ఆయన రాజనీతిజ్ఞత జాతికి ప్రగతి బాట
ABN, Publish Date - Dec 25 , 2024 | 05:55 AM
ఈ రోజు, డిసెంబర్ 25–మనందరికీ ప్రత్యేకమైన రోజు. దేశ ప్రజలు ప్రియతమ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ జీ శతజయంతిని జరుపుకొంటున్న వేళ ఇది. ఆయన ఎంతో...
ఈ రోజు, డిసెంబర్ 25–మనందరికీ ప్రత్యేకమైన రోజు. దేశ ప్రజలు ప్రియతమ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ జీ శతజయంతిని జరుపుకొంటున్న వేళ ఇది. ఆయన ఎంతో మందికి ప్రేరణను ఇస్తూ ఒక రాజనీతికోవిదుడుగా సమున్నత స్థానంలో నిలిచారు.
దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపిన మహనీయునిగా అటల్ జీకి మన దేశ ప్రజలు ఎన్నటికీ రుణపడి ఉంటారు. ఆయన 1998లో ప్రధానిగా పదవీప్రమాణం స్వీకరించిన తరుణంలో... మన దేశం రాజకీయ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు తొమ్మిదేళ్లలో నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికలు జరగడాన్ని మనం చూశాం. దేశ ప్రజానీకం సహనాన్ని కోల్పోతూ, ఈ ప్రభుత్వాలు వాటి బాధ్యతను సమర్థంగా నిర్వర్తించగలుగుతాయా? అనే అనుమానంలో పడిపోయారు. ఈ స్థితిని అటల్ జీ మార్చివేసి స్థిరమైన, ప్రభావవంతమైన పాలనను అందించారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అటల్‌జీ సామాన్య పౌరుల కష్టాలు అర్థం చేసుకున్నారు. ప్రభుత్వానికి దక్షత ఉంటే ఎంతటి పరివర్తనను తీసుకురావచ్చో ఆయన చేతల్లో చూపించారు.
అటల్ జీ నాయకత్వం ఎన్నో రంగాల్లో చాలాకాలం పాటు గణనీయ ప్రభావాన్ని చూపించింది. ఆయన పదవీ కాలంలో సమాచార సాంకేతిక విజ్ఞానం (ఐటీ), టెలికం, కమ్యూనికేషన్స్ రంగాల్లో గొప్ప పురోగతి చోటుచేసుకొంది. యువశక్తి అత్యంత చైతన్యవంతంగా ఉన్న భారత్ వంటి ఒక దేశానికి ఇది చాలా ముఖ్యం. అటల్ జీ నాయకత్వంలో ఏర్పాటైన ఎన్‌డీఏ ప్రభుత్వం టెక్నాలజీని సామాన్య పౌరులకు అందుబాటులోకి తేవడానికి చాలా శ్రద్ధ తీసుకుంది. అదే సమయంలో భారత్‌లో సంధాన సదుపాయాల కల్పన విషయంలోనూ ముందుచూపు కనిపించింది. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును ఈనాటికీ చాలా మంది గుర్తు పెట్టుకుంటున్నారు. సామాజిక రంగం విషయానికి వస్తే, సర్వ శిక్షా అభియాన్ వంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా పేదలకూ, సమాజంలో ఆదరణకు నోచుకోకుండా ఉండిపోయిన వర్గాలవారికీ ఆధునిక విద్యను అందుబాటులోకి తేగలిగే ఒక భారతదేశాన్ని ఆవిష్కరించాలని అటల్ జీ కన్న కలను గురించి ప్రధానంగా చెబుతుంది. అలాగే, ఆశ్రిత పక్షపాతం, దశాబ్దాల పాటు ఎదుగూబొదుగూ లేని ఆర్థిక ఆలోచనా విధానాలతో సాగిన దేశంలో... ఆర్థిక పురోగతికి బాటవేసి, అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వం చొరవ తీసుకుంది.
వాజపేయీ అద్భుత నాయకత్వానికో చక్కటి ఉదాహరణ 1998 వేసవిలో జరిగిన ఒక సంఘటనే అందుకు తార్కాణం. ఆయన ప్రభుత్వం మే 11న పదవీ బాధ్యతలు చేపట్టింది. వెనువెంటనే పోఖ్రాన్‌లో అణు పరీక్షలను నిర్వహించింది, ‘ఆపరేషన్ శక్తి’ పేరిట ఈ పరీక్షలు ప్రసిద్ధమయ్యాయి. ఈ పరీక్షలు భారత్ శాస్త్రవేత్తల శక్తిని నిరూపించాయి. భారత్ ఈ రకమైన పరీక్షలను నిర్వహించడమా? అని ప్రపంచం విస్తుపోయింది. ప్రపంచ దేశాలు వాటి ఆగ్రహాన్ని చాలా స్పష్టంగా వ్యక్తం చేశాయి. ఆ సమయంలో ఏ సామాన్య నేత అయినా ఒత్తిడికి తలొగ్గేవారు. కానీ, అటల్ జీ భిన్నమైన వ్యక్తి. అప్పుడు జరిగిందేమిటి? భారత్ దృఢంగా నిలబడటమే కాక, మరో రెండు రోజుల తరువాత అంటే మే 13న రెండో దఫా పరీక్షలు నిర్వహించింది. 11వ తేదీ నాటి పరీక్షలు విజ్ఞానశాస్త్ర నైపుణ్యాన్ని చాటితే, 13వ తేదీన నిర్వహించిన పరీక్షలు సిసలైన నాయకత్వం అంటే ఏమిటో రుజువుచేశాయి. బెదిరింపులకో, ఒత్తిడికో లొంగిపోయే రోజులు గతించిపోయాయని ప్రపంచానికి ఆయన ఒక సందేశాన్ని పంపారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అటల్‌జీ అర్థం చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో సంకీర్ణాలను పునర్నిర్వచించిన ఎన్‌డీయేకు అటల్‌జీ నాయకత్వం వహించారు. అందరినీ ఒక్కచోట చేర్చి అభివృద్ధి, జాతీయ ప్రగతి, ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చే శక్తిగా ఎన్డీయేను తయారుచేశారు. ఆయన రాజకీయ ప్రయాణంలో అడుగడుగునా రాజనీతిజ్ఞత కనిపిస్తుంది. గుప్పెడు మంది ఎంపీలున్న పార్టీకి చెందిన నాయకుడు అయినప్పటికీ ఆయన మాటలు ఆ సమయంలో శక్తిమంతమైన కాంగ్రెస్ పార్టీని గడగడలాడించేవి. ప్రధానమంత్రిగా తనదైన శైలిలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టేవారు.
అధికారం కోసం ఏనాడూ ఆయన అవకాశవాద రాజకీయాలకు పాల్పడలేదు. 1996లో ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఆయన రాజీనామా చేయడానికి మొగ్గు చూపారే తప్ప, ఎలాంటి నీచ రాజకీయాలకు, బేరసారాలకు పాల్పడలేదు.. 1999లో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో జరిగిన అనైతిక రాజకీయాలను సవాలు చేయమని చాలా మంది చెప్పినప్పటికీ ఆయన మాత్రం న్యాయబద్ధంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చివరకు అద్భుతమైన ప్రజాతీర్పుతో తిరిగి అధికారాన్ని చేపట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే విషయంలో అటల్‌జీ ఉన్నత స్థానంలోనే ఉంటారు. డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదానం ఆయనను తీవ్రంగా ప్రభావితం చేసింది. కొన్నేళ్ల తర్వాత జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. ఆత్యయిక పరిస్థితి తర్వాత, 1977 ఎన్నికలకు ముందు తాను స్థాపించిన (జన్ సంఘ్) పార్టీని జనతా పార్టీలో విలీనం చేసేందుకు ఆయన అంగీకరించారు. ఇది ఆయనతో పాటు ఇతరులను సైతం బాధించిన నిర్ణయమని నేను భావిస్తున్నాను. కానీ రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ఆయనకు ప్రధానం.
భారతీయ సంస్కృతితో అటల్‌జీ ఎంతగా మమేకమయ్యారో కూడా గమనించాల్సిందే. వాజపేయీజీ ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ నేతగా నిలిచారు. భారతీయ వారసత్వం, గుర్తింపు పట్ల ఆయన ఎంత గర్వంగా ఉండేవారో అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేసిన ఈ ఒక్క ఉదాహరణ చాలు. అటల్‌జీ వ్యక్తిత్వం అయస్కాంతం లాంటిది. ఆయన జీవితం సాహిత్యం, అభివ్యక్తి పట్ల ప్రేమతో నిండిపోయింది. ఆయన ఓ గొప్ప రచయిత, కవి. స్ఫూర్తి నింపేందుకు, ఆలోచనలను రేకెత్తించేందుకు, ఓదార్పును అందించేందుకు తన మాటలను ఉపయోగించేవారు. ఆయన అంతర్మథనానికి, దేశం పట్ల ఉన్న ఆకాంక్షలకు ఆయన కవిత్వం అద్దం పడుతుంది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలందరినీ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది.
అటల్‌జీ నుంచి నేర్చుకొనే, సంభాషించే అవకాశం దక్కడం నాలాంటి ఎంతో మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఓ గొప్ప వరం. బీజేపీకి ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా నిలిచిన ఒక దీటైన నేత వాజపేయీజీ. పార్టీ తొలినాళ్ళ నుంచి ఎటువంటి సవాళ్లు ఎదురైనప్పటికీ ఎల్‌కే ఆడ్వాణీ, డా. మురళీ మనోహర్ జోషి లాంటి దిగ్గజాలతో కలసి వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపించారు. సిద్ధాంతం, అధికారం మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సిన సందర్భాలు ఎదురైతే ఆయన మొదటిదానినే ఎంచుకొనేవారు. కాంగ్రెస్ చూపిస్తున్న ప్రపంచాన్ని కాకుండా, మరో దృక్కోణంలో ప్రపంచాన్ని చూడటం సాధ్యమేనని ఆయన దేశాన్ని ఒప్పించగలిగారు.
అటల్‌జీ శత జయంతి వేళ ఆయన ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనల్ని మనం పునరంకితం చేసుకోవాలి. ఆయన అనుసరించిన సుపరిపాలన, ఐక్యత, ప్రగతి అనే నియమాలను ప్రతిబింబించే భారత్‌ను నిర్మించడానికి మనం కృషి చేద్దాం. మన దేశ సామర్థ్యంపై అటల్‌జీకి ఉన్న అచంచలమైన విశ్వాసం ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, కష్టపడి పనిచేసేలా మనల్ని ప్రేరేపిస్తుంది.
నరేంద్ర మోదీ
భారత ప్రధానమంత్రి
Updated Date - Dec 25 , 2024 | 05:55 AM