Devotional: వైభవంగా తిరువళ్లూరు పెరుమాళ్ రథోత్సవం
ABN, Publish Date - Apr 22 , 2024 | 12:09 PM
:తిరువళ్లూరు(tiruvallur) వైద్య వీరరాఘవ పెరుమాళ్ ఆలయ చిత్తిరై బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతియేటా తై, చిత్తిరై మాసాల్లో బ్రహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
చెన్నై, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): తిరువళ్లూరు(tiruvallur) వైద్య వీరరాఘవ పెరుమాళ్ ఆలయ చిత్తిరై బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతియేటా తై, చిత్తిరై మాసాల్లో బ్రహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఆ మేరకు ఈ యేడాది చిత్తిరై బ్రహ్మోత్సవాలు ఈ నెల 15న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ప్రతిరోజూ స్వామివారు ఆలయ ప్రధాన వీధులలో వివిధ వాహనాలపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ బ్రహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. భూదేవి, శ్రీదేవి సమేతులైన వీరరాఘవపెరుమాళ్ సర్వాలంకరణ శోభితులైన వేకువజాము 5.30 గంటలకు రథంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై ఆశీనులయ్యారు. ఉదయం 7.30 గంటలకు వేలాదిమంది భక్తులు మోకుతాళ్లను పట్టుకుని రథాన్ని లాగుతూ వెళ్ళారు. ఆ రథం, పనగల్ వీథి, కొలను వీధి, బజారు వీధి, ఉత్తరరాజవీధి, మోతీలాల్ వీధి తదితర ప్రధాన వీధులమీదుగా వెళ్ళి రథ మండప ప్రాంతానికి తిరిగొచ్చింది. ఈ వేడుకల్లో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, సత్యవేడు, నాగలాపురం, పుత్తూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇక ఈ నెల 23 ఉదయం తీర్థవారీ, 24 రాత్రి స్వామివారికి అద్దాల పల్లకీ సేవల జరుగుతాయి.
రేపటి నుంచి పార్థసారథి ఆలయ బ్రహ్మోత్సవాలు
ఐసిఎఫ్, ఏప్రిల్ 21: స్థానిక ట్రిప్లికేన్‌లో ఉన్న పార్థసారధి ఆలయ చైత్ర మాస బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేది ఉదయం 8 గంటలకు ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి సోమవారం సాయంత్రం 6 గంటలకు అంకురార్పణం, సేనైముదన్మయార్ కార్యక్రమాలు జరుగనున్నాయి. 24వ తేది ఉదయం 6.15 గంటలకు శేష వాహనంలో పరమపధనాథన్ దర్శనమిస్తారు. ఆ రోజు రాత్రి 7.45 గంటలకు సింహ వాహనంలో ఊరేగింపు జరుగనుంది. ఉత్సవం మూడో రోజు ఉదయం 5.15 గంటలకు గోపుర దర్శనంతో గరుడ సేవ, ఆరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏకాంతసేవ, రాత్రి 7.45 గంటలకు హంస వాహనంలో ఊరేగింపు జరుగనుంది. 27న నాచియర్ పల్లకీ సేవ, ఆరోజు రాత్రి 8.30 గంటలకు హనుమద్ వాహనంపై స్వామి దర్శనం, 29వ తేది రథోత్సవం జరుగనుంది. మే 3 నుంచి 10వ తేది వరకు విడయాట్రి ఉత్సవాలు జరుగనున్నాయి.
Updated Date - Apr 22 , 2024 | 12:12 PM