ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘జమిలి’తో అధికారాల ఏకీకరణ

ABN, Publish Date - Dec 24 , 2024 | 04:49 AM

‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదంతో జమిలి ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేయడానికి మోదీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లులను ప్రవేశపెట్టింది. ఇవి ఆమోదం పొందితే పార్లమెంటుకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి...

‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదంతో జమిలి ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేయడానికి మోదీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లులను ప్రవేశపెట్టింది. ఇవి ఆమోదం పొందితే పార్లమెంటుకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. సహజంగానే ఈ అంశంపై కూడా అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం వాదోపవాదాలు చేస్తున్నాయి. అయితే సాధారణ ప్రజల స్పందన భిన్నంగా ఉంది. ప్రజాస్వామ్య సూత్రాలు, విలువలు, వాటి స్ఫూర్తి, ఆచరణ ప్రాధాన్యతను కోల్పోయి కేవలం మనీ, మీడియా, మూక బలాలు ప్రాబల్యం వహిస్తూ, మొత్తం ఎన్నికల ప్రక్రియే ఒక ప్రహసనంగా మారిన ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలు ఏ రూపంలో జరిగినా ఏం ఫాయిదా? అనే ప్రతిస్పందన వినిపిస్తుంది. అసలు జమిలి అంశం నేడు ఎందుకు ముందుకు వస్తోంది? దీని వెనుకనున్న అసలు ఉద్దేశ్యాలేమిటి? వంటి ముఖ్య ప్రశ్నలు వేయడం చాలా అవసరం.


జమిలి ఎన్నికలకు అనుకూలంగా మూడు వాదనలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పలుమార్లు జరిగే ఎన్నికల వలన అధిక ఆర్థిక వ్యయం అవుతోందని, జమిలితో గణనీయంగా ఎన్నికల ఖర్చును తగ్గించవచ్చునని, దేశ జీడీపీలో అదనంగా 10 శాతం వృద్ధి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ వీరు ఈ వాదనకు తగిన పరిశోధనలనుగానీ, సముచిత డాటా ఆధారిత రుజువులనుగానీ చూపించలేదు. కేవలం సాధారణ తర్కాన్ని ఉపయోగించడం, కొన్ని దేశాల ఎన్నికలను ఉదహరించడం జరిగింది. వాస్తవానికి ఎన్నికల నిర్వహణకు అయ్యే ప్రభుత్వ ఖర్చుకంటే బడా పార్టీలు ఓటర్లకు ఎర వేయడానికి అనేక రెట్లు ఎక్కువ ఖర్చు చేసే వేల కోట్ల రూపాయల అక్రమ ధనాన్ని అరికట్టే చర్యలు చేపడితే అందరూ హర్షిస్తారు. అలాగే ఎక్కువసార్లు ఎన్నికల షెడ్యూళ్ళను ప్రకటించే సందర్భాలలో అమలుచేసే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్–ఎంసీసీ) వలన ప్రభుత్వ పాలనకు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అనేక ఆటంకాలు వస్తున్నాయని కూడా చెప్పడం జరుగుతోంది. అయితే వాస్తవం ఏమిటి? ఎన్నికల షెడ్యూళ్ళను ప్రకటించిన తరువాత ఓటర్లను ప్రలోభపెట్టే కొత్త పథకాలు, ప్రాజెక్టుల ప్రకటనలను మాత్రమే ఎంసీసీ నిషేధిస్తుంది. అంతేకాని అప్పటికే అమలులోనున్న వాటిపై ఎలాంటి పరిమితులను విధించదు. ఇక ఎన్నికల సందర్భంగా చేపట్టే ఏర్పాట్లు, భద్రతా చర్యలు, పోలీసు లేదా సైనిక దళాలను నియమించడం తదితర విషయాలలో ఒకేసారి జరిగినా, ఎక్కువసార్లు జరిగినా పెద్ద మార్పేమీ ఉండదు.


ఇవన్నీ ప్రజలను ఒప్పించడానికి పైకి చెబుతున్న వాదనలు. వీటి సత్యాసత్యాలను అటుంచి, మనదేశ సామాజిక వ్యవస్థ నిర్మాణంలోని వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని, ప్రాంతీయ వ్యత్యాసాలను దృష్టిలో పెట్టుకొని జమిలి ఎన్నికల అంశాన్ని పరిశీలిస్తే అసలు విషయం స్పష్టమవుతుంది. అది జాతీయ పెట్టుబడి ఆధిపత్యానికి, ప్రాంతీయ పెట్టుబడి ఆకాంక్షలకు మధ్యనున్న వైరుధ్యం. దీని రాజకీయ వ్యక్తీకరణే జాతీయ స్థాయిలోని పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు మధ్య పోటీలు, ఘర్షణలు, బేరసారాలు, లొంగుబాట్లు, కాళ్ళబేరాలు. ఈ వైరుధ్యం మన దేశ ఆర్థిక అభివృద్ధిలో, రాజకీయ పరిణామంలో వివిధ దశలగుండా పయనిస్తూ వస్తోంది. మొదట స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ప్రాంతీయ పెట్టుబడి ఒక శక్తిగా రూపొందని కాలంలో జాతీయ పెట్టుబడి ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఏకఛత్రాధిపత్యం వహించింది. అనంతర కాలంలో ముఖ్యంగా 1970 దశకం పూర్వార్థం నుంచి ప్రాంతీయ పెట్టుబడుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు రాజకీయ రంగంలో ఆవిర్భవించి, రాష్ట్రాల ఎన్నికల పోటీలో గెలిచి అధికారాన్ని చేపట్టాయి. అప్పటి నుంచి ఈ వైరుధ్యం తీవ్ర రూపం దాల్చడం కనిపిస్తుంది. అప్పటికి జాతీయంగానూ, దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్ అపఖ్యాతిపాలు కాగా, దానికి ప్రత్యామ్నాయంగా అదే జాతీయ పెట్టుబడికి ప్రాతినిధ్యం వహించే మరొక జాతీయ పార్టీ ఆవిర్భావానికి జనతా పార్టీ రూపంలో చేసిన ప్రయోగం కూడా ఆ వైరుధ్యాన్ని టాకిల్ చేసే క్రమంలో జరిగింది. దీని ద్వారా అమెరికా, ఇంగ్లండ్‌ల తరహాలో ద్విపార్టీ పాలనను ప్రతిష్ఠించే ప్రయత్నం ప్రారంభమైంది. అంటే ఒక జాతీయ పార్టీ ప్రజల్లో పరపతిని కోల్పోయినప్పుడు మరొక జాతీయ పార్టీని ఛాంపియన్‌గా ఆకాశానికెత్తి అధికారంలోకి తేవడం.


తదనంతర కాలంలో ‘కోయిలేషన్ పాలిటిక్స్’ అనే ఒక కొత్త దశ అవతరించింది. ప్రపంచ పరిణామాలలో వచ్చిన పెను మార్పులలో భాగంగా 90లలో ప్రారంభమైన పెట్టుబడిదారీ ప్రపంచీకరణ విధానాల నిరాటంక అమలుకు ఈ కోయిలేషన్ పాలిటిక్స్‌లోని పరస్పర ఒత్తిళ్ళు, అధికార పెనుగులాటలు అవరోధాలుగా పరిణమించాయి. ప్రభుత్వాలు ఏర్పడడం, కూలిపోవడం, మధ్యంతర ఎన్నికలు రావడం వలన జాతీయ పెట్టుబడి, ప్రాంతీయ పెట్టుబడి రెండింటికీ అనేక చికాకులను తెచ్చి పెట్టాయి. ఎందుకంటే అప్పటికి ప్రాంతీయ పెట్టుబడికి చెందిన కొన్ని శక్తులు జాతీయ గుత్త పెట్టుబడిదారీ సంస్థలతో జతకట్టి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోని కొన్ని రంగాలలో పాత్రను పోషించే స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచీకరణను నిర్దేశించే ఆర్థిక, పారిశ్రామిక ఉత్పత్తి‘సంస్కరణల’ అమలు సజావుగా, శీఘ్రంగా, వేగంగా ముందుకు సాగాలంటే ఎన్నికల్లో ఒకే పార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఉండాలనే అభిప్రాయాన్ని ఒక పథకం ప్రకారం కూడగట్టడం జరిగింది. ఇదే ధోరణిని 2014, 2019లో జరిగిన సార్వత్రక ఎన్నికల ఫలితాలు ప్రతింబించాయి.


ఈ పదేళ్ళ కాలంలో రాజ్యం పాలనాంగాలు గుత్త పెట్టుబడి ప్రయోజనాలను నెరవేర్చడమే ఏకైక ధ్యేయంగా పనిచేయడం కనిపిస్తుంది. ఈ క్రమంలో జాతీయ–ప్రాంతీయ పెట్టుబడుల మధ్య వైరుధ్యాన్ని నయానో, భయానో అణగదొక్కి, పూర్తిగా జాతీయ గుత్త పెట్టుబడికి, ప్రాంతీయ పెట్టుబడి పూర్తిగా లోబడిపోయి, దాసోహం అయ్యేలా చేసే చర్యలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ‘ఒకే దేశం–ఒకే పన్ను’ నినాదంతో జీఎస్టీని తీసుకువచ్చి ఆర్థిక కేంద్రీకరణను మరింతగా పెంచింది. ఆదాయ రాబడులకై రాష్ట్రాలు కేంద్రంపై ఎక్కువగా ఆధారపడే విధంగా చేసింది. ప్రస్తుతం ఒకవైపు రెండు ప్రధాన పార్టీల మధ్య పోలరైజేషన్ చేసే ద్విపార్టీ రాజకీయ ప్రయోగాన్ని సజీవంగా ఉంచుతూనే, మరోవైపు ఏక పార్టీ స్వైర విహారానికి పావులు కదపడం కూడా జాతీయ గుత్త పెట్టుబడి ముందు ఒక ముఖ్య ఎజెండాగా ఉంది. అందుకుగాను ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదంతో రాజకీయ అధికారం యావత్తు ఏకీకరణ, కేంద్రీకరణ చేయడం అత్యంత అవసరం. గుత్త పెట్టుబడి ప్రయోజనాలను మరింతగా నెరవేర్చే ఆర్థిక, రాజకీయ కేంద్రీకరణ విధానం యెడల బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పెద్ద విబేధమేమీ లేదు. అందుకే చాలా నేర్పుగా జమిలి బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు.


జమిలి ఎన్నికలు సాధ్యం కావాలంటే భారత రాజ్యాంగానికి ఐదు సవరణలు అవసరమని న్యాయకోవిదులు భావిస్తున్నారు. రాజ్యాంగం నిర్మాణ చట్రంలో ఫెడరల్ స్వరూపం ఒక మౌలిక అంశం. ఈ ఫెడరల్ స్వరూపాన్ని దెబ్బతీయకుండా సవరణలు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికలను ముడిపెట్టినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన అనేక రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలాన్ని అర్థాంతరంగా కుదించవలసి వస్తుంది. అప్పటి రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన శిబ్బన్ లాలా సక్సేనా ఒక సందర్భంలో ఇలా అన్నారు: ‘‘మన రాజ్యాంగంలో అన్ని ఎన్నికలు ఏక కాలంలో జరగడానికి వీలు లేదు. ఎందుకంటే వివిధ చట్ట సభలలో అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించినప్పుడు శాసన సభలు రద్దవుతాయి. అందుకు అనుగుణంగా ఎన్నికలు వేర్వేరు సమయాల్లో ఉంటాయి.’’ గతంలో 1967 వరకు నాలుగుసార్లు జమిలి ఎన్నికలు జరిగిన మాట నిజమే. అయితే ఈ సంప్రదాయం ఉల్లంఘనకు బూర్జువా రాజకీయాలలోని నైతిక పతనం, అధికార దాహం ప్రధాన కారణాలు కాదా? అధికార పార్టీ ప్రతిపక్ష ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడం, ఫిరాయింపులతో కూల్చడం వంటి అప్రజాస్వామ్య చర్యలకు ఒడిగడుతున్నది బడా బూర్జువా పార్టీలు కాదా? వీటిని ప్రస్తుతం మరింతగా పోత్సహిస్తున్న బీజేపీ పార్టీ జమిలి ఎన్నికల ద్వారా ఈ దిగజారుడును అరికట్టగలుగుతుందని ఆశించగలమా? అలాగే జమిలి వల్ల తలెత్తే పర్యవసానం మరొకటి ఉంది. సాధారణంగా పార్లమెంటు ఎన్నికలలో జాతీయ అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలలో స్థానిక, ప్రాంతీయ సమస్యలు చర్చకు వస్తాయి. జమిలిగా ఎన్నికలు జరిగితే జాతీయ అంశాల ప్రభావంలో స్థానిక, ప్రాంతీయ సమస్యలు మరుగున పడే అవకాశం ఉంటుంది. అదే విధంగా ప్రాంతీయ పార్టీల ప్రభావం, వైవిధ్యం క్రమంగా తగ్గిపోయి దేశ రాజకీయ వ్యవస్థ ఏకశిలా సదృశంగా మారడానికి భూమిక ఏర్పడుతుంది.

ఎస్. గోవిందరాజులు

Updated Date - Dec 24 , 2024 | 04:49 AM