ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Neet: నీటుకు చేటు

ABN, Publish Date - Jun 15 , 2024 | 08:42 AM

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన జాతీయస్థాయి అర్హత పరీక్ష ‘నీట్‌’లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవకతవకలు జరిగాయన్న అనుమానాలను, పేపర్‌ లీక్‌ ఆరోపణలనూ నిగ్గుతేల్చడానికి సీబీఐ దర్యాప్తు చేయించాలంటూ ఏడు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, కేంద్రం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే), సీబీఐ, బిహార్‌ ప్రభుత్వం స్పందనలను సుప్రీంకోర్టు శుక్రవారం కోరింది.

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన జాతీయస్థాయి అర్హత పరీక్ష ‘నీట్‌’లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవకతవకలు జరిగాయన్న అనుమానాలను, పేపర్‌ లీక్‌ ఆరోపణలనూ నిగ్గుతేల్చడానికి సీబీఐ దర్యాప్తు చేయించాలంటూ ఏడు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, కేంద్రం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే), సీబీఐ, బిహార్‌ ప్రభుత్వం స్పందనలను సుప్రీంకోర్టు శుక్రవారం కోరింది. సీబీఐ దర్యాప్తు విషయలో సర్వోన్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది అటుంచితే, అక్రమాలు జరిగాయన్న తమవాదనకు మద్దతుగా పిటిషన్‌దారులు ప్రస్తావించిన ఉదంతాలు చిన్నవేమీ కావు. ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన పదహారుమంది విద్యార్థులు గుజరాత్‌లోని గోధ్రాలో ఓ పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడం, మంచి మార్కులకోసం వారు పదిలక్షలు లంచంగా ఇచ్చారన్న ఆరోపణల మేరకు గుజరాత్‌లో ఒక టీచర్‌పై కేసు నమోదుకావడం, బిహార్‌లోని పట్నాలో పేపర్‌ లీక్‌కు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ దాఖలు కావడం వంటివి వారు ఉదహరించారు. యూపీలో నీట్‌ పేపర్‌ లీక్‌ రాకెట్‌ నడిచిందన్న కథనాలను కూడా వారు ప్రస్తావించినప్పటికీ, కనీసం మూడు రాష్ట్రాల్లో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన నేపథ్యంలో, లోతుగా విచారణ జరగాల్సిన అంశం ఇది.


అవకవతవకలు జరగలేదనీ, విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర విద్యామంత్రి గట్టిగానే అంటున్నారు కానీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే వేస్తున్న ప్రశ్నలు కూడా కొట్టిపారేయలేనివే. పేపర్‌లీక్‌ లీక్‌ కాకపోతే బిహార్‌లో పదమూడుమందిని ఎందుకు అరెస్టుచేశారు, రాకెట్‌లో భాగమైన గ్యాంగులు యాభైలక్షలవరకూ వసూలుచేశారన్న విషయాన్ని అక్కడి ఆర్థిక నేరాల విభాగం బయటపెట్టలేదా, గుజరాత్‌లోనూ ఓ ముగ్గురి మధ్య పన్నెండు కోట్ల రూపాయల లావాదేవీ జరిగిన విషయం బయటకు రాలేదా అంటూ ఆయన చాలా ప్రశ్నలు వేశారు. అసలే పలు అనుమానాలు, ఆందోళనలు చుట్టుముట్టిన తరుణంలో, ఒక జాతీయస్థాయి పరీక్షనుంచి కాంగ్రెస్‌ రాజకీయంగా లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించడం సులభమే. కానీ, లక్షసీట్లకోసం పాతిక లక్షల మంది విద్యార్థులు రేయింబవళ్ళు శ్రమించి రాసిన ఈ పరీక్ష చివరకు అవకతవకలకు గురై, అందరి నమ్మకాన్ని వమ్ముచేయడం సరికాదు.


ఎన్నడూ లేనిది, ఆరవైయేడు మంది విద్యార్థులు పూర్తి మార్కులతో టాపర్లుగా నిలవడం, హర్యానాలోని ఒక పరీక్షాకేంద్రంలో పక్కపక్కనే కూచున్న ఆరుగురు విద్యార్థులు వీరిలో ఉండటం, కొంతమందికి 718, 719లాంటి అసంభవమైన మార్కులు రావడం వంటివి అనుమానాలకు కారణం. ఇక, అత్యున్నత ప్రతిభావంతులను గుర్తించేందుకు ఉద్దేశించిన ఓ కఠినాతికఠినమైన పరీక్షలో గ్రేస్‌ మార్కులు ఇవ్వడమనేదే తప్పు. ఒక్క గ్రేస్‌ మార్కుతో వేలాది ర్యాంకులు మారిపోయి, విద్యార్థుల భవిష్యత్తు తారుమారవుతుంది. ఏ కారణాన, ఏ ప్రాతిపదికన ఆ మార్కులు ఇచ్చారన్నది అటుంచితే, వివాదం రేగిన తరువాత వాటిని రద్దుచేసి, ఇప్పుడు ఆ పదిహేనువందలపైచిలుకు విద్యార్థులకు తిరిగి పరీక్షరాసుకొనే అవకాశం ప్రభుత్వం కల్పిస్తున్నది. నచ్చినవారు రాయవచ్చు, వద్దనుకున్నవారు తమ అసలు స్కోరుతో కౌన్సెలింగ్ ఎదుర్కోవచ్చు అని కేంద్రప్రభుత్వం అంటోంది. వినడానికి బాగున్నది కానీ, ఈ రీ టెస్ట్‌ తరువాత వివాదం మరిన్ని మలుపులు తిరగవచ్చు, అనుమానాలు పెంచవచ్చు.


నీట్‌లో అక్రమాలు జరుగుతున్నాయని తాము ఎప్పటినుంచో అంటున్నామని స్టాలిన్‌ గుర్తుచేస్తున్నారు. వ్యాపం 2.0 అంటూ దశాబ్దం క్రితం మధ్యప్రదేశ్‌ను కుదిపేసిన కుంభకోణంతో కాంగ్రెస్ నాయకులు దీనిని పోల్చుతున్నారు. నీట్‌–చీట్‌ వంటి నినాదాలు, కొత్త నిర్వచనాలు జోరందుకుంటున్నాయి. నీట్‌ పరీక్షావిధానంమీద చాలా విమర్శలు, అనుమానాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు కొన్ని ఆధారాలు కూడా తోడైనందున లోతైన శస్త్రచికిత్స వెంటనే జరగడం అవసరం. పాతికలక్షలమంది విద్యార్థుల ఆశయం, భవితవ్యం, కుటుంబీకుల కష్టనష్టాలతో ముడిపడిన అంశమిది. ఇంతటి అస్తవ్యస్థమైన, అనుచిత నిర్ణయాలు, చర్యలు ఎన్టీయే ఎన్నడూ తీసుకోలేదు. తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి అది చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి. పరీక్షను పూర్తిగా రద్దుచేయకుండా ఆగినప్పటికీ, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, చేసిన నిర్ణయాలు ఈ వ్యవహారంలో లోతైన దర్యాప్తు జరగడం, విశ్వాసాన్ని పెంపొందించడం అవసరమని రుజువుచేస్తున్నాయి.

Updated Date - Jun 15 , 2024 | 08:59 AM

Advertising
Advertising