ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంస్కృతికి గొప్ప మాధ్యమం పుస్తకమే

ABN, Publish Date - Dec 19 , 2024 | 02:25 AM

మనిషి ఆయుః ప్రమాణం వందేళ్ళయితే, గ్రంథ ఆయుః ప్రమాణం అనంతం. అపౌరుషేయాలని భావించే వేదాలు మొదలుకుని, 2300 ఏళ్ళ క్రితం కౌటిల్యుడు అర్థశాస్త్రం, అనంతరం...

మనిషి ఆయుః ప్రమాణం వందేళ్ళయితే, గ్రంథ ఆయుః ప్రమాణం అనంతం. అపౌరుషేయాలని భావించే వేదాలు మొదలుకుని, 2300 ఏళ్ళ క్రితం కౌటిల్యుడు అర్థశాస్త్రం, అనంతరం పాణిని ‘అష్టాధ్యాయి’, పతంజలి ‘యోగశాస్త్రం’, భరతముని ‘నాట్యశాస్త్రం’, హాలుని ‘గాథా సప్తశతి’ ఇలా ప్రాచీన గ్రంథాలెన్నో ప్రపంచ సాహిత్యాకాశాన ధ్వజాలలాగ రెపరెపలాడే కీర్తి సంకేతాలుగా నిలుస్తున్నాయి.

గ్రంథానికి మృతి లేదు. అక్షర రూపం దిద్దుకున్న ఆలోచన, రాసిన వసువును బట్టి ఎంతకాలం మనగలుగుతుందో నిర్ణయమవుతుంది. తాళపత్ర, బూర్జపత్ర, తామ్రపత్ర, చర్మపత్ర రూపాలలో ఉన్నవి శిథిలాలైతే, తిరిగి ప్రతిలేఖనాలవుతాయి. మనిషి అజ్ఞానంతోనో, తెలియకో, విలువ స్వార్థపరుడై విధ్వంసం చేస్తే తప్ప, తామ్ర, శిలా రూపాలకు చావే లేదు.

భారతీయ సాహిత్య సంబంధిత అనేకానేక అపురూప గ్రంథాలు విదేశీయులను ఆకర్షించాయి. చైనా, టిబెట్, అఫ్ఘానిస్తాన్, మంగోలియా దేశీయులు భారత సందర్శనతో పాటు, ఇక్కడి బౌద్ధ సాహిత్యాన్ని మూల, అనువాద రూపాలలో తీసుకెళ్ళారు. అక్షరం కనుగొనబడడానికి ముందు వేద వాఙ్మయం శ్రుత సాహిత్యంగా ఉండేది. శ్రౌతం లిఖితం కావడం మానవ సంస్కృతీ వికాస పరిణామక్రమంలో ముఖ్య ఘట్టం. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ప్రస్థానత్రయం, భారత, భాగవత, రామాయణాలు, ఉప పురాణాలు, స్మృతి గ్రంథాలు, భారతీయ కథా సాహిత్యం, గ్రంథ రూపం సంతరించుకున్నాక, ప్రపంచంలో ఏ జాతీ, ఏ దేశం, భారతదేశానికి సాటిరావని, సర్వ ప్రపంచానికి ద్యోతకమైంది. భారతీయ సంస్కృతిని చాటిచెప్పే గొప్ప మాధ్యమం గ్రంథం.


ముద్రణా యంత్రాలు వచ్చాక, ప్రతుల ప్రచురణ సులభమైంది. ఒకేసారి వందలాది ప్రతులు సిద్ధమయ్యే సౌలభ్యం ఏర్పడింది. అంతకు ముందు రాజాస్థానాలలో ప్రతులు తయారుచేసే ఉద్యోగులు ఉండేవారు. అయితే మానవ నిర్మిత గ్రంథ తయారీ పని బహుకష్టంతో కూడుకునేది.

గ్రంథాలయం అందుబాటులోకి వచ్చాక దూరవిద్యా విధానం కూడా అమలులోకి వచ్చింది. ముద్రణా యంత్రాల ఆధునీకరణ జరిగింది. మరీ ముఖ్యంగా డిజిటలైజేషన్ వల్ల నాణ్యమైన, అందమైన ముద్రణలతో పాటుగా నేడు ‘ఇ–గ్రంథాలు’ ఉపయోగపడుతున్నాయి. అయినా ముద్రిత గ్రంథ ఉపయోగం ఇంకా తగ్గుముఖం పట్టలేదు.


గ్రంథస్థ విషయాలు ప్రపంచమంతా విస్తృతం అవుతున్నాయి. అనేకానేక శాస్త్ర గ్రంథాలు, సృజనాత్మక సాహితీ గ్రంథాలు, ఆధ్యాత్మికాంశాలు, చరిత్ర, వివిధ విద్యలు, రూపాలు, మానసికోల్లాస ప్రధానాలు, ఒకటేమిటి... వేలాది అంశాలు, లక్షలాది గ్రంథాలు కోట్లాది పాఠకులకు నిత్యం దర్శనాలుగా ఉండడాన్ని చూస్తూనే ఉన్నాం. ప్రతి వ్యక్తి, ప్రత్యేక గ్రంథంలోకి వెళితే, అది బాహ్య ప్రపంచాన్ని మరిపించే, ఒక ప్రత్యేక ప్రపంచం అవుతున్నది. అందుకే మనిషికి అక్షరమన్నా, గ్రంథమన్నా అంత ప్రేమ, మమకారం. ముద్రణ వల్ల గ్రంథానికి విలువ ఏర్పడింది కనుక, డిమాండును బట్టి, వ్యాపారాత్మకత కారణంగా అధిక ధరల ప్రపంచం ఏర్పడుతున్నది.

తొలి హైదరాబాద్ బుక్ ఫెయిర్ 1985లో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది. అనంతరం నిజాం కాలేజీ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కేశవ్ మెమోరియల్ హైస్కూల్ గ్రౌండ్స్ తదితర ప్రాంతాల్లో బుక్ ఫెయిర్లు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ గ్రౌండ్స్)లో పుస్తక ప్రదర్శన నిరంతరం కొనసాగుతోంది. ప్రతి ఏటా హైదరాబాద్‌ వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నది. ఇందిరాపార్క్‌ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి 29 వరకు 37వ జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతుంది.


బహు భాషలు, రచయితలు, గ్రంథాలు, ముద్రాపకులు, ఒక్కచోట చేరితే అదొక విజ్ఞాన విశ్వమే కదా. అందుకే చాలామందికి ప్రీతిపాత్రం గ్రంథాల జాతర. దేవుణ్ణి జాతరలో కొలిచినట్లే, గ్రంథాలను పరమ పవిత్రంగా భావించే సంస్కృతి భారతీయులది. కొనేవారు, చదివేవారు, సంరంభాన్ని కన్నుల పండువగా తిలకించేవారు; కౌటుంబిక, స్నేహ, ప్రేమికుల, విద్యార్థుల, రచయితల, కవుల, సాహితీకారుల బృందాలు ఒక్కచోట కలిసి పండుగ చేసుకునే భాగ్యనగర పుస్తక మేళాకు వెళ్ళిన వారికి మరచిపోలేని అనుభూతులను మిగులుస్తుందనేది నూటికి నూరుపాళ్ళు నిజం.

రామకిష్టయ్య సంగనభట్ల

Updated Date - Dec 19 , 2024 | 02:32 AM