ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త పలుకు : కూల్చుడు కతలు!

ABN, Publish Date - Jun 30 , 2024 | 06:18 AM

‘ఒకటి రెండు నెలలు ఓపిక పట్టండి.. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉండదు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మనతో టచ్‌లో ఉన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్‌లో ఉన్నాం. రెండు నెలల తర్వాత అధికారంలోకి వస్తాం. ముఖ్యమంత్రి పదవిపై

‘‘ఒకటి రెండు నెలలు ఓపిక పట్టండి.. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉండదు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మనతో టచ్‌లో ఉన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్‌లో ఉన్నాం. రెండు నెలల తర్వాత అధికారంలోకి వస్తాం. ముఖ్యమంత్రి పదవిపై నాకు ఆశ లేదు. ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు మార్గదర్శిగా ఉంటాను. కాంగ్రెస్‌లో చేరుతున్న మన ఎమ్మెల్యేలను న్యాయస్థానం ద్వారా అనర్హులుగా ప్రకటింపజేస్తాం. ఢిల్లీకి చెందిన పెద్ద లాయర్‌తో మాట్లాడాం. ఇంతకంటే ఎక్కువ చెప్పను. చెబితే రహస్యాలు లీక్‌ అవుతాయి’’.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజుల క్రితం ఫాంహౌస్‌కు పిలిపించుకున్న తన పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పిన మాటలు ఇవి. ఎమ్మెల్యేలకు తన మాటలపై నమ్మకం కుదరడం కోసం ఆయన కొన్ని ఆడియో సంభాషణలను కూడా వినిపించారు. సదరు ఆడియోలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభృతులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కించపరిచే విధంగా చేసినట్టున్న వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ ఆడియో టేపులు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడకముందు రికార్డ్‌ చేసినవా? లేక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతా అన్నది మాత్రం కేసీఆర్‌ చెప్పలేదు. మొత్తంమీద కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చే వారితో పాటు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నది కేసీఆర్‌ మాటల సారాంశం. కేసీఆర్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న వారిలో ఒకరైన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శుక్రవారం ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్‌ పార్టీలో చేరగా, మరో ఇద్దరు వారం రోజుల్లో ఆ పార్టీలో చేరబోతున్నారు. కేసీఆర్‌ చెబుతున్న దాంట్లో నిజం ఉందా? లేదా? భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేత నిజంగానే ఆయనతో టచ్‌లో ఉన్నారా? కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు ఆ పార్టీని వదిలి వస్తారా? వస్తే వారిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎలా అవుతారు? ఎనిమిది మంది సభ్యులున్న బీజేపీ, 30 మంది (ప్రస్తుతానికి) సభ్యులున్న బీఆర్‌ఎస్‌తో కలిపినా 38 మంది సభ్యుల బలం మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 22 మంది కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ నుంచి అంతమందితో బయటకు వచ్చే నాయకుడు ఉన్నారా? ఈ లోపు బీఆర్‌ఎస్‌ నుంచి మరికొంత మంది కాంగ్రెస్‌లో చేరితే ఆ పార్టీ బలం 30 కంటే తక్కువ అవుతుంది కదా? ఈ పరిస్థితులలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎలా సాధ్యం? వంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. పార్టీ వదిలిపోతున్న శాసనసభ్యులను కాపాడుకోవడం కోసం కేసీఆర్‌ ఈ కథ అల్లారో... లేక నిజంగానే ఆయన ఢిల్లీలోని బీజేపీకి చెందిన కీలక నేతతో టచ్‌లో ఉంటూ వ్యూహ రచన చేస్తున్నారో తెలియదు. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోతున్నప్పుడు ఉన్న వారినైనా కాపాడుకోవడం కోసం పార్టీ అధినేత ఇలాంటి కథలు చెప్పడం సహజం. కేసీఆర్‌కు ఇలాంటి పిట్ట కథలు చెప్పడం అలవాటే కనుక ఆయన మాటలను సొంత పార్టీ వాళ్లు కూడా నమ్మడం లేదు. గతంలో టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించినప్పుడు కూడా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో అన్ని సీట్లు గెలుస్తాం, ఇన్ని సీట్లు గెలుస్తాం, లోక్‌సభ ఎన్నికల తర్వాత నేనే ప్రధానమంత్రిని అవుతా, లేదా చక్రం తిప్పుతా.. అని తన పార్టీ వారి వద్ద కేసీఆర్‌ గొప్పలు చెప్పుకొన్నారు. చివరకు బీఆర్‌ఎస్‌కు లోక్‌సభలో కనీసం ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. కేసీఆర్‌కు జాతకాలపై నమ్మకం కూడా ఎక్కువే. ప్రస్తుతం ఆయనకు గ్రహాలు అనుకూలంగా లేవట. వచ్చే సెప్టెంబరు తర్వాత ఆయనకు మంచి రోజులు వస్తాయట. బహుశా ఈ జాతకాలనే నమ్ముకొని ఒకటీ రెండు నెలల తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని చెబుతుండవచ్చు. అయితే కేసీఆర్‌ చెబుతున్న మాటల గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వేగవంతం చేశారు. మరికొద్ది రోజుల్లో బీఆర్‌ఎస్‌ బలం 20 లోపునకు పడిపోతుందని చెబుతున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితులలో బీజేపీ అగ్రనేతలు కూడా తెలంగాణలో అతుకుల బొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడకపోవచ్చు. మహారాష్ట్రలో ఆ పార్టీ చేసిన ప్రయోగం వికటిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం బీజేపీతో చేతులు కలిపిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తిరిగి శరద్‌ పవార్‌ వర్గంలో చేరబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి.

ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలో శివసేనను వదిలి వచ్చిన వాళ్లలో కూడా కొందరు అదే ఆలోచన చేయవచ్చు. వీటన్నింటికీ తోడు అధికారంలో కొనసాగడం కోసం ఒకప్పుడు బీజేపీని తిట్టి పోసిన వారితో చేతులు కలపడాన్ని ఆరెస్సెస్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ ముందుకు రాకపోవచ్చు. మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే ఏక్‌నాథ్‌ షిండే వంటి వారిని ఇతర రాష్ర్టాలలో ప్రోత్సహించడానికి బీజేపీ అగ్రనేతలు సిద్ధపడకపోవచ్చు. దీన్నిబట్టి కేసీఆర్‌ జాతకంలో ఇప్పుడప్పుడే మార్పులు ఉండకపోవచ్చు. కేసీఆర్‌ ప్రస్తుత దుస్థితికి ఆయనే కారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ ఫిరాయింపులను విస్తృతంగా ప్రోత్సహించిన ఘనత ఆయనదే. అందుకే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీని తప్పుబట్టే నైతిక అర్హత ఆయనకు లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన కేసీఆర్‌ కుటుంబంపై ఇప్పుడు తెలంగాణలో సానుభూతి చూపించేవారే కరువయ్యారు. కవితను జైల్లో పెట్టి వంద రోజులు దాటినా ఆమె గురించి తలచుకొనేవారే లేకుండా పోయారు. తనకూ తన కుటుంబసభ్యులకూ ఈ పరిస్థితి ఎందుకు ఎదురవుతున్నదో కేసీఆర్‌ ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. నిజానికి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ను ప్రజలు శాశ్వతంగా గుండెల్లో పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా లభించలేదంటే కేసీఆర్‌ అండ్‌ కో సేవలు ఇకపై తమకు అవసరం లేదని తెలంగాణ ప్రజలు నిర్ణయానికి వచ్చారని భావించాలి. కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాలను గుర్తించకపోగా ఒకటి రెండు నెలల్లో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని కల్లబొల్లి కబుర్లు చెప్పడం కేసీఆర్‌కే చెల్లుతుంది.

వాస్తవంలోకి వస్తే బెటర్‌!

బ్రహ్మాండమైన ప్రజా మద్దతుతో 2018లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌, 2019లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని పాతర వేశారు. ముఖ్యమంత్రులు ఎలా ఉండకూడదో తమ చర్యల ద్వారా భావితరాలకు చెప్పారు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా ‘మేం ఏం తక్కువ చేశామని మమ్మల్ని ఓడించారు?’ అని ప్రజలను నిందిస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న స్పృహ లేకుండా రాచరిక పోకడలు పోతే ప్రజలు సహించరని ఎందుకు తెలుసుకోరో తెలియదు. తమను తాము గొప్ప పాలకులుగా ఆ ఇద్దరూ ఇప్పటికీ నమ్ముతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రగతిభవన్‌కు పరిమితం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి పరదాల మాటున ఉండిపోయారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎలా అన్న పిచ్చి ఆలోచనలు చేయకుండా తాను కోల్పోయిన ప్రజాభిమానాన్ని తిరిగి పొందడం ఎలా? అన్న దానిపై దృష్టిపెట్టడం మంచిది. ప్రస్తుత రాజకీయాలలో అధికారం కోల్పోయిన పార్టీలు మనుగడ సాగించడం కష్టంగా ఉంటోంది. గతంలో చంద్రబాబు కూడా ఇటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన పడని పాట్లు లేవు. కేసీఆర్‌ ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా తనను తాను మభ్యపెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం పిట్ట కథలు చెప్పడం తప్పు కాదు గానీ అది నిజం కాబోతోందని నమ్మితే మాత్రం రాజకీయంగా మోక్షం లభించదు. తెలంగాణ ప్రజలు తనను ఎందుకు తిరస్కరించారో గుర్తించడానికి కేసీఆర్‌ ఇప్పటికీ సిద్ధంగా లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయనలో ఇప్పటికీ అహం తగ్గలేదు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్నాడు కనుకనే చంద్రబాబు పడి లేచారు. ఈ లాజిక్‌ను పట్టించుకోని కేసీఆర్‌, ప్రజలు తన పాలన కోసం ఎదురుచూస్తున్నారని పగటి కలలు కంటున్నారు. రాజకీయాల్లో విధేయతకు ఇప్పుడు చోటు లేకుండా పోయింది. తన పక్కన పెద్ద సోఫా వేసి కూర్చోబెట్టుకున్న మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎక్కడో ఉన్న వ్యక్తిని రాజకీయాల్లోకి తెచ్చి ఎమ్మెల్యేను చేసిన సంజయ్‌ వంటి వాళ్లు అధికారం కోల్పోయిన తర్వాత తనను వదిలిపోవడంపై కేసీఆర్‌ మనసు కష్టపెట్టుకున్నట్టుగా ఉంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పదేళ్లు మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి ఆ పార్టీని వదిలి తనతో చేతులు కలిపినప్పుడు కేసీఆర్‌కు ఇలాంటి సెంటిమెంట్లు గుర్తుకురాలేదు. గతంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు చెందిన శాసనసభ్యులను తన పార్టీలో చేర్చుకున్నప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించాల్సి ఉంటుందన్న విషయం కేసీఆర్‌కు తెలియదా? అప్పుడు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను స్పీకర్‌ పట్టించుకున్నారా? తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన తలసాని శ్రీనివాసయాదవ్‌తో ఉత్తుత్తి రాజీనామా చేయించి మంత్రి పదవి కట్టబెట్టిన కేసీఆర్‌కు నైతిక విలువలు గుర్తుకురాలేదా? ఇప్పుడు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవడం అన్యాయం, అక్రమం అని రోదిస్తే ఫలితం ఉంటుందా? అధికారంలో ఉన్నప్పుడు కట్టుబాట్లు తప్పకుండా ఉండి ఉంటే కేసీఆర్‌కు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. కర్మ ఫలం అనుభవించి తీరాల్సిందే. పార్టీ ఫిరాయింపులను తప్పుబట్టే అర్హత ఇప్పుడు ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా లేదు. అందుకే కేసీఆర్‌ ఆక్రందనలను తెలంగాణ ప్రజలు ఆలకించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా ఇకపై పాలన మీద మరింత దృష్టి కేంద్రీకరించాలి. ప్రభుత్వం పరుగులు పెడుతోందన్న భావనను ప్రజల్లో కలిగించాలి. తన ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుంటూ ఉండాలి. కొన్ని విషయాలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కింది స్థాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు ట్రాన్స్‌ఫారం కావాలంటే వారాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. భూ వినియోగ మార్పిడి ఫైళ్లకు అతీగతీ ఉండటం లేదు. ఆయా సమస్యలపై ప్రజాభిప్రాయాన్ని మదింపు చేసుకొని ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థను కూడా పటిష్ఠం చేయాలి. పోలీసులలో కొంత అలసత్వం కనబడుతోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాతనైనా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తారని ఆశిద్దాం.


ఇప్పటికీ అవే రోత మాటలు!

తెలంగాణలో కట్టుకథలు, పిట్టకథలతో కేసీఆర్‌ కాలక్షేపం చేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రస్తుతం బెంగళూరులోని ప్యాలెస్‌లో సేద తీరుతున్నారు. ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అన్నీ వదిలేసుకుని హిమాలయాలకు వెళ్లాలనిపించిందని నిర్వేదం వ్యక్తంచేశారు. శాసనసభలో తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని సభాపతికి ఒక లేఖ రాసి పడేసి ఆయన బెంగళూరు వెళ్లిపోయారు. ప్రతిపక్ష నాయకుడి హోదాను ఆయనకు ప్రజలే ఇవ్వలేదు. ప్రజలు తనను అంతలా ఎందుకు తిరస్కరించారో తెలుసుకొనే ప్రయత్నం చేయకపోగా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే తాను శాసనసభకు హాజరు కానన్న బెదిరింపులకు తెగబడటం విడ్డూరంగా ఉంది. చాక్లెట్‌ కొనిస్తేనే నేను బడికి వెళతానని పిల్లలు మారాం చేసినట్టుగా జగన్‌రెడ్డి మారాం ఉంది. ఆయన శాసనసభకు హాజరు కాకపోతే ఎవరికి నష్టం? చెరువు మీద అలిగినట్టుగా ఉంది. అయినా ఇప్పుడు జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వాదిస్తున్న వాళ్లు గతంలో జగన్‌ తలుచుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా పోతుందని కూశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నాయకుడి హోదా తొలగించినప్పుడు అలా ఎలా అని ప్రశ్నించలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి పదిహేను రోజులు మాత్రమే అయింది. అయినా తన ఏలుబడిలో సజావుగా ఉన్న రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు సమస్యలతో అల్లాడిపోతున్నట్టుగా చిత్రించే పనిలో జగన్‌రెడ్డి అండ్‌ కో ఉండటం మరీ రోతగా ఉంది. తమ పాలన నిజంగా అంత గొప్పగా ఉండి ఉంటే వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చినట్టు? ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో జగన్‌రెడ్డి చాలా బలంగా రుజువు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అనుక్షణం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్‌ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేల పోకడలను, ప్రభుత్వ దుశ్చర్యలను గుర్తుకు తెచ్చుకొని బ్లూ బుక్‌ రూపొందించుకొని అందుకు అనుగుణంగా ప్రస్తుత మంత్రులు నడుచుకోవాలి.

ప్రభుత్వం ఎలా ఉండకూడదో జగన్‌రెడ్డి మన కళ్ల ముందు ఆవిష్కరించారు. అది తెలుసుకొని వాటిని గుర్తుచేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యత. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన వాళ్లను ప్రజలు క్షమించరు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వారిని ప్రజలు మరింత నిశితంగా గమనిస్తారు. 2019లో 151 సీట్లతో జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఆహా ఓహో అనుకున్నాం. అయితే ఆ ప్రభుత్వ పోకడలను గమనించిన ప్రజలకు అనతికాలంలోనే విరక్తి కలిగింది. జగన్మోహన్‌రెడ్డి వికృత ఆలోచనలు చేసి ఉండకపోతే ఇప్పుడు 11 సీట్లకే పరిమితమై ఉండేవారు కాదు. ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం దేబిరించాల్సిన దుస్థితి వచ్చి ఉండేది కాదు. ప్రజలే ఆయనకు ఆ హోదా ఇచ్చి ఉండేవారు. పగ, ప్రతీకారాలతో రగిలిపోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి ఉంటే పెద్దగా అద్భుతాలు చేయకపోయినా జగన్‌రెడ్డి అధికారంలో కొనసాగి ఉండేవారు. అలా చేయలేదు కనుకే ప్రజలు ఆయనకు గర్వభంగం కలిగించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే దీనివల్ల ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఫలితం ఉండడం లేదు. ఇది పదే పదే రుజువైంది. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజలు తీర్పు ఇస్తారు. ఇప్పుడు 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆనవాయితీ ప్రకారం జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం మొదలుపెట్టింది. పోలవరం ప్రాజెక్టుపై శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్మోహన్‌రెడ్డి చేతగానితనం వల్ల పోలవరం ప్రాజెక్టు నాశనం అయిందని, వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయనను నిందించారు. త్వరలో మరో ఆరేడు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. నిజమే, జగన్‌ పాలనతో పోలవరం ప్రాజెక్ట్‌ అతీగతీ లేకుండా పోయింది. ప్రజలకు ఆ విషయం తెలియదా? రాష్ట్రంలో రాజధాని లేకుండా పోయిందని, పోలవరం వంటి ప్రాజెక్టులు మూలనపడ్డాయని గుర్తించారు కనుకే ప్రజలు జగన్‌రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించారు. మూడు రాజధానులు అని చెప్పినా కర్నూలు, విశాఖలలో కూడా ఆయనకు ఆదరణ లభించలేదు. ఈ నేపథ్యంలో జగన్‌ వైఫల్యాల గురించి ప్రజలకు కొత్తగా చెప్పాల్సింది ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత ప్రభుత్వంలో తమ ఆశలు అడియాశలయ్యాయి కనుకే కనీవినీ ఎరుగని మెజారిటీతో కూటమిని ప్రజలు గెలిపించారు. కుంటుపడిన పోలవరం ప్రాజెక్టును తాము ఎలా ముందుకు తీసుకువెళ్లబోతున్నారో ముఖ్యమంత్రిగా చంద్రబాబు వివరించాల్సిన అవసరం ఉంది.


జగన్‌ చర్యల కారణంగా పోలవరంలో కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగిన మాట వాస్తవమే అయితే ఆ నష్టానికి బాధ్యులు అయిన వారిపై చర్యలు తీసుకోవాలి కదా? నిబంధనలకు విరుద్ధంగా జగన్‌ ప్రభుత్వం చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ను సరిదిద్దుతారా? కాంట్రాక్టర్‌ను మార్చడం తప్పిదం అని చెబుతున్నందున ఆ తప్పును సరిదిద్దుతారా? లేదా? వంటి ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ కారణంగా జరిగింది చెప్పడంతో పాటు జరగబోయేది కూడా చెబితేనే శ్వేతపత్రాల విడుదల వల్ల ప్రయోజనం ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు దుర్మార్గంగా వ్యవహరించిన వారిని ఎన్నికల్లో ఓడించడం ద్వారా తమ బాధ్యత తీరిపోయిందని ప్రజలు భావిస్తారు. జగన్‌ విషయంలో కూడా ఇదే జరిగింది. గంపెడు ఆశతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ వాస్తవాన్ని చంద్రబాబు అండ్‌ కో గుర్తించాలి. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, అంతకుముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. ప్రజలు అవేవీ గుర్తుంచుకోకుండా జగన్‌రెడ్డి దుష్టపాలన ఆధారంగానే తీర్పు ఇచ్చారు. కాగా రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి విమర్శ ఎదుర్కొంటున్నారు. రామోజీరావుకు అర్హత ఉందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ ఇంట్లో వాళ్లు సంబరాలు చేసుకుంటారు. ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడై తాను ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి కన్ను మూసినప్పుడు ఆయన వల్ల ప్రయోజనం పొందినవాళ్లు, ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నవాళ్లు బాధపడతారు. గతించిన వారితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం కోసం సంస్మరణ సభలు పెట్టుకుంటారు. నాయకుడైతే ఆయనను అభిమానించే ప్రజలు స్మరించుకుంటారు. ఈ నేపథ్యంలో రామోజీరావు సంస్మరణ సభను ప్రభుత్వపరంగా కాకుండా ఆయనతో అనుబంధం ఉన్న వారితో కమిటీ ఏర్పాటు చేసి నిర్వహింపజేసి ఉంటే విమర్శలకు అవకాశం ఉండేది కాదు. ఇకపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత జాగ్రత్త తీసుకుంటారని ఆశిద్దాం!

నిజానికి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ను ప్రజలు శాశ్వతంగా గుండెల్లో పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా లభించలేదంటే కేసీఆర్‌ అండ్‌ కో సేవలు ఇకపై తమకు అవసరం లేదని తెలంగాణ ప్రజలు నిర్ణయానికి వచ్చారని భావించాలి.

అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన వాళ్లను ప్రజలు క్షమించరు. 2019లో 151 సీట్లతో జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఆహా ఓహో అనుకున్నాం. అయితే ఆ ప్రభుత్వ పోకడలను గమనించిన ప్రజలకు అనతికాలంలోనే విరక్తి కలిగింది. జగన్మోహన్‌రెడ్డి వికృత ఆలోచనలు చేసి ఉండకపోతే ఇప్పుడు 11 సీట్లకే పరిమితమై ఉండేవారు కాదు. ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం దేబిరించాల్సిన దుస్థితి వచ్చి ఉండేది కాదు. ప్రజలే ఆయనకు ఆ హోదా ఇచ్చి ఉండేవారు. పగ, ప్రతీకారాలతో రగిలిపోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి ఉంటే పెద్దగా అద్భుతాలు చేయకపోయినా జగన్‌రెడ్డి అధికారంలో కొనసాగి ఉండేవారు. అలా చేయలేదు కనుకే ప్రజలు ఆయనకు గర్వభంగం కలిగించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే దీనివల్ల ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఫలితం ఉండడం లేదు. ఇది పదే పదే రుజువైంది.


లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం బీజేపీతో చేతులు కలిపిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తిరిగి శరద్‌ పవార్‌ వర్గంలో చేరబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలో శివసేనను వదిలి వచ్చిన వాళ్లలో కూడా కొందరు అదే ఆలోచన చేయవచ్చు. వీటన్నింటికీ తోడు అధికారంలో కొనసాగడం కోసం ఒకప్పుడు బీజేపీని తిట్టి పోసిన వారితో చేతులు కలపడాన్ని ఆరెస్సెస్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ ముందుకు రాకపోవచ్చు. మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే ఏక్‌నాథ్‌ షిండే వంటి వారిని ఇతర రాష్ర్టాలలో ప్రోత్సహించడానికి బీజేపీ అగ్రనేతలు సిద్ధపడకపోవచ్చు. దీన్నిబట్టి కేసీఆర్‌ జాతకంలో ఇప్పుడప్పుడే మార్పులు ఉండకపోవచ్చు.

తన పక్కన పెద్ద సోఫా వేసి కూర్చోబెట్టుకున్న మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎక్కడో ఉన్న వ్యక్తిని రాజకీయాల్లోకి తెచ్చి ఎమ్మెల్యేను చేసిన సంజయ్‌ వంటి వాళ్లు అధికారం కోల్పోయిన తర్వాత తనను వదిలిపోవడంపై కేసీఆర్‌ మనసు కష్టపెట్టుకున్నట్టుగా ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పదేళ్లు మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి ఆ పార్టీని వదిలి తనతో చేతులు కలిపినప్పుడు కేసీఆర్‌కు ఇలాంటి సెంటిమెంట్లు గుర్తుకురాలేదు. గతంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు చెందిన శాసనసభ్యులను తన పార్టీలో చేర్చుకున్నప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించాల్సి ఉంటుందన్న విషయం కేసీఆర్‌కు తెలియదా?

అప్పుడు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను స్పీకర్‌ పట్టించుకున్నారా? తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన తలసాని శ్రీనివాసయాదవ్‌తో ఉత్తుత్తి రాజీనామా చేయించి మంత్రి పదవి కట్టబెట్టిన కేసీఆర్‌కు నైతిక విలువలు గుర్తుకురాలేదా?

ఇప్పుడు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవడం అన్యాయం, అక్రమం అని రోదిస్తే ఫలితం ఉంటుందా? అధికారంలో ఉన్నప్పుడు కట్టుబాట్లు తప్పకుండా ఉండి ఉంటే కేసీఆర్‌కు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు.

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం బీజేపీతో చేతులు కలిపిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తిరిగి శరద్‌ పవార్‌ వర్గంలో చేరబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలో శివసేనను వదిలి వచ్చిన వాళ్లలో కూడా కొందరు అదే ఆలోచన చేయవచ్చు. వీటన్నింటికీ తోడు అధికారంలో కొనసాగడం కోసం ఒకప్పుడు బీజేపీని తిట్టి పోసిన వారితో చేతులు కలపడాన్ని ఆరెస్సెస్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ ముందుకు రాకపోవచ్చు. మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే ఏక్‌నాథ్‌ షిండే వంటి వారిని ఇతర రాష్ర్టాలలో ప్రోత్సహించడానికి బీజేపీ అగ్రనేతలు సిద్ధపడకపోవచ్చు. దీన్నిబట్టి కేసీఆర్‌ జాతకంలో ఇప్పుడప్పుడే మార్పులు ఉండకపోవచ్చు.


యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం

QR Code scan చేయండి

Updated Date - Jun 30 , 2024 | 07:09 AM

Advertising
Advertising