Ganesh Chaturthi 2024: గణేశుడికే నిమజ్జనం ఎందుకు.. అదీ 10 రోజుల తరువాత చేయడానికి కారణం ఏంటి
ABN, Publish Date - Sep 15 , 2024 | 05:17 PM
నిమజ్జనం చేయడంలో వేదాంత రహస్యం కూడా ఉందండోయ్. ఈ ప్రపంచం పంచ భూతాలతో నిండింది. పంచ భూతాల నుంచి పుట్టిన ప్రతి సజీవ, నిర్జీవ పదార్థం ఎంత విలాసంగా గడిపినా.. చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను మట్టితోనే చేసి నిమజ్జనం పూర్తి చేస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: రుతుధర్మాన్ననుసరించి జరుపుకొనే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైంది. ఏటా భాద్రపద శుద్ధ చవితినాడు చవితి వస్తుంది. వేసవి తాపం తగ్గి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో శక్తిని తెచ్చకుని పచ్చదనాన్ని సంతరించుకునే సీజన్ ఇది. నదులలో నీరు నిండి పుడమి తల్లి పులకరిస్తుంది. బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టం. వినాయకుడికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ప్రీతి. అందుకే గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తుంటారు. గణేశుడి పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలో ఒక విశేషముంది. అదేంటంటే.. ఎండాకాలం అయిపోయాక జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టికోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది.
నీళ్లు తేటపడతాయి. అదీకాక మట్టిని తీయడం, దానితో విగ్రహాన్ని రూపొందించడం వల్ల మట్టిలోని మంచి గుణాలు శరీరానికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం మంచిదని ప్రకృతి వైద్యులు కూడా చెబుతుంటారు. ప్రకృతి చికిత్సకు ఒండ్రుమట్టిని కూడా వాడుతుండటం మనకు తెలిసిందే. అయితే పదిరోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని 11వ రోజున డప్పుచప్పుల, మేళతాళాల నడుమ నిమజ్జనానికి తీసుకెళ్తారు. నిమజ్జనం చేయడంలో వేదాంత రహస్యం కూడా ఉందండోయ్. ఈ ప్రపంచం పంచ భూతాలతో నిండింది. పంచ భూతాల నుంచి పుట్టిన ప్రతి సజీవ, నిర్జీవ పదార్థం ఎంత విలాసంగా గడిపినా.. చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను మట్టితోనే చేసి నిమజ్జనం పూర్తి చేస్తారు.
ప్రాచుర్యంలో రెండు కథలు..
వేదవ్యాసుడు మహాభారత కథను గణేశుడికి గణేశ్ చతుర్ది నుంచి అనంత చతుర్దశి వరకూ 10 రోజులు వినిపించాడని పురాణాలు చెబుతున్నాయి. వేదవ్యాసుడు కథ చెబుతున్నప్పుడు అతను కళ్లు మూసుకుని ఉండటంతో ఆ కథ ప్రభావం గణేశుడిపై ఎలా పడిందో తెలియలేదు. వేదవ్యాసుడు కథ పూర్తి చేసి..కళ్లు తెరిచినప్పుడు పదిరోజుల పాటు కథ వినడం వల్ల గణేశుడిలో వేడి పెరిగి.. జ్వరం వచ్చేసింది. దాంతో వేదవ్యాసుడు గణేశుడిని సమీపంలోని ఓ చెరువుకు తీసుకెళ్లి మునక వేయిస్తాడు. దాంతో వినాయకుడి శరీరంలో వేడి తగ్గుతుంది. అందుకే వినాయకుడిని ప్రతిష్ఠించిన 10 రోజుల వరకూ భక్తుల కోర్కెలు వినీ వినీ లంబోదరుడిలో శరీర వేడి పెరిగిపోతుందట.
చతుర్దశినాడు చెరువు, నది లేదా సముద్రంలో నిమజ్జనం చేసి శరీరాన్ని చల్లబరచడానికి నిమజ్జనం చేస్తారని ఓ కథ వివరిస్తోంది. ఇంకో కథ ప్రకారం.. వినాయక చవితికి భక్తుల పూజలు అందుకున్న గణేశుడు వారి కోర్కెలు తీర్చడానికి భూమిపైకి వస్తాడట. గణపతిని తిరిగి కైలాసానికి పంపించడానికి జలవనరులే దగ్గరి మార్గం. అందుకే విఘ్నేశ్వరుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారని మరో కథ ఉనికిలో ఉంది. ఆ రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారన్నమాట. మట్టి విగ్రహాల్ని, పత్రిని నీటిలో నిమజ్జనం చెయ్యడం ద్వారా నీళ్లలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి. నిమజ్జనం పూర్తికాగానే దసరా సంబరాలు, బతుకమ్మ ఉత్సవాలూ ప్రారంభమవుతాయి.
For More National News and Telugu News
Updated Date - Sep 15 , 2024 | 06:33 PM