ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చలిలో భక్తి బాట

ABN, Publish Date - Nov 10 , 2024 | 10:51 AM

జీవితంలో ప్రతి ఒక్కరూ విధిగా పర్యటించి, తరించవలసిన యాత్ర ‘చార్‌ధామ్‌’. కష్టసాధ్యమైనా, ఎంతటి ప్రయాస అయినా ఈ యాత్ర పూర్తి చేసేవారిది పూర్వజన్మ సుకృతమే! హిమాలయాల్లో నెలకొన్న నాలుగు అపురూప పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదారీనాథ్‌, బదరీనాథ్‌. వీటిని దర్శించడమే చార్‌ధామ్‌ యాత్ర...

జీవితంలో ప్రతి ఒక్కరూ విధిగా పర్యటించి, తరించవలసిన యాత్ర ‘చార్‌ధామ్‌’. కష్టసాధ్యమైనా, ఎంతటి ప్రయాస అయినా ఈ యాత్ర పూర్తి చేసేవారిది పూర్వజన్మ సుకృతమే! హిమాలయాల్లో నెలకొన్న నాలుగు అపురూప పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదారీనాథ్‌, బదరీనాథ్‌. వీటిని దర్శించడమే చార్‌ధామ్‌ యాత్ర...

విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ప్రయాణంతో మా ‘యాత్ర’ ఆరంభమయింది. ఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి జాతిపితకు నివాళులు అర్పించి, అదేరోజు ‘హరిద్వార్‌’కు బయలుదేరాం.


- హరిద్వార్‌

హరి అంటే గంగ, ద్వార్‌ అంటే ద్వారం అని అర్థం. గంగకు ద్వారం వంటి క్షేత్రం హరిద్వార్‌. ఇక్కడ సాయంత్రం వేళ ‘గంగా హారతి’ అద్భుతంగా ఉంటుంది. రోప్‌ వే మార్గంలో మానసాదేవి టెంపుల్‌, చండీ టెంపుల్‌ దర్శించడం ఒక అద్భుతానుభూతిని కల్గించింది. దక్షుని గుడి, గీతాభవన్‌, పవన్‌ ధామ్‌, వైష్ణవీ దేవి, భారత్‌మాత మందిరం ఇక్కడ దర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు.

హరిద్వార్‌ దాటాక దేవభూమి ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఆరు నెలలు దేవతలు సంచరిస్తారట. చార్‌ధామ్‌ యాత్ర కేవలం ఆరు నెలల కాలమే ఉంటుంది. మరో ఆరు నెలలు ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. ఏడాదిలో మే నెల మాత్రం ఈ ప్రాంతాల సందర్శనకు అనుకూలమైన కాలం. సెప్టెంబర్‌దాకా యాత్ర కొనసాగినా, వర్షాకాలం మొదలైందంటే ఇబ్బందులే!


హరిద్వార్‌ నుంచి అదే రోజు రాత్రికి హనుమాన్‌ చెట్టికి చేరుకున్నాం. అక్కడ రాత్రి విశ్రాంతి తీసుకుని, మరుసటి రోజు ఉదయాన్నే యమునోత్రికి బయలుదేరాం. చుట్టు ప్రక్కల ప్రకృతి దృశ్యాలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయో, ప్రయాణం అంత భయంకరంగా ఉంటుంది. గంటకు 20 కి.మీ.ల కంటే వేగంగా వాహనం ప్రయాణించదు. లోయ అంచుల నుండి ప్రయాణం చేస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒక్క బండరాయి విరిగి పడినా, యాత్రకు అవరోధం కలుగుతుంది.


- యమునోత్రి

మధ్యాహ్నానికి ‘యమునోత్రి’కి చేరుకున్నాం. డోలీలు, గుర్రాలపై తీసుకెళ్లేవారి హడావుడి మామూలుగా ఉండదు. యమునోత్రి 3293మీ. (10804 అడుగులు) ఎత్తు ఉంటుంది. యమునా నది జన్మస్థలం. యమునా ఆలయాన్ని 19వ శతాబ్దంలో జైపూర్‌ మహారాణి గులేరియా నిర్మించారు. దేవత నల్ల పాలరాతితో ఉంటుంది. భక్తులు ఇక్కడ ఉన్న వేడి నీటి బుగ్గలలో ముంచడానికి, ఈ పుణ్య క్షేత్రంలో సమర్పించాలని ఒక మస్లిన్‌ గుడ్డలో బియ్యం, బంగాళా దుంపలను సిద్ధం చేస్తారు. వండిన అన్నం తీసుకు వెళతారు. యమునా మాత దర్శనం చేసుకోగానే యమునోత్రిలో హఠాత్తుగా వాతావరణంలో మార్పు మొదలయింది. మంచుతో కూడిన వర్షం కురవడం ఆరంభం అయింది. ఆ చలిని భరించడం కష్టం. అలా వణకుతూనే డోలీ ద్వారా క్రిందకు దిగి రూమ్‌కు చేరుకున్నాం. కేవలం 8 కి.మీ దూరమే అయినా డోలీ ప్రయాణం ఇబ్బందిగానే సాగింది.

మరుసటిరోజు ‘గంగోత్రి’కి బయలు దేరాం. చాలా ఆలస్యంగా సాగే యాత్రలు ఇవి. రెండు రోజులకు ఒక యాత్ర పూర్తి అయితే అదృష్టమే! పగలంతా ప్రయాణం, ఏ రాత్రికో కొద్దిగా అనువైన ప్రదేశంలో విశ్రమించడం.


- గంగోత్రి

ఉత్తర కాశీ జిల్లాలోని ‘గంగోత్రి’ భాగీరథి ఒడ్డున ఉంది. ఇది 3,100 మీ. (10,200 అడుగులు) ఎత్తులో ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం, శివుడు తన జుత్తు నుండి శక్తిమంతమైన నదిని విడుదల చేసినప్పుడు గంగాదేవి కిందకు దిగింది. ఈ నది గోముఖ్‌ నుంచి ప్రవహించడం మొదలు పెడుతుంది. ఆ ప్రాంతానికి వెళ్ళడం కష్టసాధ్యం కనుక మేము గోముఖ్‌ వరకు వెళ్ళలేదు. భగీరథ రాజు శివుడిని పూజించిన పవిత్ర రాయికి సమీపంలో గంగామాతకు అంకితం చేసిన గంగాదేవి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న భగీరథ శిల... భగీరథుడు ధ్యానం చేసిన పవిత్ర ప్రదేశం. గంగోత్రికి వెళ్ళే దారిలోనే గుప్తకాశి అనే చారిత్రక పుణ్య ప్రదేశాన్ని దర్శించుకున్నాం. గంగోత్రికి వెళ్ళే దారి నడక మార్గంలోనే వుంటుంది కనుక, అంత శ్రమ అనిపించలేదు.


- కేదార్‌నాథ్‌

చార్‌ధామ్‌ యాత్రలో అతి ముఖ్యమైనది, అత్యంత క్లిష్టమైనది ‘కేదార్‌నాథ్‌’ యాత్ర. కేదార్‌నాథ్‌ హిందువుల పుణ్యక్షేత్రాల్లో ప్రముఖ మైనది కూడా. ఇది సముద్ర మట్టానికి 3,584మీ. (11,657 అడుగులు) ఎత్తులో ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఇది. పదకొండు జ్యోతిర్లింగాల దర్శనం బహు తేలిక. ఈ జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం లభించాలంటే మాత్రం ఎంతో అదృష్టం ఉండాలి.

ఈ క్షేత్ర విశిష్టత ఏమిటంటే, శివుడు లింగ రూపంలో లేకపోవడం. గర్భగుడిలో స్వయంభువుగా దర్శనం ఇచ్చే పరమేశ్వరుడు, ఎద్దు వెనుక భాగంతో దర్శనం ఇస్తాడు. తల భాగం నేపాల్‌లోని ఖాట్మండులో దర్శన రూపంలో ఉంటుంది. ఆలయ వెనుక భాగంలో ఆది శంకరాచార్యుల సమాధి ఉంది. గతంలో వచ్చిన వరదల కారణంగా నడక మార్గం పెరిగింది. సుమారు 20 కి.మీ. ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్‌ అందదు.


గౌరీకుండ్‌ నుంచి డోలీలు, గుర్రాల సౌకర్యం ఉంటుంది. అయితే, వీటి ద్వారా ప్రయాణం అతి ప్రయాస అనిపిస్తుంది. మేము పాటా నుంచి హెలికాప్టర్‌ సౌకర్యం వినియోగించుకున్నాం. క్షణక్షణానికి వాతావరణం మారుతుంది కనుక హెలికాప్టర్‌ 10 నిముషాల ప్రయాణంలో కూడా గమ్యం చేరుతుందా అనే కంగారు ఉంటుంది. దర్శనం అనంతరం అదే హెలికాప్టర్‌ ద్వారా పాటాకు చేరుకున్నాం.


- బదరీనాథ్‌

చార్‌ధామ్‌లో చివరి మజిలీ ‘బదరీనాథ్‌’. నరనారాయణులు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం ఇది. చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది ఈ క్షేత్రం. ఈ కొండలలో అలకనంద నది ఉవ్వెత్తున ప్రవహిస్తుంది. ఇది 3,133మీ. ఎత్తులో ఉంటుంది. గంగ 12 భాగాలుగా చీలి ఒక భాగం అలకనందగా ఉద్భవించింది. బదరీనాథ్‌ విష్ణుమూర్తి నివాసం అని భక్తజనుల విశ్వాసం. బదరీ అంటే రేగుపండు. స్కంద పురాణం ప్రకారం ఇటువంటి పవిత్ర ప్రదేశం ఎక్కడా ఉండదు. గడ్డ కట్టే చలి ప్రదేశంలో వేడి నీటితో కూడిన ‘తప్తకుండ్‌’ ఉండటం ఈ క్షేత్రంలో అద్భుతమే! భక్తులు విధిగా అక్కడ స్నానం ఆచరిస్తారు.


సమీపానే ఉన్న ‘బ్రహ్మ కపాలం’ అతి పవిత్ర ప్రదేశం. ఇక్కడ పూర్వీకులకు, మాతా పితరులకు పిండ ప్రదానాలు చేస్తే జీవిత పర్యంతం ఏటా ఇక పిండ ప్రధానాలు చేయనవసరం లేదట! అలకనంద ఒడ్డునే ఈ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడికి అతి సమీపంలో ‘మానా’ (భారతదేశం చివరి గ్రామం)లో వ్యాసమహర్షి భారతాన్ని చెపుతుంటే, వినాయకుడు లిఖించాడు అనే ఆధారాలు గల గుహ ఉంది.

తిరుగు ప్రయాణంలో రుషికేశ్‌, మధుర, బృందావనం, గోకులం వంటి పవిత్ర పుణ్య క్షేత్రాలు దర్శించుకుని తృప్తిగా ఢిల్లీలో రైలెక్కి విజయవాడకు చేరుకున్నాం.

- పంతంగి శ్రీనివాసరావు

91822 03351

Updated Date - Nov 10 , 2024 | 10:51 AM