ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RK Kothapaluku : నవ్విపోదురుగాక..

ABN, Publish Date - Jul 07 , 2024 | 12:25 AM

‘‘వాడిని అలా వదిలేయకండిరా! ఎవరికైనా చూపించండిరా!’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రంలో రావు రమేశ్‌ కేరెక్టర్‌కు ఒక డైలాగ్‌ ఉంటుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనలు విన్న వారికీ, చదివిన వారికీ ఈ డైలాగ్‌ గుర్తుకు వస్తే తప్పు పట్టాల్సిందేమీ లేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తాను ఓడిపోవడం వల్ల దేశ రైతాంగానికి నష్టం వాటిల్లిందని, కేంద్రంలో తన నాయకత్వంలో ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ ఏర్పాటు చేద్దామనుకున్నానని కేసీఆర్‌ చెప్పుకొన్నారు.

‘‘వాడిని అలా వదిలేయకండిరా! ఎవరికైనా చూపించండిరా!’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రంలో రావు రమేశ్‌ కేరెక్టర్‌కు ఒక డైలాగ్‌ ఉంటుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనలు విన్న వారికీ, చదివిన వారికీ ఈ డైలాగ్‌ గుర్తుకు వస్తే తప్పు పట్టాల్సిందేమీ లేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తాను ఓడిపోవడం వల్ల దేశ రైతాంగానికి నష్టం వాటిల్లిందని, కేంద్రంలో తన నాయకత్వంలో ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ ఏర్పాటు చేద్దామనుకున్నానని కేసీఆర్‌ చెప్పుకొన్నారు. ‘నా ఓటమి దేశానికే నష్టం’ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో తాను ఓడిపోయినందుకు మహారాష్ట్రలో రైతులు బాధపడ్డారని అక్కడి నాయకులు తనతో అన్నారని కూడా ఆయన సెలవిచ్చారు. ఈ మాటలు విన్నవారికి కేసీఆర్‌ మానసిక స్థితిపై సహజంగానే అనుమానం వస్తుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కేసీఆర్‌ ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించి ఏకంగా భారత ప్రధాని అయిపోదామని ఆకాశానికి నిచ్చెనలు వేశారు. ఉట్టి కొట్టడానికి ఎగరలేనివాడు స్వర్గానికి ఎగురుతానని అన్నట్టుగా ఆయన మాటల ధోరణి ఉంది. తెలంగాణలో తనను తిరస్కరించబోతున్నారన్న వాస్తవాన్ని గుర్తించకుండా జాతీయ పార్టీ అంటూ హడావిడి చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న కేసీఆర్‌ ఆ దిశగా గట్టి ప్రయత్నం కూడా చేయలేదు. శాసనసభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రతోపాటు ఒకటి రెండు పొరుగు రాష్ర్టాలకు చెందిన క్షేత్రస్థాయిలో బలం లేని నేతలు కొందర్ని పిలిపించుకొని హడావిడి చేశారు. ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అన్న నినాదాన్ని అందుకున్న కేసీఆర్‌, మహారాష్ట్ర తప్ప మరే రాష్ట్రంలోనూ పర్యటించలేదు. ఢిల్లీలో జాతీయ పార్టీ కార్యాలయ భవన్‌ నిర్మిస్తున్నట్టుగా మందీమార్బలంతో వెళ్లి హడావిడి చేశారు. ఇప్పుడు లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. స్వయం ప్రకటిత జాతీయ నాయకులకు ఉత్తరాది రాజకీయాలలో చోటు ఉండదు. ఈ విషయాన్ని తెలుసుకోకుండా తనకు తాను జాతీయ నాయకుడినని ఆయన ప్రచారం చేసుకున్నారు.

నాడు ఎన్టీఆర్‌ అలా...

1989కి ముందు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు నేషనల్‌ ఫ్రంట్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. అప్పట్లో ప్రతిపక్షాలకు చెందిన హేమాహేమీ నాయకులైన దేవీలాల్‌, బిజూ పట్నాయక్‌, చంద్రశేఖర్‌వంటి వారు కూడా ఎన్టీఆర్‌తో కలసి నడిచారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వంతో విభేదించి బయటకు వచ్చిన విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ నేషనల్‌ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా వ్యవహరించారు. 1989 ఎన్నికల్లో కేంద్రంలో వీపీ సింగ్‌ ప్రధానమంత్రిగా నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడింది. అనూహ్యంగా రాష్ట్రంలో ఎన్టీఆర్‌ అధికారం కోల్పోయారు. దీంతో జాతీయ స్థాయిలో ఎన్టీఆర్‌ను పట్టించుకున్నవారే లేకపోయారు. ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ఎదిగిన నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పరచిన ప్రభుత్వంలో ఆయనకు చోటు లభించలేదు. ఎన్టీఆర్‌ను ఉప ప్రధానిగా నియమించాలని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించగా నాటి ప్రధాని వీపీ సింగ్‌ ఖాతరు చేయలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఉప ప్రధానిని చేయడం కుదరదని తేల్చి చెప్పారు. రాజకీయాలు అంటేనే నంబర్‌ గేమ్‌. సంఖ్యా బలం ఆధారంగానే కేంద్రంలో అధికారంలో వాటా లభిస్తుంది. ప్రతిపక్షంలో కూర్చున్నా సంఖ్యా బలం లేకపోతే గౌరవం లభించదు. ఎన్టీఆర్‌కు ఎదురైన ఈ చేదు అనుభవం కేసీఆర్‌కు తెలియంది కాదు. అప్పుడు కేసీఆర్‌ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. జాతీయ రాజకీయాలలో దక్షిణాది వారి ఆధిపత్యాన్ని ఉత్తరాది వారు అంగీకరించరు. కారణం... ఉత్తర భారతానికి అధిక సీట్లు ఉంటాయి. తెలుగు వాడైన పీవీ నరసింహారావు ఐదేళ్లపాటు ప్రధానిగా కొనసాగగలిగారంటే, అందుకు కారణం ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు కావడమే అన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ నేల విడిచి సాము చేస్తున్నారని అప్పట్లోనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల్లో ఓడిపోయి ఏడు మాసాలు దాటుతున్నా తన ఓటమికి కారణాలేమిటో గుర్తించడానికి కేసీఆర్‌ ఇష్టపడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. పైగా ఈ దేశ రైతాంగమంతా తన నాయకత్వం లభించనందుకు బాధపడుతున్నట్టుగా బిల్డప్‌ ఇచ్చుకొనే ప్రయత్నం చేయడం హాస్యాస్పదంగా ఉంది. మిగతా రాష్ర్టాల రైతుల విషయం తర్వాత చూద్దాం! శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రైతులు కూడా కేసీఆర్‌ పార్టీని బండకేసి బాదారు. జిల్లాలకు జిల్లాలు తుడిచిపెట్టుకుపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఒకప్పుడు తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా చెలామణి అయిన తనను ప్రజలు ఇంతలా ఎందుకు తిరస్కరించారన్నది తెలుసుకొనే ప్రయత్నం చేయకపోగా దేశ ప్రజలు తన నాయకత్వం కోసం అల్లాడిపోతున్నారని గొప్పలకు పోవడం వల్ల ఆయనే నవ్వులపాలవుతున్నారు.


ప్రజలు పంపిన సంకేతాలు...

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల నాటి నుంచే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు తమలోని అసంతృప్తి తెలియజేస్తూనే ఉన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయినా పట్టించుకోకపోగా జాతీయ పార్టీ అంటూ ప్రగల్బాలకు పోవడంతో 2023 నాటికి అంతకు ముందున్న అసంతృప్తి ప్రజాగ్రహంగా మారి పరాభవం చవిచూడాల్సి వచ్చింది. కాలం కలసి రాకపోతే ఆలోచనలు కూడా పెడమార్గం పడతాయి కాబోలు. రాష్ట్రంలో తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలియక బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రస్తుతం అల్లాడిపోతున్నాయి. వారిలో ఆత్మవిశ్వాసం ప్రోదిచేసే ప్రయత్నం చేయకుండా ఎర్రవల్లిలోని తన ఫాం హౌజ్‌కు రోజూ కొందరిని పిలిపించుకొని ‘నేను ఓడిపోయానని దేశమంతా బాధపడుతోంది’ అని చెప్పుకోవడం కేసీఆర్‌కే చెల్లుతుంది. ఈ స్పీడ్‌ యుగంలో ఎవరికోసం ఎవరూ ఏడవరు. ఇంట్లో వాళ్లు పోతేనే నాలుగు రోజులు గడిచాక పనుల్లో పడి మరచిపోతున్నారు. అపర చాణక్యుడినని చెప్పుకొనే కేసీఆర్‌కు ఇవన్నీ తెలియవా? అడ్డం, పొడవు మాటలు చెప్పడం కేసీఆర్‌కు అలవాటే! అందుకే ఆయన మాటలను విశ్వసించని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు తనను వదిలిపోకుండా ఉండేందుకు కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక కీలక నేత సహాయాన్ని అర్థించారు. ఆ కీలక నేత రంగంలోకి దిగి... బీఆర్‌ఎస్‌ను వదిలిపోతారని ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ‘మీరు పార్టీ మారాలనుకుంటే భారతీయ జనతా పార్టీలో చేరండి. లేదంటే బీఆర్‌ఎస్‌లోనే ఉండండి. కాదూ కూడదని కాంగ్రెస్‌ పార్టీలో చేరితే తర్వాత పరిణామాలకు సిద్ధంగా ఉండండి’ అని హెచ్చరించినట్టుగా తెలిసింది. బీజేపీతో రాజకీయంగా చేతులు కలపడానికి కేసీఆర్‌ ఇదివరకే సిద్ధపడిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ తరఫున బీజేపీకి చెందిన కీలక నేత రంగప్రవేశం చేసి ఫిరాయింపులను నిరోధించే పనిలో పడ్డారు. అయినా సదరు ప్రయత్నాలు ఫలిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద తమపై అనర్హత వేటు పడకుండా ఏం చేయాలన్న దానిపై ప్రస్తుతం వారు తర్జనభర్జన పడుతున్నారు. ఈ విషయంలో స్పష్టత వచ్చాక భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పాదుకొల్పాల్సిన కేసీఆర్‌ గొప్పలకు పోవడం వింతగా ఉంది. ఫాంహౌజ్‌ నుంచి అడుగు బయటపెట్టకుండా... రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు అప్పుడే విసిగిపోయారని చెప్పుకొంటూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. తాను కోల్పోయిన తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనే ప్రయత్నం చేయకుండా, దేశంలోని రైతులందరూ తన నాయకత్వం లభించలేదని ఆవేదన చెందుతున్నారని చెప్పుకోవడం ఎండమావుల వెంట పరుగెత్తడమే అవుతుంది.


అంతకుమించి... జగన్‌

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విషయానికి వద్దాం! ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నానని వైరాగ్యం ప్రదర్శించిన జగన్‌రెడ్డి ఈ మధ్య కొంత తేరుకొని ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు అడుగు బయట పెట్టారు. 2004కు ముందు వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూడా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న గౌరు వెంకటరెడ్డిని పరామర్శించేందుకు కర్నూలు జైలుకు వెళ్లారు. ఇప్పుడు తండ్రి బాటలో జగన్మోహన్‌రెడ్డి పిన్నెల్లిని జైల్లో పరామర్శించారు. పరామర్శల తర్వాత జైలు బయట ఆయన విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలోని రావు రమేశ్‌ డైలాగ్‌ను గుర్తుకు తెస్తున్నాయి. ప్రజలు తనను ఎందుకు గెలిపించారో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించుకోవాలని జగన్‌రెడ్డి సెలవిచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత వల్ల తాను ఓడిపోలేదని, మంచి చేసి కూడా ఓడిపోయానన్న వింత లాజిక్‌ను కూడా తెర మీదకు తెచ్చారు. ఎన్నికల్లో గెలిచినవారు ఎందుకు గెలిచామని ఆలోచించడం ఎక్కడైనా చూశామా? ఓడిపోయినవారు కదా ప్రజలు తమను ఎందుకు ఓడించారో సమీక్ష చేసుకుంటారు! ప్రజల్లో వ్యతిరేకత వల్ల తాను ఓడిపోలేదని చెప్పుకోవడం ఆయన మానసిక స్థితికి అద్దంపడుతోంది. ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే ఎవరైనా ఎందుకు ఓడిపోతారు? కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు బటన్లు నొక్కడమే ప్రజలకు చేసిన, చేయాల్సిన మంచి అని జగన్‌ నమ్మినట్టున్నారు. అందుకే మంచి చేసి మరీ ఓడిపోయామని ఆయన చెప్పుకొంటున్నారు. వైసీపీలో రాజకీయ అవగాహన ఉన్నవారు ఎవరైనా మిగిలి ఉంటే జగన్మోహన్‌రెడ్డికి జ్ఞానోదయం కలిగించే ప్రయత్నాలు అర్జంటుగా చేయాలి. తన పాలన ఎలా సాగిందో, 61 శాతం ప్రజలు తనను వద్దని ఎందుకు అనుకున్నారో కూడా తెలుసుకొనే ప్రయత్నం చేయకపోతే వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? జగన్‌రెడ్డి ఈ అసంబద్ధ వాదన చేస్తున్నప్పుడు ఆయన పక్కన అంబటి రాంబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాత్రమే ఉన్నారు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడు కనుకే నాలుగు పర్యాయాలు ఎన్నికల్లో గెలిచారని కూడా జగన్‌ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా ఓట్లు పడనివ్వడంలేదనే కోపంతో ఈవీఎం పగలగొట్టారని జగన్‌ చెప్పేయడంతో ఈ కేసులో పిన్నెల్లి మరింతగా ఇరుక్కుపోయారు. ఓట్లు పడకపోతే ఈవీఎంలను పగలగొట్టేయవచ్చునన్న ధోరణిలో జగన్‌ మాటలు ఉన్నాయి. రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని, వాటిని ఆపాల్సిందిగా తాను కోరడం లేదని, తనకూ టైం వస్తుందని హెచ్చరిస్తున్నానని జగన్‌ ప్రకటించారు. గత ఐదేళ్లలో రూల్‌ ఆఫ్‌ లా లేకుండా పాలించిన జగన్మోహన్‌రెడ్డి దాడులు, దౌర్జన్యాలు అనడం వింతగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ, జగన్‌ రోత పత్రికలో మాత్రం రోజూ ఏడుపులూ పెడబొబ్బలే కనిపిస్తున్నాయి. తల్లికి వందనం, ఆడపడుచులకు ఆర్థిక చేయూత వంటి పథకాల జాడ ఏదని ఆక్రోశిస్తున్నారు. మరో అడుగు ముందుకెళ్లి ‘మీ రాష్ర్టానికి రాలేం బాబోయ్‌’ అని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు అప్పుడే ప్రకటించాయంటూ మరో దిక్కుమాలిన వార్త వండి వార్చారు. ఇలాంటి వార్తే జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పత్రికలలో వచ్చి ఉంటే నీలి మీడియా, కూలి మీడియాతో పాటు పేటీఎం బ్యాచ్‌ రెచ్చిపోయి ఉండేది.

మంచీ... చెడూ..

ఎన్నికల ప్రచారం సందర్భంగా మంచివాళ్లు అని జగన్‌ పరిచయం చేసిన అభ్యర్థులందరూ ఓడిపోయారు. పిన్నెల్లి కూడా మంచివాడైతే ఐదో పర్యాయం కూడా గెలిచి ఉండాలి కదా? ఇంతకూ జగన్‌ డిక్షనరీలో మంచివాడు అన్న మాటకు నిర్వచనం ఏమిటి? ఆయన నిర్వచనాన్ని ప్రజలు అర్థం చేసుకున్నట్టు లేరు. అందుకే ఆ ‘మంచి’ వాళ్లను తుక్కు తుక్కుగా ఓడించారు. ప్రజలకు మంచి చేశానని జగన్‌ చెబుతున్న మాటలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ప్రజల దృష్టిలో మంచి వేరు – జగన్‌ దృష్టిలో మంచి వేరు. అందుకే ఆయన చెప్పుకొనే మంచి ప్రజలకు రుచించలేదు. ప్రజలు తనను ఎందుకు ఓడించారో గుర్తించడానికి నిరాకరించడం వల్ల జగన్‌కే నష్టం. ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే ఎవరైనా ఎందుకు ఓడిపోతారు? కేవలం పది శాతం ఓట్లు అటు వెళ్లడం వల్ల ఓడిపోయామని చెప్పుకోవడం ఆత్మవంచన కాక మరేమిటి? 2019 ఎన్నికల్లో జగన్‌కు 151 సీట్లు రావడానికి కూడా ఆ పది శాతం ఓట్లు అధికంగా రావడమే కారణం కదా? ఈ ఎన్నికల్లో ఆ వ్యత్యాసం 16 శాతానికి పెరిగింది. అందుకే ఆయనకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి. నిజమైన మంచి అంటే ఏమిటో గుర్తించడానికి అంగీకరించనంత కాలం వైసీపీకి భవిష్యత్తు ఉండదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారుల వద్ద జగన్మోహన్‌రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ఒకరోజు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారి ధనుంజయరెడ్డి ‘రేపు ఉన్నత విద్యపై సమీక్ష పెట్టుకుందామా?’ అని కొంత మంది అధికారులు ఉన్నప్పుడు జగన్‌రెడ్డిని ఉద్దేశించి అడిగారు. ‘ఏమిటీ? ఉన్నత విద్యపై సమీక్షా? ఆ సమీక్ష చేస్తే ఓట్లు వస్తాయా?’ అని జగన్‌ ప్రశ్నించగా... ‘రావు’ అని ధనుంజయ రెడ్డి నసిగారు. వెంటనే జగన్‌ ‘పోనీ నోట్లు (అంటే డబ్బులు) వస్తాయా?’ అని ప్రశ్నించారు. దీంతో అవాక్కవడం అధికారుల వంతయింది. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేయడం వల్లనే ఈ ఎన్నికల్లో జగన్‌రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోయారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా!


కూటమిపై అందరి కళ్లు...

ఈ విషయం అలా ఉంచితే, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తోంది. అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయి. అదే సమయంలో అధికార పక్షం పోకడలపై కూడా ప్రజలు కన్నేసి ఉంచారు. కొద్ది రోజుల క్రితం జరిగిన రెండు సంఘటనలు కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవిగా ఉన్నాయి. రాయచోటిలో మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి భార్య ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించడం మొదటిది కాగా, తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దగ్గరుండి మరీ ఒక భవనాన్ని కూల్చివేయించడం రెండవది. ఈ రెండు సంఘటనలు అధికార దుర్వినియోగానికి సంబంధించినవే. మంత్రి భార్య అయినంత మాత్రాన వారికి ప్రత్యేక సౌకర్యాలు, ప్రొటోకాల్‌ ఉండవు. అయినా మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి భార్య అధికార దర్పం ప్రదర్శించే ప్రయత్నం చేసి విమర్శలపాలయ్యారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి మంత్రిని మందలించారు. ఇక కొలికపూడి శ్రీనివాసరావు విషయానికి వస్తే, నిబంధనలకు విరుద్ధంగా ఎవరో భవనాన్ని నిర్మించారని చెప్పి ఆయన స్వయంగా దగ్గరుండి, అధికారులు వారించినా వినకుండా సదరు భవనాన్ని పడగొట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమయ్యే భవనాలపై చర్యలు తీసుకోవాల్సింది అధికారులు మాత్రమే. మహా అయితే ఎమ్మెల్యే ఫిర్యాదు చేయవచ్చు. అంతేగానీ దగ్గరుండి మరీ కూలగొట్టించే అధికారం ఎమ్మెల్యేలకు ఉండదు. ఈ సంఘటనపై కూడా ముఖ్యంత్రి చంద్రబాబు స్పందించి శ్రీనివాసరావును పిలిపించుకొని మందలించారు. అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్రత్తగా మసలుకోవాలి. లేని పక్షంలో అట్టు తిరగేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. జగన్మోహన్‌రెడ్డి హయాంలో రూల్‌ ఆఫ్‌ లా అమల్లో లేకుండా పోయిందని, అరాచకం ప్రబలిందని, నాయకులు అహంకారపూరితంగా వ్యవహరించారని నమ్మడం వల్లనే ప్రజలు ఎన్నికల్లో కూటమికి బ్రహ్మరథం పట్టారు. ఈ కారణంగా నాటి దుశ్చర్యలను ప్రజలు గుర్తుకు తెచ్చుకొనే పనులేవీ కూటమి నేతలు చేయకూడదు. అలా చేయడం వల్ల జగన్మోహన్‌రెడ్డికి రాజకీయంగా జీవం పోసినవారు అవుతారు. పిన్నెల్లి వంటి వారిని జైలులో పరామర్శించడం వల్ల జగన్‌కు రాజకీయంగా మైలేజీ రాదుగానీ, వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, దౌర్జన్యాలు జరిపితే మాత్రం ఆయనకు అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. పాలన ఎలా ఉండకూడదో జగన్‌రెడ్డి అందరికీ తెలియజేశారు కనుక కూటమి నేతలు అధికార దర్పానికి, అధికార దుర్వినియోగానికి దూరంగా ఉండాలి. లేని పక్షంలో వారికే నష్టం!

బీఆర్‌ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పాదుకొల్పాల్సిన కేసీఆర్‌ గొప్పలకు పోవడం వింతగా ఉంది. ఫాంహౌజ్‌ నుంచి అడుగు బయట పెట్టకుండా... రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు అప్పుడే విసిగిపోయారని చెప్పుకొంటూ ఆత్మవంచన చేసుకుంటున్నారు.


1989కి ముందు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు నేషనల్‌ ఫ్రంట్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. అప్పట్లో ప్రతిపక్షాలకు చెందిన హేమాహేమీ నాయకులైన దేవీలాల్‌, బిజూ పట్నాయక్‌, చంద్రశేఖర్‌వంటి వారు కూడా ఎన్టీఆర్‌తో కలసి నడిచారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వంతో విభేదించి బయటకు వచ్చిన విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ నేషనల్‌ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా వ్యవహరించారు. 1989 ఎన్నికల్లో కేంద్రంలో వీపీ సింగ్‌ ప్రధానమంత్రిగా నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడింది. అనూహ్యంగా రాష్ట్రంలో ఎన్టీఆర్‌ అధికారం కోల్పోయారు. దీంతో జాతీయ స్థాయిలో ఎన్టీఆర్‌ను పట్టించుకున్నవారే లేకపోయారు. ఎన్టీఆర్‌ను ఉప ప్రధానిగా నియమించా లని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించగా నాటి ప్రధాని వీపీ సింగ్‌ ఖాతరు చేయలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఉప ప్రధానిని చేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్‌కు ఎదురైన ఈ చేదు అనుభవం కేసీఆర్‌కు తెలియంది కాదు. జాతీయ రాజకీయా లలో దక్షిణాది వారి ఆధిపత్యాన్ని ఉత్తరాదివారు అంగీకరించరు.

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కేసీఆర్‌ ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించి ఏకంగా భారత ప్రధాని అయిపోదామని ఆకాశానికి నిచ్చెనలు వేశారు. ఉట్టి కొట్టడానికి ఎగరలేనివాడు స్వర్గానికి ఎగురుతానని అన్నట్టుగా ఆయన మాటల ధోరణి ఉంది. ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అన్న నినాదాన్ని అందుకున్న కేసీఆర్‌, మహారాష్ట్ర తప్ప మరే రాష్ట్రంలోనూ పర్యటించలేదు. ఢిల్లీలో జాతీయ పార్టీ కార్యాలయ భవన్‌ నిర్మిస్తున్నట్టుగా మందీమార్బలంతో వెళ్లి హడావిడి చేశారు. ఇప్పుడు లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. పైగా ఈ దేశ రైతాంగమంతా తన నాయకత్వం లభించనందుకు బాధపడుతున్నట్టుగా బిల్డప్‌ ఇచ్చుకొనే ప్రయత్నం చేయడం హాస్యాస్పదంగా ఉంది. మిగతా రాష్ర్టాల రైతుల విషయం తర్వాత చూద్దాం! శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రైతులు కూడా కేసీఆర్‌ పార్టీని బండకేసి బాదారు. జిల్లాలకు జిల్లాలు తుడిచిపెట్టుకుపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయారు. ఒకప్పుడు తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా చెలామణి అయిన తనను ప్రజలు ఇంతలా ఎందుకు తిరస్కరించారన్నది తెలుసుకొనే ప్రయత్నం చేయకపోగా దేశ ప్రజలు తన నాయకత్వం కోసం అల్లాడిపోతున్నారని గొప్పలకు పోవడం వల్ల ఆయనే నవ్వులపాలవుతున్నారు.

ప్రజల్లో వ్యతిరేకత వల్ల తాను ఓడిపోలేదని చెప్పుకోవడం జగన్‌ మానసిక స్థితికి అద్దంపడుతోంది. ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే ఎవరైనా ఎందుకు ఓడిపోతారు? కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు బటన్లు నొక్కడమే ప్రజలకు చేసిన, చేయాల్సిన మంచి అని జగన్‌ నమ్మినట్టున్నారు. అందుకే మంచి చేసి మరీ ఓడిపోయామని ఆయన చెప్పుకొంటున్నారు. వైసీపీలో రాజకీయ అవగాహన ఉన్నవారు ఎవరైనా మిగిలి ఉంటే జగన్మోహన్‌రెడ్డికి జ్ఞానోదయం కలిగించే ప్రయత్నాలు అర్జంటుగా చేయాలి. తన పాలన ఎలా సాగిందో, 61 శాతం ప్రజలు తనను వద్దని ఎందుకు అనుకున్నారో కూడా తెలుసుకొనే ప్రయత్నం చేయకపోతే వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా?

యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం

QR Code scanచేయండి

Updated Date - Jul 07 , 2024 | 09:20 AM

Advertising
Advertising
<