చరిత్రపై గెలిచిన అంబేడ్కర్
ABN, Publish Date - Dec 25 , 2024 | 05:58 AM
‘నన్ను రాహుల్ గాంధీ తోసేశారు’ అని బీజేపీ ఎంపీ ముఖేశ్ రాజపుత్ ఆరోపించారు. ‘ముఖేశ్ రాజపుత్ నాపై పడితే నేను క్రింద పడ్డాను. నా తలకు గాయం తగిలింది’ అని మరో బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి చెప్పారు....
‘నన్ను రాహుల్ గాంధీ తోసేశారు’ అని బీజేపీ ఎంపీ ముఖేశ్ రాజపుత్ ఆరోపించారు. ‘ముఖేశ్ రాజపుత్ నాపై పడితే నేను క్రింద పడ్డాను. నా తలకు గాయం తగిలింది’ అని మరో బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి చెప్పారు. ‘నన్ను క్రింద పడేశారు. నేను లేచి కుంటుకుంటూ సభలోకి వెళ్లాను’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ‘రాహుల్ నాకు చాలా సమీపంగా వచ్చాడు. దానితో నాకెంతో భయం వేసింది..’ అని మరో మహిళా ఎంపీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇంత ఘోరమైన ఆరోపణల మధ్య ముగుస్తాయని ఏనాడు ఎవరూ ఊహించలేదు. ఒకప్పుడు అసెంబ్లీల పనితీరును విమర్శించేవారు. కాని ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల కన్నా దారుణంగా తయారయ్యాయి. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఒకర్నొకరు తోసేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఉభయ సభల్లో కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు.
బాబా సాహెబ్ అంబేడ్కర్ సారథ్యంలో రూపొందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇలాంటి ఘటనలు దేశంలోని జాతీయ చట్ట సభల్లో సంభవించడం దేశ రాజకీయాలలో విలువలు, ప్రమాణాలు ఎంత దిగజారాయో స్పష్టం చేస్తున్నాయి. పట్టుమని 10–12 రోజులు కూడా జరగని ఈ శీతాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య బాహాబాహీ జరగడం తప్ప సాధించింది ఏమున్నది? కొన్ని ఆర్థిక బిల్లులతో పాటు ప్రధానంగా జమిలి ఎన్నికలపై బిల్లును ప్రవేశపెట్టి సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపడం తప్ప ఈ సమావేశాల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ జమిలి ఎన్నికల గురించి ఉధృత ప్రచారం జరుగుతూనే ఉన్నది. తీరా ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత చూస్తే అందులో అత్యంత కీలకమైన స్థానిక ఎన్నికలను పక్కన పెట్టారు. దేశంలో క్రింది స్థాయిలో అధికార వికేంద్రీకరణకు ఎంతో అవసరమైన పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు జరగడం. అయితే గుజరాత్‌తో సహా చాలా రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరగడం లేదు సరికదా అధికారాలు, నిధుల పంపిణీ కూడా చట్ట ప్రకారం జరగడం లేదు! అంతేకాదు, లోక్‌సభ, అసెంబ్లీలకు సంబంధించి కూడా ఈ జమిలి ఎన్నికలు వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతాయని బిల్లులో పేర్కొన్నారు. అంటే ఇప్పట్లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు కనపడడం లేదు.
లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గత జూన్‌లో జరిగాయి. జమిలి ఎన్నికలు జరపడం ద్వారా ఖర్చు తగ్గుతుందని నిజంగా ఆలోచించినట్లయితే 2018లోనూ, 2019 చివరిలో జరిగిన అనేక అసెంబ్లీల ఎన్నికలను వీటితో పాటు కలిపి జరిపించే అవకాశం ఉండేది. ఇంతెందుకు? ఇటీవల జమ్ముకశ్మీర్, హరియాణా ఎన్నికలను, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించలేదు. ఉప ఎన్నికలను కూడా వాటితో పాటు కలపలేదు. తమ రాజకీయ సౌలభ్యం కోసం వేరువేరుగా జరిపారన్నది జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు జమిలి ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ ప్రగల్బాలు పలకడం దేనికి?
1990లో గోస్వామి కమిషన్ నుంచి 2008లో పరిపాలనా సంస్కరణల కమిషన్ వరకు పలు ఎన్నికల సంస్కరణలను సూచించాయి. ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించడం నుంచి అయిదేళ్లకు మించి శిక్షపడే అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించడం వరకు అనేక సిఫారసులు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్లు తెలిసినా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో లక్షా 35వేల కోట్లు ఖర్చయ్యాయని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది. ఇక ఒకే నాయకుడు రెండు స్థానాల్లో పోటీ చేయడం వల్ల భారీ ఎత్తున డబ్బు వృధా అవుతుందని తెలిసినా ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేతతో సహా అనేకమంది రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలుగా మారేందుకు, ఎంపీలు ఎమ్మెల్యేలుగా మారేందుకు అనుమతించడం వల్ల కూడా ఉప ఎన్నికలు జరిగి అత్యధిక మొత్తం వృధా అవుతోంది. ఒక పార్టీలో ఉండి మరో పార్టీ తరఫున పోటీ చేయడం, చివరి నిమిషంలో ఫిరాయింపులు జరగడం, అభ్యర్థులను, ఏజెంట్లను కొనుగోలు చేయడం కూడా ఎవరూ నివారించలేకపోతున్నారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టినవారు, నేరచరితులు, కళంకితులు కూడా పోటీ చేసేందుకు మన ఎన్నికల వ్యవస్థ అనుమతిస్తోంది. వీటన్నింటినీ సంస్కరించి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించకుండా జమిలి ఎన్నికల గురించి ఆలోచించడంలో అర్థం ఏమైనా ఉన్నదా?
అదానీ గ్రూప్ కొన్ని రాష్ట్రాలకు ముడుపులు ఇచ్చి సోలార్ కాంట్రాక్టులను పొందిందని అమెరికాలో కేసు దాఖలు కావడం శీతాకాల సమావేశాలకు ముందు ప్రతిపక్షాలకు కొత్త ఉత్సాహాన్ని అందించినప్పటికీ ఈ అంశంపై సభలో మాట్లాడేందుకు ప్రభుత్వం ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఎంతో ప్రామాణికంగా జరగాల్సిన రాజ్యాంగ చర్చ కూడా చివరగా హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో వివాదాస్పదం కావడం, ప్రతిపక్షాలు ఆయన క్షమాపణ కోరుతూ తీవ్ర నిరసన తెలుపడంతో ఉభయ సభలు రసాభాసగా ముగిసాయి. అయినప్పటికీ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను ఇరుపక్షాలు తలుచుకోవడం, ప్రతిపక్షాలు ‘జై భీమ్’ అని నినాదాలు చేయడం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమైనప్పటికీ దేశంలో అంబేడ్కర్ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతున్నదే కాని తగ్గడం లేదని స్పష్టం అవుతోంది.
అస్పృశ్యులుగా సమాజం పరిగణించిన దళితులకు విద్యా, ఉపాధి రంగాల్లో అవకాశాలతో పాటు అందరితో పాటు సమానంగా, గౌరవంగా జీవించే హక్కుకోసం తన జీవితాంతం పోరాడిన అంబేడ్కర్ ప్రాసంగికతను ఎవరూ విస్మరించలేరు. అగ్రవర్ణ సంస్కర్తల దయాదాక్షిణ్యాలపై కాకుండా అణగారిన వర్గాలు తమ స్వంత నాయకుల ఆధ్వర్యంలో తమ హక్కులను స్వయంగా పొందాలని ఆయన ఆశించారు. వారిని హిందువులకు భిన్నంగా ప్రత్యేక మైనారిటీ వర్గంగా పరిగణించాలని వాదించారు. వారికి చట్టసభల్లో అత్యధిక ప్రాతినిధ్యాన్ని సాధించారు. అస్పృశ్యత అనే దుర్మార్గాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువచ్చి దళితుల పౌర, సామాజిక, రాజకీయ హక్కుల్ని, స్వేచ్ఛను కాపాడేందుకు అంబేడ్కర్ ఏ విధంగా అడుగడుగునా పోరాడారో ధనుంజయ్ కీర్ రాసిన అంబేడ్కర్ జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది.
‘రాజ్యాంగ నైతికత అనేదాన్ని మనం పెంపొందించాలే కాని అది సహజంగా జరగదు. మనం దాన్ని ఇంకా నేర్చుకోవాల్సి ఉన్నది. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ఒక అప్రజాస్వామిక సమాజంపై అద్దిన పై మెరుగు మాత్రమే..’ అని అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగంపై రాజ్యాంగ అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు. ప్రతి వ్యక్తికీ ఓటు హక్కు కన్నా, ప్రతి వ్యక్తికీ ఒకే రకమైన విలువ లభించడమే రాజ్యాంగ నైతికత. సమానత్వం లేని స్వేచ్ఛ కొద్ది మందికే ఉపయోగపడుతుందని చెప్పారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా స్వేచ్ఛ, సమానత్వం, హుందాగా జీవించే పరిస్థితుల్లో భారతీయులు ఉన్నారా? కులమత లింగ వివక్షలకు తావు లేదని, అంటరాని తనం అమలు కాకూడదని, భావ ప్రకటనా స్వేచ్చ ఉండాలని, జీవించేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉన్నదని చెప్పే 15, 17, 19, 21 అధికరణలు అమలు అవుతున్నాయా? రాజ్యాంగం ప్రకారమే రాజ్యాంగం అమలు అవుతున్నదా? అన్న ప్రశ్నలకు జవాబులు లేవు.
అంబేడ్కర్ గురించి చర్చ జరిగినప్పుడల్లా కొందరికి తమ ఎజెండా అమలు కావడం లేదనే ఆగ్రహం కలుగుతుంది. అదే సమయంలో అంబేడ్కర్ వారసులం తామేనని చెప్పుకునేందుకు ప్రయత్నించేవారు, అంబేడ్కర్‌ను అవమానించారని ప్రత్యర్థులను వేలెత్తి చూపేవారు ఎల్లెడలా కనిపిస్తారు. అక్కడే అంబేడ్కర్ విజయం మనకు అర్థమవుతుంది. జైళ్లలో 51 శాతం పైగా దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఉన్నారని తెలిసినప్పుడు, గర్భా డాన్స్‌లో పాల్గొన్నందుకు తనను కొట్టారని ఒక దళిత మహిళ ఆక్రోశించినప్పుడు, దళితులు ఇంకా అవమానాలకు గురి అవుతున్నారని తేలినప్పుడు అంబేడ్కర్ చారిత్రక ఆవశ్యకత సమసిపోలేదని అర్థమవుతుంది.
అయినప్పటికీ భారత రాజకీయాల అంతర్గత స్వభావం మారుతోంది. సంప్రదాయంగా బలంగా ఉన్న కులాల ఆధిపత్యం సమసిపోతూ అణగారిన వర్గాల కేంద్రంగా రాజకీయాలు మారడం క్రమంగా కనపడుతోంది. తమంతట తాము విజయం సాధించలేమని, ఇతర వర్గాలను మెప్పించడం అవసరమని రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి. బలహీన కులాలు బలమైన కులాల చుట్టూ చేరడం క్రమంగా మారిపోతూ, బలమైన కులాలను తామే ప్రభావితం చేసేందుకు సమీకృతం కాగల పరిస్థితి ఏర్పడుతోంది. సంప్రదాయిక రాజకీయ నిర్మాణం విచ్ఛిన్నమయ్యే పరిణామం తీవ్రతరమైంది. ఏ ఎన్నికలు జరిగినా, దళితులు, వెనుకబడిన వర్గాలవారు ఎవరికి ఓటు వేస్తారన్న విషయం చర్చ జరుగుతోంది. హరియాణాలో జాట్ రాజకీయాలను వెనుకబడిన, దళిత వర్గాలు విఫలం చేశాయి. మహారాష్ట్రలో మరాఠా రాజకీయాలను వెనుకబడిన వర్గాలు చిత్తు చేశాయి. బిహార్‌లో భూమిహార్, రాజపుత్, బ్రాహ్మణ వర్గాలు తమంతట తామే అధికారం చేజిక్కించుకునే పరిస్థితి ఏనాడో కోల్పోయాయి. ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్‌పీని బలహీనం చేయడం ద్వారా బీజేపీ బలపడితే, కేవలం యాదవులు, ముస్లింల ఓట్లతో విజయం సాధించలేమని సమాజ్‌వాది పార్టీ గ్రహించి, యాదవేతరులకు ఎక్కువ సీట్లు ఇచ్చినందుకే గత లోక్‌సభ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించగలిగింది. అంబేడ్కర్‌ను అమిత్ షా అవమానించారని నిరసన ప్రదర్శనలు చేయడం వల్ల తమను అణగారిన వర్గాలు అక్కున చేర్చుకుంటాయని కాంగ్రెస్ భావిస్తే అమాయకత్వమే అవుతుంది. అసలు ఈ వర్గాలు తమ నుంచి ఎందుకు చేజారిపోయాయి, బీజేపీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాయి వారిలో మళ్లీ విశ్వాసం ఎలా కల్పించగలం అన్న ప్రశ్నలపై ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడే ఆ పార్టీ నిలదొక్కుకోగలుగుతుంది.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - Dec 25 , 2024 | 05:58 AM