింది. గుంజీలు తీయాల్సిందేనంటూ వేసిన పనిష్మెంట్‌కు తట్టుకోలేక మరణించింది. ఈ ఘటన గతేడాది బ్రిటన్‌లో చోటుచేసుకుంది. ఈ కేసులో తాజాగా సంచలన విషయాలు బయటపడ్డాయి. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.. అది 2023వ సంవత్సరం. పాకిస్థాన్‌కు చెందిన షరీఫ్ (42 ) అనే వ్యక్తి తన రెండో భార్య బాతుల్‌తో కలసి బ్రిటన్‌లోని సర్రేలో ఉంటున్నాడు. అంతా బాగానే ఉన్నా కూతురు విషయంలో షరీఫ్ ప్రవర్తన మాత్రం ఎవరికీ నచ్చేది కాదు.
స్వదేశానికి ఉడాయించాడు
రెండో భార్య బాతుల్ మాటలు విని పదే పదే కూతురు సారా మీద చేయిచేసుకునేవాడు షరీఫ్. ఇదే క్రమంలో తన నుంచి తాళాలు దాచి పెట్టిందనే నెపంతో ఓ రోజు దారుణంగా కొట్టాడు. గాయాలతో బాధపడుతున్న కూతురికి ట్రీట్‌మెంట్ చేయించాల్సింది పోయి రాత్రి అంతా గుంజీలు తీయించాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన పాప ప్రాణాలు విడిచింది. కూతురి మరణంతో అతడి కాళ్లూ చేతులు ఆడలేదు. భయానికి గురైన షరీఫ్.. తట్టాబుట్టా సర్దుకొని అక్కడి నుంచి స్వదేశానికి ఉడాయించాడు.
మేకప్ వేయించి స్కూలుకు
అప్పట్లో సంచలనంగా మారిన ఈ కేసు ఇంకా కోర్టులోనే నానుతోంది. అయితే విచారణలో క్రమంగా ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. కూతురు సారా మీద తండ్రి షరీఫ్ చేయి చేసుకోవడం ఇదే తొలిసారి కాదని.. గతంలోనూ ఆమెను అనేకమార్లు కొట్టాడని తెలిసింది. గాయాలు బయటపడకుండా మేకప్ వేయించి, సన్ గ్లాసెస్‌తో కవర్ చేసి స్కూలుకు పంపేవాడట. పాక్‌కు వెళ్లిపోయే ముందు పాప శరీరం పక్కన ఓ లెటర్‌ను కూడా రాసి వెళ్లాడట. సారాను తానే చంపానని.. కావాలని చేయలేదని, అనుకోకుండా జరిగిపోయిందని ఆ లేఖలో షరీఫ్ రాసుకొచ్చాడు. ఈ హత్య గురించి తెలిసిన నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఛీ.. వీడూ ఓ తండ్రేనా అని మండిపడుతున్నారు. ఇలాంటి నరరూప రాక్షసుడ్ని శిక్షించకుండా వదలొద్దని కోరుతున్నారు.
Also Read:
భార్యపై కోపం.. ఆ భర్త తన పిల్లలతో కలిసి ఏం చేశాడో తెలిస్తే కన్నీళ్లు రాక మానవు.
ఇదోరకం మోసం.. కొత్త క్రెడిట్ కార్డు ఇస్తామని టోకరా
ఏమార్చి.. నగలు కాజేసి..
For More Crime And Telugu News
Updated Date - Nov 02 , 2024 | 04:24 PM