Nagula Chavithi 2024: ఇంతకీ నాగుల చవితి ఏ రోజు వచ్చింది.. స్వామి వారిని ఎలా ఆరాధించాలి?
ABN, Publish Date - Nov 03 , 2024 | 01:34 PM
కార్తీక శుద్ద శుక్ల పక్ష చవితి రోజు నాగుల చవితి జరుపుకుంటారు. అంటే నవంబర్ 5వ తేదీన స్వామి వారు భక్తుల నుంచి విశేష పూజలందుకోనున్నారు. ఈ రోజు స్వామి వారికి ఏం నైవేద్యంగా పెట్టాలి.. ఏ స్త్రోత్రం పారాయణం చేయాలంటే..
ఏడాదిలో అత్యంత పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. ఈ మాసంలో అన్ని రోజులు శుభ దినాలే. ఈ మాసంలో వచ్చే పండగల్లో నాగుల చవితి ఒకటి. కాగా మరొకటి నాగ పంచమి. నాగుల చవితి వెళ్లిన మరునాడే ఈ నాగ పంచమి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే భక్తులు.. ఈ రెండు రోజులు నాగుల పుట్టలో పాలు పోస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో అభిషేకాలు సైతం నిర్వహిస్తారు.
నాగులకు.. అంటే పాములకు పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. కార్తీక మాసంలో శుక్ల పక్షం చవితి తిథి రోజున ఈ నాగుల చవితి వస్తుంది. ఈ రోజు నాగ దేవతలను పూజించడం ద్వారా భక్తులు సర్ప భయాలను తొలగించు కోవచ్చు. అలాగే సంతాన సిద్దితోపాటు కుటుంబంలో సుఖ సంతోషాలను సైతం పొందవచ్చని శాస్త్ర పండితులు చెబుతారు.
ఇక నాగుల చవితి పండగకు సంబంధించి పురాణ కథలు చాలనే ఉన్నాయి. ముఖ్యంగా నాగ దేవతను పూజించడం ద్వారా సర్ప దోషం తొలుగుతుందని భక్తులంతా బలంగా నమ్ముతారు.
1)
శుక్ల పక్షం చవితి తిథి రోజు నాగ దేవతను ఆరాధించడం వల్ల.. సర్ప దోష నివారణ కలుగుతుంది.
2)
సంతానం లేని వారు.. ఈ రోజు సర్ప దేవతలను పూజించాలి. తద్వారా సంతాన భాగ్యం కలుగుతుంది. దీంతో కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
3)
పల్లె ప్రాంతాల్లో రైతులు.. తమ పంటలను రక్షించుకునేందుకు నాగ దేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. పంటలు సమృద్ధిగా పండాలని.. అలాగే వ్యవసాయ భూమి సారవంతం కావాలని వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థిస్తారు. దీంతో పంటలు అధిక దిగుబడికి, పశు పక్ష్యాదులకు నాగదేవత రక్షణ చేకూరుస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
4)
ఈ రోజు సుబ్రహ్మణ్యుడిని ఆరాధించడం ద్వారా జీవితంలో సుఖ శాంతులు కలుగుతాయి. అలాగే సర్ప దోషంతోపాటు ఇతర వ్యాధులకు సంబంధించిన దోషాలు సైతం తొలుగుతాయని భక్తులు భావిస్తారు.
నాగుల చవితి రోజు.. భక్తులు ఏం చేయాలి..
వివిధ ప్రాంతాల్లో పుట్టలుంటాయి. అలాగే పలు దేవాలయాల్లో నాగ ప్రతిమలు ఉంటాయి. పుట్టల్లో పాలు పోయ్యాలి. ఇక దేవాలయాల్లోని ప్రతిమల ముందు ఆవు పాలు ఉంచాలి. తులసి దళాలు, పువ్వులను స్వామి వారికి సమర్పించాలి. అలాగే పంచామృతం నైవేద్యంగా అందించాలి. స్వామి వారికి పాలు సమర్పించడం వల్ల సర్ప దోషాలు తొలగి పోతాయని భక్తులు నమ్ముతారు. అలాగే స్వామి వారికి నువ్వులతో చేసిన చిమ్మిలి ఊండతోపాటు బెల్లం, పెసరపప్పు, చలివిడి నైవేద్యంగా సమర్పించాలి. అదే విధంగా నాగుల చవితి, నాగ పంచమి రోజు.. సుబ్రహ్మణ్యాష్టం 8 సార్లు చదవాలి. అదే విధంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సైతం ఈ రోజు పారాయణం చేయడం వల్ల భక్తులు మంచి ఫలితాలను అందుకుంటారని శాస్త్ర పండితులు వెల్లడిస్తున్నారు.
ఇంతకీ నాగుల చవితి ఎప్పుడు..
ఈ ఏడాది నాగుల చవితి.. నవంబర్ 4వ తేదీన జరుపుకోవాలా లేకుంటే.. 5 తేదీ జరుపుకోవాలా అనే ఓ సందిగ్దం అయితే భక్తుల్లో నెలకొంది. ఈ ఏడాది క్యాలెండర్లో నాగుల చవితి నవంబర్ 4వ తేదీ నిర్వహించుకోవాలని ఉంది. మరికొందరు మాత్రం నవంబర్ 5వ తేదీన జరుపుకోవాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఓ సారి పరిశీలిస్తే.. నాగుల చవితి శాస్త్ర ప్రకారం చవితి రోజునే జరుపుకోవాలి. అంటే కార్తీక శుద్ధ చవితి రోజు నాగుల చవితి పండగ జరుపుకోవాలని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. నవంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు చవితి ప్రారంభం కానుంది. ఇది నవంబర్ 5వ తేదీ రాత్రి 8. 56 నిమిషాల వరకు ఉంటుంది. దీంతో సూర్యోదయం నుంచి సంధ్యా సమయం వరకు చవితి తిధి ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 5వ తేదీన నాగుల చవితి జరుపుకోవాలని శాస్త్ర పండితులు భక్తులకు సూచిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 03 , 2024 | 01:35 PM