RK Kothapaluku: గతం మరిచి గగ్గోలు...
ABN, Publish Date - Jun 16 , 2024 | 04:45 AM
ఆంధ్రప్రదేశ్‌లో దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ప్రజాస్వామ్యం, హక్కులు, విలువలు, విశ్వసనీయత వంటి పదాలు వల్లె వేస్తున్నాయి. ‘దేవుడా ఇదెక్కడి ప్రజాస్వామ్యం’ అని సదరు గొంతులు వాపోతున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా...
ఆంధ్రప్రదేశ్‌లో దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ప్రజాస్వామ్యం, హక్కులు, విలువలు, విశ్వసనీయత వంటి పదాలు వల్లె వేస్తున్నాయి. ‘దేవుడా ఇదెక్కడి ప్రజాస్వామ్యం’ అని సదరు గొంతులు వాపోతున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, వైసీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి వాళ్లు ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయగా, పార్టీ అధినేత జగన్‌రెడ్డి మరో అడుగు ముందుకెళ్లి... చంద్రబాబు పాలనలో ఈ ఐదేళ్లు కష్టాలకు ఓర్చుకుంటే మళ్లీ మనదే అధికారం అని చెప్పుకొంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులే అయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగు రోజులు మాత్రమే అయింది. ఇంతలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలిపోయినట్టుగా శోకాలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేసేముందు అధికారంలో ఉన్న ఐదేళ్లలో తామేం చేశామో మరచిపోయారు. ఐదేళ్లపాటు కక్షపూరితంగా పాలనసాగించిన జగన్మోహన్‌రెడ్డి... ఇప్పుడు తనను ఇబ్బందులపాలు చేయబోతున్నారని చెప్పుకోవడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులను ఎలా వేధించిందీ మరచిపోతే ఎలా? ప్రశ్నించిన వారిని, విమర్శించిన వారిని కేసులలో ఇరికించడం గుర్తులేదా? రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా చెలరేగిపోయిన వాళ్లు ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ అంటూ రోదించడం రోతగా ఉంది.
వెంటాడి వేధించలేదా...
జగన్‌రెడ్డి పాలనలో కక్ష సాధింపు ఏ విధంగా ఉండిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 2014 నుంచి 2019 వరకు శాసనసభ స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి జగన్ ప్రభుత్వ వేధింపులు కారణం కాదా? కోడెలతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసుల మీద కేసులు పెట్టి వేధించడం నిజం కాదా? పల్నాడు పులి అని పిలిపించుకున్న కోడెల ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పాపం జగన్ ప్రభుత్వానిది కాదా? ఆయన ఆత్మహత్య చేసుకున్నాక శాంతించిన ప్రభుత్వం సదరు కేసులను అటకెక్కించలేదా? స్పీకర్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వం సరఫరా చేసిన ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కోడెలపై కేసు పెట్టిన విషయం మరిచారా? ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయించిన ఫర్నిచర్ తిరిగి ఇచ్చారా? ఇప్పటికీ లేదే? కరోనా సమయంలో మాస్క్‌లు సరఫరా చేయడం లేదని ప్రశ్నించినందుకు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ను వేధించి ఆయన చావుకు కారణం కాలేదా? ఆయనను పిచ్చివాడిగా చిత్రించి నడిరోడ్డుపై పోలీసులతో కొట్టించలేదా? ఆయన అకాల మరణంతో జగన్ ప్రభుత్వం శాంతించింది. సీనియర్ సిటిజన్ రంగనాయకమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో పోస్ట్ పెట్టిందని చెప్పి పోలీసులతో వేధించడంతో... అది తట్టుకోలేక ఆమె హైదరాబాద్‌కు వలస వెళ్లడం నిజం కాదా? పరువు ప్రతిష్ఠలతో బతికినవారిని, ఆత్మవిశ్వాసంతో ఎదురు నిలిచిన వారిని వేధించడమే పనిగా పెట్టుకోలేదా? రాష్ట్రంలో తన చానల్ ప్రసారాలు నిలిచిపోవడంపై జగన్‌రెడ్డి ఇప్పుడు శోకాలు పెడుతున్నారు.
అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఏబీఎన్‌తో పాటు మరో చానల్ ప్రసారాలను ఐదేళ్ల పాటు జగన్ అండ్ కో నిలిపివేయించలేదా? తప్పుడు విధానాలకు తెరతీసింది ఎవరు? ధర్మో రక్షతి రక్షితః అంటారు. మనం ధర్మబద్ధంగా వ్యవహరిస్తే, ఇతరులు కూడా మన పట్ల ధర్మబద్ధంగా వ్యవహరించాలని కోరవచ్చు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడిన వాళ్లు ఇప్పుడు అన్యాయం, అక్రమం అని శోకాలు పెట్టడమేమిటి? జగన్ నాయకత్వాన్ని ధిక్కరించి విమర్శలు చేసిన సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజును పోలీసులు తీసుకెళ్లి అరికాళ్లపై అదేపనిగా కొట్టారు కదా? కస్టోడియల్ టార్చర్ నేరమని తెలిసి కూడా ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని చిత్రహింసలు పెట్టారంటే జగన్ పాలన ఎంత దారుణంగా ఉండిందో తెలియడం లేదా? రఘురాజును అరికాళ్లు పగిలేలా కొట్డడం తప్పని చెప్పకపోగా– ‘అబ్బే ఆయనను ఎవరూ కొట్టలేదు. అరికాళ్లపై ఆయనకు సొరియాసిస్ ఉంది’ అని జగన్ భజనపరులు దిక్కుమాలిన వాదన చేయడం నిజం కాదా? సీఐడీ విభాగాన్ని కిరాయి సైనిక మూకగా మార్చి తప్పుడు కేసులు పెట్టించడాన్ని జగన్‌రెడ్డి ఎలా సమర్థించుకుంటారు? తనకు వేధింపులు కొత్త కాదని, ఇకపై కూడా వేధింపులు, కష్టాలు ఎదురవుతాయని అంటూ ప్రజల సానుభూతి కోసం జగన్ ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇది నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్న నానుడిని ఆయన మర్చిపోతున్నారు. నిండు శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణిని అవమానించినప్పుడు... నాటి కౌరవ సభలో ద్రౌపదీ వస్ర్తాపహరణం సందర్భంగా దుర్యోధనుడు వికటాట్టహాసం చేసినట్టుగా ఈనాటి సభలో జగన్ షిక్కటి చిరునవ్వులతో ఆనందించలేదా? విలువలు, విశ్వసనీయత అప్పుడు గుర్తుకు రాలేదా! కొంతమంది తన మంత్రులు, శాసనసభ్యులు ప్రతిపక్ష నేత చంద్రబాబు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా బహిరంగంగా వాడూ వీడూ, చెత్త నా కొడుకు అని దూషించినప్పుడు ముఖ్యమంత్రిగా మౌనంగా ఉండిపోవడం ఏ నీతి? ఏ రీతి? వ్యక్తులను దారుణంగా కించపరచడమే కాకుండా ఇళ్లలోని ఆడవాళ్లను కూడా బజారుకీడ్చారు కదా? స్ర్తీలను చెరబట్టడం మినహా మిగతా అన్ని రకాలుగా దురాగతాలకు పాల్పడ్డారు కదా? అయినా ఆ ఐదేళ్లలో హద్దుమీరిన అధికారులను, శాసనసభ్యులను, మంత్రులను జగన్‌రెడ్డి ఒక్కసారైనా మందలించడం చూశారా? లేదే? సదరు దుశ్చర్యలు ఆయనకు అమితానందాన్ని ఇచ్చాయి. జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసం ఆయనకు గిట్టని వారిపై తన మనుషులు బూతులతో విరుచుకుపడిన విషయం మరిచారా? తనకు గిట్టని మీడియా సంస్థలను శాసనసభ కార్యక్రమాలు ప్రసారం చేయకుండా నిషేధించలేదా? ముఖ్యమంత్రి నివాసం పరిసరాలకు కూడా రానివ్వలేదే? ఆంధ్రజ్యోతి పత్రికకు, ఏబీఎన్ చానల్‌కు ఐదేళ్లపాటు న్యాయంగా ఇవ్వాల్సిన ప్రకటనల్లో ఒక్కటైనా ఇవ్వకపోవడం ఏ నీతి? ఇందుకే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని అనాల్సి వస్తోంది. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులను వెంటాడి వేధించడంలో ఏ విలువలు దాగి ఉన్నాయి? ఈ వర్గం ఆ వర్గం అన్న తేడా లేకుండా జగన్ పాలనలో ఇబ్బందికి గురికాని వర్గం అంటూ లేకుండా పోవడం నిజం కాదా? అందుకే కదా ప్రజలు కూడా కులం చూడబోము, మతం చూడబోమని జగన్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు!
ఇంకా ఆత్మవంచనే...
ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలలో అధికారం కోల్పోయిన పార్టీలు ఆత్మ విమర్శ చేసుకోవడం సహజం. జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఆత్మ విమర్శకు సిద్ధపడకపోగా పరనిందకు తెగబడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ మళ్లీ ఎన్నికల నాటికి ప్రజాభిమానం చూరగొనడానికి ప్రయత్నిస్తుంది. జగన్ అండ్ కోలో ఈ ఛాయలు కూడా కనిపించడంలేదు. తప్పంతా ప్రజలదే అన్నట్టుగా ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. చెడు చేసి ఓడితే బాధపడాలి కానీ, మంచి చేసి ఓడితే బాధపడకూడదని వితండవాదం చేస్తున్నారు. నిజంగా మంచి పాలనే ఇస్తే ప్రజలెందుకు ఓడిస్తారు? ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిపిన సమావేశాల్లో జగన్‌రెడ్డి ఉపన్యాసం విన్నాక ఆయన మారతారని భావించడం భ్రమే అవుతుంది. తన పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలూ ఎందుకు ఏకమయ్యారో గుర్తించి విరుగుడు చర్యలు చేపట్టకపోగా ఆత్మవంచన చేసుకుంటూ పొద్దుపుచ్చుతున్నారు. విచిత్రమేమిటంటే జగన్ రోత మీడియాతో పాటు కూలి మీడియా కూడా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సాధించిన ఘన విజయాన్ని సాంకేతిక విజయం మాత్రమేనని, జగన్‌రెడ్డే అసలైన ప్రజా నాయకుడని, ప్రజల మద్దతు ఆయనకే ఉంటుందని ప్రచారం చేస్తూ ఆత్మవంచన చేసుకుంటున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే జగన్ ఓడిపోయారని గత పది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని ఇదే జగన్మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల తర్వాత తేల్చి చెప్పడాన్ని వారు మరచిపోయారు. ఈవీఎంల ద్వారా ప్రజల తీర్పును తారుమారు చేయలేరని అనేక సందర్భాలలో ఎన్నికల కమిషన్ రుజువు చేసింది. చంద్రబాబు విజయానికి ప్రధాని నరేంద్ర మోదీ లేదా ఎన్నికల కమిషన్ పరోక్ష సహకారం ఉందని ప్రజలను నమ్మించే విఫలయత్నం చేస్తున్నారు.
తాజా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 2019 మాదిరి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ లభించలేదు. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమయ్యే పక్షంలో చంద్రబాబు విజయానికి సహకరించిన మోదీ తన సొంత పార్టీకి మెజారిటీ సీట్లు సాధించుకోలేరా? కూలి మీడియా, రోత మీడియా ఈవీఎంలపై చేస్తున్న ప్రచారం చూస్తుంటే భర్తృహరి సుభాషితం గుర్తుకొస్తోంది. ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు. దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు’ అని భర్తృహరి చెప్పారు. ఎన్నికలకు ముందు కూడా కొంత మంది రాతగాళ్లు, కూతగాళ్లు ఇదే విధంగా జగన్‌రెడ్డిని తప్పు దారి పట్టించారు. ప్రభుత్వ పనితీరు అదరహో అని ప్రచారం చేస్తూ జగన్‌ను కూడా నమ్మించారు. ప్రజలంతా జగన్మోహన్‌రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని, 2019 కంటే ఎక్కువ శాతం ఓట్లు, సీట్లు వస్తాయని నమ్మబలికారు. సంక్షేమ పథకాల వల్ల పేదల జీవితాలు మారిపోయాయని, సామాజిక న్యాయం అద్భుతంగా జరిగిందని, దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా సాహసించని నిర్ణయాలను జగన్‌రెడ్డి తీసుకొన్నారని ఊదరగొట్టారు. పూర్వం రాజుల ఆస్థానంలో పొగడ్తల కోసం కొంత మంది ప్రత్యేకంగా ఉండేవారు. ఇప్పుడు జగన్‌రెడ్డి ఆస్థానంలో కూడా ఇలాంటి వారు చేరారు. వారి మాటలను నిజంగానే నమ్మిన జగన్‌రెడ్డి క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. భజనపరుల మాటలు నమ్మి నిండా మునిగిపోయారు. తన పాలనకు వ్యతిరేకంగా మెజారిటీ ప్రజలు కులమతాలకు అతీతంగా జట్టుకట్టిన విషయం గుర్తించలేకపోయారు. పేదలు, పెత్తందారులు అంటూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు. ప్రభువుల మనసు రంజింపజేసి లబ్ధిపొందడానికి ప్రయత్నించే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. అయితే పాలకులు ఎవరైనాగానీ తమ హితం కోరేవారు ఎవరో, సమాజ హితం కోరేవారు ఎవరో గుర్తించి వారిని మాత్రమే చేరదీస్తే ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురవదు. అధికారంలో ఉన్నప్పుడు ఉన్మాద మూకను పెంచి పోషించినందుకు తగిన మూల్యం చెల్లించుకున్న జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకొని వాస్తవిక దృక్పథంతో ఆలోచించడం నేర్చుకోవాలి. విలువలు, విశ్వసనీయత వంటి పదాలు జగన్ వొంటికి సరిపడవుగానీ, ప్రజలు నమ్మే మాటలు చెప్పడం మంచిది. తల్లినీ చెల్లిని కూడా విసిరికొట్టిన జగన్మోహన్‌రెడ్డిలో అనుబంధాలు, ఆత్మీయతలు ఉంటాయనుకోవడం భ్రమ అవుతుంది.
బటన్లు నొక్కితే చాలదు...
గతంలో తన పాలనను రాజారెడ్డి రాజ్యాంగం అన్నారని, ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని రెడ్ బుక్ రాజ్యాంగమని నిందించడం... తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టుగా ఉంది. అయినా అధికారులను, రాజకీయ ప్రత్యర్థులను ఎన్ని విధాలుగా వేధించవచ్చో చేసి చూపించిన జగన్మోహన్‌రెడ్డిని మించిన దురాగతాలను మరెవరూ చేయలేరు. ఆత్మస్తుతి, పరనింద వల్ల ప్రయోజనం లేదు. ప్రజలకు తానేమీ చెడు చేయలేదని చెప్పుకోవడం ఆత్మవంచనే అవుతుంది. ముఖ్యమంత్రి పనేమిటి? మనం చేసిందేమిటి? అన్న విషయంలో ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. బటన్లు నొక్కడం మాత్రమే ముఖ్యమంత్రి పనికాదు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి గురించి కూడా ఆలోచించాలి. అభివృద్ధి – సంక్షేమం మధ్య సమతుల్యత ఉండాలని జగన్ గుర్తించాలి. ఈవీఎంలలో ఏదో జరిగిపోయిందని చెప్పే వాదనకు తెగబడేవారు జగన్ ఏయే విషయాలలో మారాలో సూచిస్తే ఆయనకు నిజమైన శ్రేయోభిలాషులుగా మిగులుతారు. విష ప్రచారం, దుష్ప్రచారం అన్ని వేళలా పని చేయవని కూడా జగన్ అండ్ కో తెలుసుకోవాలి. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన స్వల్ప సంఘటనలను భూతద్దంలో చూపినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. నిన్నటి వరకు మీ పాలనలో జరిగిన దురాగతాలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. తనకంటే దరిద్రంగా చంద్రబాబు పాలన ఉంటే తప్ప జగన్మోహన్‌రెడ్డికి ఐదేళ్ల తర్వాత అధికారం వచ్చి ఒడిలో వాలదు.
కొత్త సర్కారుకు సవాళ్లు
చంద్రబాబు నేతృత్వంలో కొలువుదీరిన ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. జగన్ పాలనలో వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నం అయ్యాయి. అఖిల భారత సర్వీసు అధికారుల వెన్ను విరిచి బానిసలుగా మార్చుకున్నారు. రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలు భారం అదనం కాబోతోంది. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధుల పించన్‌ను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుగా ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించాలి. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండే అవకాశం ఉన్నందున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. పెట్టుబడులు వచ్చినంత మాత్రాన ఇప్పటికిప్పుడు ఆదాయం పెరగదు. ఇచ్చిన హామీల అమలు కోసం మరిన్ని అప్పులు చేయవలసి రావొచ్చు. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సొంతంగానే కావాల్సినంత మెజారిటీ లభించినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. సంకీర్ణ ప్రభుత్వం అన్నాక ఒడిదుడుకులు, అప్పుడప్పుడూ అభిప్రాయ బేధాలు ఏర్పడటం సహజం. ఎన్నికల్లో ఓడిపోయిన జగన్మోహన్‌రెడ్డికి వంచనతో కూడిన కపట రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబుకు రాజకీయాల్లో అపార అనుభవం ఉండటమే కాకుండా భూమాతకు ఉన్నంత సహనం, ఓర్పు ఉంటుంది. అయినా... తెలుగుదేశం–జనసేన పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి జగన్ అండ్ కో సహజంగానే ప్రయత్నిస్తుంది.
జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు అసాధారణ పరిణితి ప్రదర్శించారు. సీట్ల సర్దుబాటు సమయంలోనూ, మంత్రి పదవుల విషయంలోగానీ ఆయన మంకు పట్టుకు పోలేదు. జగన్‌రెడ్డి విధ్వంస పాలన నుంచి రాష్ర్టాన్ని కాపాడేందుకు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఏర్పడకుండా చెడగొట్టడానికి ఎవరెంత ప్రయత్నించినా ఖాతరు చేయలేదు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికే కాకుండా, వ్యక్తిగతంగా తనకు జరిగే నష్టాన్ని గుర్తించి అందుకు తగ్గట్టుగానే మెలిగారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయనపై ఇప్పుడు బాధ్యత పెరిగింది. తెలుగుదేశం – జనసేన మైత్రిని చెడగొట్టడానికి జరిగే ప్రయత్నాలు సఫలం కాకూడదంటే... విభేదాలు ఏర్పడితే వాటి పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. చంద్రబాబుకు అపార పాలనానుభవం ఉంది. అంతేకాదు, ప్రతిపక్షానికి 11 సీట్లు మాత్రమే వచ్చినందున ప్రభుత్వ సుస్థిరతకు ఎలాంటి ఇబ్బందీ లేదు. జగన్ పాలనలో కొంత మంది అధికారులు పూర్తిగా చెడిపోయారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అటువంటి వారి పట్ల తన సహజ ధోరణికి భిన్నంగా వ్యవహరించారు. ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసులకు కళంకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మి, పీఎస్సాఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్ కుమార్, సంజయ్ వంటి అధికారుల పట్ల కఠినంగా వ్యవహరించారు. శ్రీలక్ష్మి పుష్పగుచ్ఛం ఇచ్చే ప్రయత్నం చేయగా దాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు గత ప్రవర్తనకు ఇది పూర్తి భిన్నం. తాము ఏ పరిస్థితుల్లో, ఎవరి ఒత్తిడి వల్ల గత ప్రభుత్వానికి ఊడిగం చేయవలసి వచ్చిందో వివరించడానికి ఆయా అధికారులు సిద్ధపడుతున్నారు.
ఆర్థిక నేరాలలో నిందితుడుగా ఉన్న జగన్ వంటి వ్యక్తికి దాసోహం అవాల్సిన అవసరం ఏమిటో ఆయా అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రూల్ ఆఫ్ లా అమలు చేయాల్సిన అధికారులు ఆటవిక పాలనకు తమవంతు సహకారం అందించడమే కాకుండా, అందులో భాగస్వాములయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సంస్కరించడానికి చంద్రబాబు సహజంగానే ప్రయత్నిస్తారు. అయితే absolute power corrupts absolutely అన్నట్టు కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ పోకడలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డికి ఎన్నికల్లో ఇంత ఘోర పరాభవం ఎందుకు ఎదురైందో ముందుగా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకులు గుర్తించి అందుకు తగ్గట్టుగా మెలగాలి. అధికారం అందింది కదా అని గత ప్రభుత్వంలో మాదిరి చట్టవిరుద్ధంగా దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడితే వాతలు పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. పాలన పట్ల సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినప్పుడే అది గుడ్ గవర్నెన్స్ అవుతుంది. అంతే కానీ అధికారాలు లేని పదవులు ఆయా వర్గాలకు కేటాయించి సామాజిక సమతుల్యత పాటించామని గొప్పలు చెప్పుకొంటే జగన్‌కు ఏమి జరిగిందో చూశారుగా! ఈ ప్రభుత్వం మాది అని అన్ని వర్గాల ప్రజలూ భావించాలి. 2019లో తాము ఎందుకు ఓడిపోయిందీ, 2024 ఎన్నికల్లో జగన్ ఎందుకు ఓడిపోయిందీ లోతుగా విశ్లేషించుకొని అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించుకొని తదనుగుణంగా చంద్రబాబు పాలన సాగాలి. ప్రజలు గంపెడాశతో తమను అందలం ఎక్కించారని చంద్రబాబు అండ్ కో గుర్తించాలి. ఎన్నికల్లో జగన్‌కు ఎదురైన పరాభవం ఒక హెచ్చరికగా చంద్రబాబు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అధికార కూటమి నాయకులు ప్రతిరోజూ పొద్దున్నే లేవగానే జగన్ ఎలా, ఎందుకు ఓడిపోయారో గుర్తుకు తెచ్చుకోవాలి. రాజ్యసభలో మాకు బలం ఉందని జగన్ అండ్ కో గొప్పలు చెప్పుకొంటున్నారుగానీ తలపై బండెడు కేసుల భారం మోస్తున్న జగన్మోహన్‌రెడ్డి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ధిక్కరించే సాహసం చేయడం అసంభవం. అన్నింటినీ మించిన జోక్ ఏమిటంటే... ఐదేళ్లుగా విభజన హామీలు, ప్రత్యేక హోదా గురించి మాట మాత్రంగానైనా కేంద్రం వద్ద ప్రస్తావించని జగన్‌రెడ్డి ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా కోరకపోవడం మహా పాపం అని నిందిస్తున్నారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లయ్యాక ఇప్పుడు ప్రత్యేక హోదా, విభజన హామీలకు ప్రాధాన్యత ఉంటుందా? రాజకీయం కోసం జగన్ అండ్ కో చేసే విమర్శలను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకుండా ముందుకు సాగి ప్రజలను సంతృప్తిపరచే విధంగా పాలిస్తారని ఆశిద్దాం!
ఆర్కే
Updated Date - Jun 16 , 2024 | 09:25 AM