ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుమల వేదం.. విశ్వవ్యాప్తం

ABN, Publish Date - Dec 01 , 2024 | 08:21 AM

తిరుమల మహత్యమే అలాంటిది..! ఆ ఏడుకొండల్లో పరుచుకున్న ప్రకృతి సౌందర్యం నడుమ నిల్చుంటే చాలు.. ఆధ్యాత్మిక సౌరభంతో మనసు పులకిస్తుంది.. గోవింద నామస్మరణతో తనువు పుణీతం అవుతుంది. అక్కడే శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నెలకొల్పిన వేద విజ్ఞాన పాఠశాల ఆవరణలోకి వెళితే.. ‘వేదంలా ఘోషించే గోదావరి..’ పాట గుర్తుకు వస్తుంది.

తిరుమల మహత్యమే అలాంటిది..! ఆ ఏడుకొండల్లో పరుచుకున్న ప్రకృతి సౌందర్యం నడుమ నిల్చుంటే చాలు.. ఆధ్యాత్మిక సౌరభంతో మనసు పులకిస్తుంది.. గోవింద నామస్మరణతో తనువు పుణీతం అవుతుంది. అక్కడే శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నెలకొల్పిన వేద విజ్ఞాన పాఠశాల ఆవరణలోకి వెళితే.. ‘వేదంలా ఘోషించే గోదావరి..’ పాట గుర్తుకు వస్తుంది. నిజంగానే అక్కడున్న విద్యార్థులు వేదాలను నేర్చుకుంటూ.. ఆధ్యాత్మిక ప్రవాహంలా.. సంస్కృత శ్లోకాలను పఠిస్తూ.. జలపాతంలా ఆకట్టుకుంటారు. నూటా నలభై ఏళ్ల చరిత్ర కలిగిన ఆ వేదపాఠశాల.. భారతీయ వేదాలను పరిరక్షిస్తూ.. సనాతన ధర్మాన్ని కాపాడుతూ.. ఒక యజ్ఞమే చేస్తోంది.. అందుకే తిరుమల వేదం ఇప్పుడు విశ్వవ్యాప్తం..!

ఉదయాన్నే నక్షత్రాలు నేలకు దిగినట్లు.. శ్వేతవస్త్రాలతో తళతళ మెరిసిపోతున్న విద్యార్థులు వేద మంత్రోచ్ఛరణ చేస్తున్నారు. ఆ సంస్కృత శ్లోకాలతో.. చుట్టూ ఆవహించిన పచ్చటి ప్రకృతి ఆధ్యాత్మిక ఆనందంలో మునిగినట్లు కనిపిస్తోంది. ప్రతి రోజూ కనిపించే ఈ అపురూప దృశ్యం ఎక్కడో కాదు.. తిరుమలలోని వేద విజ్ఞాన పాఠశాలలో!.


‘తిరుమల-తిరుపతి దేవస్థానం’ (టీటీడీ) బాధ్యతల్లో అత్యంత ప్రధానమైనది ‘వేదపరిరక్షణ’. పురాతన కాలం నుంచి భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే వేదాలను పరిరక్షించడంతో పాటు ప్రచారం చేయడం, సమాజహితం కోసం వేదవిజ్ఞానాన్ని అందరికీ అందించేందుకు కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న ధర్మగిరిలో ‘శ్రీ వేంకటేశ్వర వేదవిజ్ఞానపీఠం’ (వేదపాఠశాల) ఏర్పాటు చేశారు. సుమారు 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతి ఒడిలో వెలసిందీ విద్యాలయం. గురుకుల విద్యాభ్యాసం తరహాలో విద్యను బోధించేందుకు అనువుగా పాఠశాలను తీర్చిదిద్దారు. ఇక్కడ వేదం, ఆగమం, స్మార్థం, దివ్యప్రబంధం కోర్సులున్నాయి. శాస్ర్తాలు, దర్శనాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రం, పురాణేతిహాసాలతో పాటు పరిశోధనలకు పెద్దపీట వేస్తూ నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఎస్వీ వేదవిజ్ఞానపీఠం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.


ఏళ్ల కిందటే ఏర్పాటు..

1843 నుంచి 1933 వరకు ఆలయ పాలనను ఉత్తరాదికి చెందిన హథీరాం మఠం మహంతులే పర్యవేక్షించారు. అప్పట్లోనే వేదాన్ని పరిరక్షించడంతో పాటు విశ్వవ్యాప్తం చేయాలని నాటి పాలకులు భావించారు. ఇందులో భాగంగానే శ్రీవేంకటేశ్వర వేదపాఠశాలను తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో నమ్మాళ్వార్‌ సన్నిధిలో 1884 మార్చి 28వ తేదీన తారణనామ సంవత్సర చైత్రశుక్ష్ల, ద్వితీయ రేవతి నక్షత్రంలో శుక్రవారం రోజున ప్రారంభించారు. కృష్ణ యజుర్వేదంలో తైత్రీయశాఖ, వైఖాన ఆగమం, దివ్యప్రబంధం శాఖలను బోధించడం మొదలుపెట్టారు. ఇలా 1954 వరకు గోవిందరాజస్వామి ఆలయంలోనే పాఠశాల కొనసాగింది. తర్వాత శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఏర్పాటు చేశారు.


అయితే క్రమంగా భక్తుల రద్దీ పెరగడం మొదలైంది. దీంతో వేదవిద్యార్థుల దృష్టి తప్పకూడదని 1979లో శ్రీవారి ఆలయం వెనుకభాగంలోకి (ప్రస్తుతం వసంతమండపం ఉన్న ప్రదేశం) మార్చారు. ఆ తర్వాత విస్తరణలో భాగంగా తిరుపతిలోని నరసింగాపురానికి మార్చారు. ఇలా కొంతకాలం పాటు వేదపాఠశాల ద్వారా వందలమంది విద్యార్థులకు వేదాలను అందించారు. అయితే ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో స్వామి సన్నిధి సమీపంలోనే వేదపాఠశాలను ఏర్పాటు చేయాలని భావించింది టీటీడీ. తిరుమలలోని ధర్మగిరిలో (1992లో) దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో పాఠశాలను నిర్మించింది. 2012లో ‘వేదవిజ్ఞానపీఠం’గా మారింది. ఇలా దాదాపు నూటా నలభై ఏళ్ల చరిత్ర కలిగిన విద్యాలయం దేశంలోనే ప్రాచీనమైనదిగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు దాదాపు 6,500 మందికిపైగా విద్యార్థులు ఇక్కడ వేదవిద్యను అభ్యసించడం విశేషం.


ఏఏ శాఖలు ఉన్నాయంటే..?

వేద పాఠశాలలో ప్రస్తుతం 18 శాఖలు ఉన్నాయి. 7 వేద శాఖలు, 5 ఆగమ శాఖలు, 4 స్మార్థ శాఖలు, ఒక దివ్యప్రబంధ శాఖ, సంస్కృతం కలిపి 18 శాఖలు. ఋగ్వేదంలో శాఖల శాఖ, శుక్ల యజుర్వేదంలో కాన్వ శాఖ, కృష్ణ యజుర్వేదంలో తైత్రీయశాఖ, మైత్రాయని శాఖ (7 ఏళ్లు), సామవేదంలో కౌతుమి శాఖ, జైయమినీయ శాఖ, ఆధర్వణవేదంలో షౌవనక శాఖ (7 ఏళ్లు) ఉన్నాయి. రెండు శాఖలు మినహా మిగిలినవన్నీ 12 ఏళ్ల పాటు విద్యాభ్యాసం కొనసాగుతుంది. ఆగమాల్లో.. వైఖానస ఆగమం, పాంచరాత్ర ఆగమం, చాతధశ్రీవైష్ణవ ఆగమం, శైవ ఆగమం, తంత్రసార ఆగమం బోధిస్తారు. వీటి కాలపరిమితి 8 ఏళ్లు. ఇక, ఇదే కాలపరిమితితో స్మార్థాల్లో.. ఋగ్వేద స్మార్థం, శుక్లయజుర్వేద స్మార్థం, కృష్ణయజుర్వేద స్మార్థం, వైఖానస స్మార్థాలను చదువుకోవచ్చు. అలాగే, దివ్యప్రబంధం, సంస్కృతం కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


భవిష్యత్‌కు భరోసా

ప్రస్తుతం తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో 419 మంది విద్యార్థులు, 53 మంది నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారు. పన్నెండేళ్ల కాలపరిమితి కలిగిన వేదశాఖల్లో ప్రవేశానికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఐదో తరగతి ఉత్తీర్ణులై, ఉపనయనం పూర్తి కావాలి. ఇక, ఎనిమిదేళ్ల కాలపరిమితి గల ఆగమ, స్మార్థ, దివ్యప్రబంధ కోర్సుల్లో ప్రవేశానికి 12 నుంచి 14 ఏళ్లలోపు ఉండి, ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈశాఖలకూ ఉపనయనం పూర్తయిన విద్యార్థులు అర్హులు. ప్రవేశం పొందిన ప్రతి ఒక్కరికీ భోజనం, వసతి, వస్ర్తాలు, పుస్తకాలు ఉచితంగా అందజేస్తారు. అన్ని శాఖల విద్యార్థులకు సంస్కృతం భోధిస్తారు.


పాఠశాలలో జూనియర్‌, సీనియర్లకు వయస్సుల వారీగా గదులు కేటాయిస్తారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేలా కొన్ని ఫిర్యాదు పెట్టెలు కూడా అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తు పట్ల భరోసా కల్పించేందుకు.. వేదశాఖ విద్యార్థులకు (సలక్షణ ఘనాపాఠీలు) కోర్సు ప్రారంభంలో రూ.3 లక్షలు, ఆగమ, స్మార్థ, దివ్యప్రబంధం విద్యార్థులకు (పండితహా) రూ.లక్ష చొప్పున డిపాజిట్‌ చేస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేశాక ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి అందజేస్తారు. అలాగే 10 గ్రాముల స్వామివారి వెండి డాలర్‌ను కూడా బహుకరిస్తారు.


ఏటా జరిగే స్నాతకోత్సవంలో పట్టభద్రులకు పత్రాలు, గుర్తింపు కార్డులను అందజేసి.. గౌరవప్రదంగా పంపుతారు. 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా ఈ వేదపాఠశాలలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఇక, బ్రాహ్మణేతరులకూ వేదవిద్యను అందించాలని 2008లో ప్రయత్నించారు. అయితే అక్కడి నియమనిష్టలను పాటించలేక చాలామంది వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం అందరూ బ్రాహ్మణులే వేదవిద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాల నిర్వహణకు ప్రస్తుతం దాదాపు రూ.12 కోట్లు ఖర్చు అవుతోంది.


స్వామి కైంకర్యాల్లో..

వేద పాఠశాలలోని విద్యార్థుల దృష్టి మొత్తం అభ్యాసనపైనే ఉండేలా బోధన ఉంటుంది. రోజు మొత్తం నేర్చుకున్న పాఠ్యాంశాలను సాధన చేసేందుకు ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం కలిపి నాలుగు గంటల పాటు సమయం కేటాయిస్తారు. ఇక, ఇంటికి దూరంగా ఉంటూ వేదాలను చదివే విద్యార్థుల్లో మానసిక, శారీరక వికాసం కోసం ప్రతిరోజూ అన్ని రకాల క్రీడలను నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఓ వ్యాయామ ఉపాధ్యాయున్ని ఏర్పాటు చేసి అన్ని రకాల ఆటలు ఆడిస్తూ వేదాన్ని నేర్పిస్తున్నారు. నిత్యం యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు. అభ్యసన సమయంలోనే విద్యార్థులను వీలైనప్పుడల్లా స్వామి కైంకర్యాలలో భాగస్వాములను చేస్తుంటారు. శ్రీవారికి జరిగే సేవలు, ఉత్సవాల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీటితో పాటు హోమాలు, కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, క్రతువులు, ఉత్సవాలు నిర్వహిస్తూ విద్యార్థులకు ప్రాక్టికల్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.


ఉపాధికి ఢోకా లేదు..

పౌరోహితులు, అర్చకులు, పండితులు, వేదపారాయణదారులను చూసే కోణం గతంలో కాస్త భిన్నంగా ఉండేది. ఆ రంగంలో ఉన్న వారంతా దిగువమధ్య తరగతి వారిగానో, లేక పేదవారిగానో అనుకునే వారి సంఖ్య ఎక్కువే. కానీ నిజానికి ప్రస్తుతం వేదం చదువుకున్నవారు ఉన్నతస్థాయిల్లో ఉంటున్నారు. ఉపాధితోపాటు ఎంతో గౌరవం లభిస్తున్నది. రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రధాన ఆలయాలతో పాటు దేశవ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాల్లో ఉపాధి పొంది ఆర్థికంగా స్థిరపడుతున్నారు. సొంత రాష్ట్రంలో అయితే రూ.50 వేల లోపు, దేశంలోని ఇతర రాష్ర్టాల్లో అయితే రూ.లక్ష, విదేశాల్లో అయితే రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఆర్జిస్తున్నారు.


టీటీడీలో ఉన్న జీయంగార్ల నుంచి అర్చకులందరూ దాదాపుగా ఈ పాఠశాలలో చదివినవారు కావడం గమనార్హం. ప్రస్తుతం దాదాపు 150 మంది తిరుమల- తిరుపతి దేవస్థానంలో అర్చకులుగా కొనసాగుతున్నారు. అలాగే అనేక మఠాలు, రాష్ట్ర దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లోనూ ఉపాధి పొందుతున్నారు. మరికొందరు వేదపారాయణులుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 120 వేదపాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, మైసూరు, శృంగేరి వేదాధ్యయన సంస్థల్లో పండితులుగా పనిచేస్తున్నారు.


విదేశాల్లోనూ మన విద్యార్థులే..

తిరుమలలోని వేదపాఠశాలలో వేదవిద్యను అందుకున్న వారిలో దాదాపు 200 మంది విద్యార్థులు విదేశాల్లో అర్చకులు, పండితులు, వేదపారాయణదారులుగా కొనసాగుతున్నారు. అమెరికా, లండన్‌, కెన్యా, నైజీరియా, మారిషస్‌, ఆస్ర్టేలియా వంటి అనేక దేశాల్లోని ఆలయాల్లో ఆగమోక్తంగా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 15 ఏళ్లుగా అర్చకత్వం చేస్తున్నవారు కూడా చాలా మంది ఉన్నారు. విదేశాల్లో స్థిరపడిన హిందువులందరికీ భారతదేశాన్ని వదిలిపెట్టామనే భావన లేకుండా ఆగమశాస్త్రం ప్రకారం అన్ని కైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోహిందువులు స్థిరపడిన విషయం తెలిసిందే.


కొంతమంది సనాతన ధర్మాన్ని పాటిస్తూ భారతదేశానికి వచ్చి ఆలయాల సందర్శన, దైవ దర్శనాలు చేసుకుని వెళుతుంటారు. అయితే గత పదిహేను ఇరవైఏళ్లుగా విదేశాల్లో పెరుగుతున్న హిందువుల సంఖ్యకు తగ్గట్టు దేవాలయాలూ పెరుగుతున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యంలోనూ మన ఆలయాలు అధికం. వాటన్నిటిలో అర్చకత్వం చేసేవారందరూ దాదాపు భారతదేశం నుంచి వెళ్లినవారే. అందులోనూ తిరుమలలో వేదపాఠశాలలో వేదవిద్యను అభ్యసించి అర్చకత్వం చేసే వారే ఎక్కువ. పుట్టిన దేశాన్ని వదిలి... హిందూ సంప్రదాయాలు, కట్టుబాట్లు, అలవాట్లకు దూరమయ్యామనే భావనను తిరుమల వేదపాఠశాల నుంచి వెళ్లిన అర్చకులు తొలగిస్తున్నారు.


అన్ని ఆలయాల్లో ఆగమోక్తంగా పూజాకైంకర్యాలు, క్రతువులు, పండుగలు, హోమాలు, వ్రతాలు, యాగాలు, ప్రతిష్టాపనలు, ముహుర్తాలను సకాలంలో నిర్వహిస్తూ విదేశీగడ్డపై కూడా హిందూ సనాతన ధర్మ ఆచరణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయా దేశాల్లో స్థిరపడిన భక్తులు తమ గృహ శంకుస్థాపన, గృహప్రవేశం, ఇళ్లలో చిన్నపాటి పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పూజా సంబంధిత అనేక సందేహాలను తొలగిస్తున్నారు. .. ఇలా ఒకవైపు వేదాలను పరిరక్షిస్తూ.. మరోవైపు హిందూ ధర్మాన్ని కాపాడుతూ.. చరిత్ర గుర్తుపెట్టుకునేంత ఆధ్యాత్మిక సేవ చేస్తున్న వేద విజ్ఞానపాఠశాలకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే!.

- జగదీష్‌ జంగం, తిరుమల


అసలుసిసలు గురుకులం

ప్రస్తుతం గురుకులాల స్వరూపమే మారిపోయింది. చాలాచోట్ల గురుకులం అని చెబుతున్నప్పటికీ వాటి తీరు భిన్నంగా ఉంటుంది. అసలు నిజమైన గురుకులం అంటే స్వామి పాదాల చెంత ధర్మగిరిలో కొలువైన వేద విజ్ఞానపీఠమే. ఇక్కడ ఉండే వైబ్రేషన్‌ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇదో స్వర్గం. స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణంలో వేదవిద్యను నేర్చుకునే గొప్ప అవకాశముంది. టీటీడీ వేదపరిరక్షణలో భాగంగా వేదవిద్యను నేర్చుకునే విద్యార్థులకు సకల సౌకర్యాలను సమకూర్చుతోంది. విద్య, వసతి, వైద్యం, ఆర్థిక సాయం ఇలా ఇక్కడ అన్నీ ఉచితమే..!.

- కెఎస్‌ఎస్‌ అవధాని, ప్రిన్సిపల్‌ వేదవిజ్ఞానపీఠం, తిరుమల


సనాతన ధర్మం ... ఉన్నత శిఖరాలకు ...

సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసి.. ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలన్నదే టీటీడీ బోర్డు సంకల్పం. తిరుమలలోని వేదవిజ్ఞానపీఠంలో వేదవిద్యను అభ్యసించే విద్యార్థులకు చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తాం. ప్రత్యేకమైన వంటమాస్టర్లను తీసుకొచ్చి మరింత రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తాం. పాఠశాల దట్టమైన అడవిలో ఉన్నందున.. చలికి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా వేడినీటి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తాం. అలాగే కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని పెంచేందుకు.. యోగా, ధ్యానం చేయించేందుకు కృషి చేస్తున్నాం. పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన విజువల్స్‌తో బోధనను అత్యాధునికం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఈ పాఠశాలలో చదువుకునే ప్రత్యేక ప్రతిభావంతులకు అవార్డులు, పతకాలు అందజేస్తాం. వేదాల్లోని కోర్సులు సంపూర్ణంగా పూర్తిచేసిన వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సహాయపడతాం. వేదవిద్యను మరింత అభివృద్ధి చేసి, వేద జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం.

- బీఆర్‌ నాయుడు, ఛైర్మన్‌, ధర్మకర్తల మండలి, తిరుమల-తిరుపతి దేవస్థానం.


తిరుమల టు ఆరిజోనా..

మాది ఏలూరు. తిరుమల వేదపాఠశాలలో పాంచరాత్ర ఆగమం చదువుకున్నా. ‘వీరు మన తల్లిదండ్రుల’ని తెలిసే వయసులో అక్కడ అడుగుపెట్టా. ఇంటికి దూరమవ్వడం శాపమనుకున్నా కానీ, తిరుమల వేదపాఠశాలలో చదువుకోవడం వరం అని కోర్సు పూర్తయ్యేనాటికి అర్థం అయ్యింది. స్వామి, అమ్మవార్లనే పెద్దదిక్కుగా భావించి చదువుకున్నాం. కోర్సు పూర్తయిన వెంటనే అమెరికాలో అర్చకత్వం చేసే అవకాశమొచ్చింది. ఇది స్వామివారి ఆశీర్వాదంగానే భావిస్తున్నాను. దాదాపు 12 ఏళ్ల నుంచి అమెరికాలోని ఆరిజోనాలో శ్రీవేంకటేశ్వరస్వామి, మహాగణపతి, శివాలయంలో విధులు నిర్వహిస్తున్నా. ఇక్కడ హిందువులు చాలా ఎక్కువ. ఈ క్రమంలో అన్ని పూజాకార్యక్రమాలు ఆమోక్తంగా నిర్వహిస్తున్నాం. హైందవ సనాతన ధర్మాన్ని కాపాడే శక్తిని స్వామి నాకు ప్రసాదించారని భావిస్తున్నా.

- వీరప్రకాష్‌ ఆచార్యులు, ఆరిజోనా, అమెరికా

Updated Date - Dec 01 , 2024 | 08:21 AM