తారలు.. దిగివచ్చిన వేళ!
ABN, Publish Date - Dec 29 , 2024 | 12:23 AM
చిత్ర పరిశ్రమ ప్రముఖులను ఏ ముఖ్యమంత్రి ఎక్కువగా భయపెట్టారు? జగన్మోహన్‌రెడ్డి – రేవంత్‌రెడ్డిలలో ఎవరు మంచివాళ్లు? ఎవరు కాదు?... సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ చర్చ రచ్చ చేస్తోంది. రేవంత్‌రెడ్డితో పోల్చితే జగన్‌రెడ్డి ఎంత మంచివాడో తెలుసా?...
చిత్ర పరిశ్రమ ప్రముఖులను ఏ ముఖ్యమంత్రి ఎక్కువగా భయపెట్టారు? జగన్మోహన్‌రెడ్డి – రేవంత్‌రెడ్డిలలో ఎవరు మంచివాళ్లు? ఎవరు కాదు?... సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ చర్చ రచ్చ చేస్తోంది. రేవంత్‌రెడ్డితో పోల్చితే జగన్‌రెడ్డి ఎంత మంచివాడో తెలుసా? అని జగన్ అభిమానులు ప్రచారం చేసుకోగా, శాసనసభలో మా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో వాస్తవం లేదంటారా? సినిమా వాళ్లకు ఎందుకంత బలుపు? అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, తెలంగాణ వాదులమని చెప్పుకొనేవాళ్లు విరుచుకుపడ్డారు. దీంతో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటన పక్కకు పోయి, ఆంధ్రా– తెలంగాణ వివాదం తెరమీదకు వచ్చింది. గోటితో పోయే వివాదం గొడ్డలి దాకా వచ్చింది. ఫలితంగా చిత్ర పరిశ్రమ ప్రముఖులు వణికిపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు చిత్ర పరిశ్రమపై కోపం వచ్చింది. సినిమాల ప్రదర్శనపై ఆంక్షలు విధించడం ద్వారా బడా బడా స్టార్లు తన వద్దకు దేకుతూ వచ్చి సాగిలపడేలా చేసుకున్నారు. ఇప్పుడు పుష్ప–2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన సంఘటనతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా చిత్ర పరిశ్రమను గడగడలాడించారు. అయితే, జగన్‌రెడ్డిలాగా రేవంత్‌రెడ్డి మొరటుగా వ్యవహరించకుండా, సంధ్యా థియేటర్ ఘటనను చట్టపరంగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తన చర్యలు, ప్రకటనల ద్వారా చిత్ర పరిశ్రమను దారిలోకి తెచ్చుకోవడంతోపాటు తెలంగాణ ప్రజల దృష్టిలో తానే నిజమైన స్టార్ అని రుజువు చేసుకున్నారు. అల్లు అర్జున్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్యలను దాదాపు 70 శాతం మంది ప్రజలు సమర్థిస్తున్నట్టు సమాచారం. టీ కప్పులో తుఫాను వంటి ఒక సమస్య ఇంత రచ్చకు దారి తీయడం వెనుక కారణం ఏమిటి? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అంత కోపం ఎందుకు వచ్చింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం!
వరుస పొరపాట్లు...
సంధ్యా థియేటర్ సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన వెంటనే పుష్ప–2 సినిమాలో లీడ్ రోల్‌లో నటించిన అల్లు అర్జున్ బేషరతుగా క్షమాపణలు చెప్పి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. అంతకు ముందు, ఆ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును అల్లు అర్జున్ మరచిపోయారు. ఈ పొరపాటుకు విచారం వ్యక్తం చేయాలని ముఖ్యమంత్రి సన్నిహితులు కొందరు అల్లు అర్జున్‌కు సూచించగా, రాజకీయాలతో తనకు సంబంధం లేదంటూ ఆయన ఆ సూచనను పెడచెవిన పెట్టారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు కోపం వచ్చింది. అంతే, రేవతి మృతి సంఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఒక రాత్రి అతను జైల్లో ఉండాల్సి వచ్చింది. హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందినప్పటికీ పోలీసుల విచారణపై స్టే లేనందున అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు రప్పించి గంటలపాటు విచారించారు. అదే సమయంలో ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచడానికి అనుమతి ఇవ్వబోమని, బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ ఇవ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభ సాక్షిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి సన్నిహితులు సూచించిన విధంగా అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి ఉంటే వ్యవహారం ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఫలితంగా కడవడంత గుమ్మడి కాయ కత్తిపీటకు లోకువ అన్నట్టుగా ఎంత పెద్ద స్టార్ అయినా పొలిటికల్ స్టార్ ముందు తల వంచాల్సిందేనని రేవంత్‌రెడ్డి రుజువు చేశారు. కారణమేమైనా, గోటితో పోవాల్సిన దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, సినిమా టికెట్ ధరలను పెంచుకోనివ్వమని ముఖ్యమంత్రి ప్రకటించడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వణికిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శాంతింపజేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఇంతకూ బెనిఫిట్ షోలు, పెద్ద సినిమాల విడుదల సందర్భంగా టికెట్ల ధరలు పెంచుకోవడం అనే సంస్కృతి ఎందుకొచ్చింది? దాన్ని ఎవరు తీసుకొచ్చారు? గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బాధితుల సహాయార్థం బెనిఫిట్ షోలను ప్రదర్శించేవారు. ఇప్పుడు సినిమాలపై పెట్టిన పెట్టుబడిని త్వరితగతిన రాబట్టుకోవడానికి ప్రత్యేక షోలు వేస్తున్నారు.
చిన్నా–పెద్దా ‘చిత్రాలు’
చిత్ర పరిశ్రమలో ఇటీవలి కాలంలో అనేక పెడ ధోరణులు ప్రవేశించాయి. సినిమా నిర్మాణ వ్యయం అదుపు తప్పింది. పాన్ ఇండియా సంస్కృతి వచ్చింది. ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించే వారిని పాన్ ఇండియా స్టార్లుగా ప్రచారం చేయడం మొదలైంది. ఒక సినిమా పూర్తి కావడానికి వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. దీంతో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే విభజన జరిగింది. భారీగా ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ మాయాజాలంతో నటన, కథతో సంబంధం లేని సినిమాలను పెద్ద సినిమాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. సృజనాత్మకత స్థానంలో గ్రాఫిక్స్ చేరాయి. మలయాళ చిత్ర పరిశ్రమనే తీసుకుందాం! అక్కడ తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన కథలను తెరకెక్కిస్తున్నారు. ఊరూ పేరూ తెలియని నటులతో సినిమాలు తీసి ప్రేక్షకాదరణ పొందుతున్నారు. భాష తెలియకపోయినా తెలుగు వాళ్లు కూడా మలయాళ సినిమాలను చూసి ఆనందిస్తున్నారు. తెలుగులో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప వంటి సినిమాలతో అతి భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. ఈ సినిమాలకు ఇతర భాషలలో కూడా ఆదరణ లభించడంతో తెలుగు సినిమా ఖ్యాతి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరిందని గొప్పలు చెప్పుకున్నారు. ఉదాహరణకు పుష్ప–2 సినిమాకు రూ.1350 కోట్లు ఖర్చు చేశారని ప్రచారం జరిగింది. ఇందులో సింహభాగం ఆ సినిమాలో లీడ్ రోల్ పోషించిన అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ పారితోషికంగా తీసుకున్నారు. అల్లు అర్జున్‌కు 350 కోట్లు, సుకుమార్‌కు 150 కోట్లు చెల్లించినట్టు వార్తలు వచ్చాయి. మన దేశంలో ఇప్పటివరకు అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా అల్లు అర్జున్ రికార్డులకు ఎక్కారు. నటులకు, దర్శకులకు వందల కోట్ల పారితోషికం చెల్లించడం తెలుగు చిత్ర పరిశ్రమలోనే జరుగుతోంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రజలలో సానుకూల అభిప్రాయం స్థానే నెగెటివ్ భావన ఏర్పడింది. ఇంత భారీ బడ్జెట్ సినిమాలు అవసరమా? అనే చర్చ మొదలైంది. ఒక సినిమా నిర్మాణానికి రెండు మూడేళ్ల సమయం కూడా తీసుకుంటున్నారు. ఫలానా హీరోకు అన్ని వందల కోట్లు, ఇన్ని వందల కోట్లు చెల్లించారన్న వార్తలు వస్తుండటంతో ప్రజల్లో సహజంగానే తెలియని అసూయ ఏర్పడుతోంది. వెరసి చిత్ర పరిశ్రమ పట్ల ఇప్పుడు ఎవరికీ సానుభూతి లేకుండా పోయింది. భారీ బడ్జెట్ సినిమాల పేరిట ప్రేక్షకులను దోచుకుంటున్నారన్న అభిప్రాయం క్రమంగా ప్రజల్లో ఏర్పడింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా పెట్టుబడులతో పోల్చితే లాభాలు అందుకు తగినట్టుగా ఉండని సందర్భాలే అధికంగా ఉంటున్నాయి. బాహుబలి సినిమా నిర్మాతలకు, కొనుగోలుదారులకు అసలు లాభాలు వచ్చాయో లేదో తెలియని పరిస్థితి. భారీ బడ్జెట్‌తో తీస్తున్న తెలుగు సినిమాలతో పోల్చితే స్వల్ప బడ్జెట్‌తో మలయాళంలో నిర్మిస్తున్న చిత్రాలకే అనేక రెట్ల లాభాలు వస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. సందేశాత్మక చిత్రాలు అనేవి తెలుగులో దాదాపు కనుమరుగయ్యాయి. కథా బలంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న మలయాళ చిత్రాలను తెలుగువాళ్లు కూడా ఆదరిస్తున్నప్పుడు మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేద్దామన్న ఆలోచన మనవాళ్లకు రావడం లేదు. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్ర ఎర్ర చందనం స్మగ్లర్‌ది. స్మగ్లర్‌ను కథానాయకుడిగా చూపించడం ఏమిటి? అని ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు ప్రశ్నించగా, పోలీసు అధికారిని దుస్తులు విప్పించి నగ్నంగా నడిపించిన పాత్ర పోషించిన వారికి జాతీయ పురస్కారం ఇవ్వడం ఏమిటి? అని తెలంగాణ మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఈ ప్రశ్నలలో హేతుబద్ధత లేకపోలేదు.
మారిన ‘హీరోలు’
గతంలో కథానాయకుడి పాత్ర పోషించినవారు చెడుపై పోరాటం చేసేవారు. ఇప్పుడు కథానాయకుడే విలన్ లక్షణాలు పుణికి పుచ్చుకుంటున్నారు. దీని ప్రభావం సమాజంపై కూడా పడుతోంది. ఒకప్పుడు చెడు వ్యవసనాలు ఉన్న మగ పిల్లలను ఆడపిల్లలు ఇష్టపడేవారు కారు. ఇప్పుడు ఏ వ్యసనం లేని వాడిని పప్పుగాడు అని ఆడపిల్లలు ముద్దుగా పిలుచుకుంటున్నారు. సమాజం పోకడలనే తాము సినిమాలలో వాడుకుంటున్నామని చిత్ర పరిశ్రమకు చెందినవాళ్లు అంటుండగా, సినిమాల ప్రభావంతోనే యువత చెడిపోతోందన్న వాదన అవతల పక్షం నుంచి వస్తోంది. ఇప్పుడు మళ్లీ అసలు విషయానికి వద్దాం!
సినిమాల విడుదల సందర్భంగా గతంలో కూడా తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. అప్పట్లో అవి వివాదాస్పదం కాలేదు. ఎందుకంటే అప్పట్లో సినిమా నటులను ప్రజలు ఇష్టపడటంతోపాటు గౌరవించేవారు. ఇప్పుడు సినిమా నటులకు స్టార్‌డమ్ మాత్రమే ఉంటోంది. గౌరవం ఉండటం లేదు. దీనికి తోడు తెలుగునాట రాజకీయాలు ఎక్కువ. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేశారు. అల్లు అర్జున్‌కు అంత స్టార్‌డమ్ ఉన్నప్పటికీ ఆయన మద్దతు తెలిపిన అభ్యర్థి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అంటే ప్రజలు సినిమా వాళ్లను స్టార్లుగానే చూస్తారుగానీ, ఎన్నికలకు వచ్చేసరికి వారిని గుడ్డిగా ఆదరించరని స్పష్టమవుతోంది.
ఈ వాస్తవం తెలుసుకోకుండా నటులు స్టార్‌డమ్‌ను తలకెక్కించుకొని తమను తాము ‘డెమీ గాడ్స్’గా భావిస్తూ భ్రమల్లో బ్రతుకుతుంటారు. బౌన్సర్స్‌ను కాపలాగా పెట్టుకొని దర్పం వొలకబోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంధ్య థియేటర్ సంఘటన జరిగింది. తొక్కిసలాట సంఘటనపై అల్లు అర్జున్ వెంటనే స్పందించకపోవడం, తర్వాత 25 లక్షల పరిహారాన్ని రేవతి కుటుంబానికి ప్రకటించడం జరిగింది. అన్నిటికి మించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనను తప్పు పట్టే విధంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సలహాను ఆయనకు ఎవరిచ్చారో తెలియదు. ఫలితంగా ఈ వివాదం రాజకీయ మలుపు తిరిగింది. విచిత్రం ఏమిటంటే, వాస్తవ పరిస్థితిని అల్లు అర్జున్‌కు చెప్పడానికి ఎవరూ సిద్ధపడలేదట! హీరో గారికి కోపం వస్తుంది, మూడ్ మారిపోతుందని ఆయన చుట్టూ ఉన్నవారు అన్నారట! అనేక ఎగుడు దిగుడులు చూసిన అల్లు అరవింద్ అయినా తండ్రిగా కల్పించుకొని విలేకరుల సమావేశం వద్దని కుమారుడిని వారించి ఉండాల్సింది. అల్లు అర్జున్ తండ్రి మాట కూడా వినరు అని అంటారు. మొత్తం మీద ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుగా ఈ వ్యవహారం పుణ్యమా అని మొత్తం చిత్ర పరిశ్రమ నష్టపోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం జరపడానికి కూడా చిత్ర పరిశ్రమ ప్రముఖులు సాహసం చేయలేకపోయారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చొరవ తీసుకొని చిత్ర పరిశ్రమ ప్రముఖులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. సినిమాల నిర్మాణానికి అంతర్జాతీయ వేదికగా హైదరాబాద్‌ను అభివృద్థి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. ఇందుకోసమైతే సదరు సమావేశం అవసరమే లేదు. అంటే, తమ మనసులోని కోర్కెలను ముఖ్యమంత్రి ముందు చెప్పుకోవడానికి కూడా చిత్ర పరిశ్రమ పెద్దలు సాహసం చేయలేకపోయారు. శాసనసభలో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేయడంతో బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ ధరల పెంపు విషయం గురించి చిత్ర పరిశ్రమ ప్రముఖులు అడగలేకపోయారని భావించాలి. ముఖ్యమంత్రిని శాంతింప చేయడమే ప్రధాన అజెండా కనుక ఆ దిశగా సినీ ప్రముఖులు కొంత మేరకు సక్సెస్ అయ్యారని భావించవచ్చు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ మాత్రం మొహమాట పడకుండా సినిమా వాళ్లకు షరతులు విధించారు. ప్రభుత్వ సహకారం కావాలంటే మాదక ద్రవ్యాలను అరికట్టడంలో, టూరిజం ప్రమోషన్‌కు సినీ ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచారం చేయాలని కరాఖండీగా చెప్పారు. దీంతో తానేమిటో రేవంత్‌రెడ్డి రుజువు చేసుకున్నారు. ముఖ్యమంత్రిని శాంతింపజేయడానికి సినిమా ప్రముఖులు శాలువాలు కప్పి బొకేలు ఇవ్వడంలో పోటీపడ్డారు. సమీకృత గురుకులాల అభివృద్ధికి సినిమాల ప్రదర్శనపై శిస్తు విధిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అన్నిటికీ తలలు ఊపిన సినిమా ప్రముఖులు తమకు ఏం కావాలో అడగలేకపోయారు. మొత్తమ్మీద అల్లు అర్జున్ ప్రారంభంలోనే కొంత లౌక్యం ప్రదర్శించి ఉంటే ఈ వ్యవహారం టీ కప్పులో తుఫానులా తేలిపోయి ఉండేది. తెలుగు స్టార్లు, ఆ మాటకు వస్తే ఏ భాషకు చెందిన స్టార్లయినా పులులు, సింహాలు కారని, రాజకీయ అధికారానికి తలవంచకపోతే తిప్పలు తప్పవని ఈ వ్యవహారంతో మరోమారు స్పష్టమైంది.
అనుచిత వ్యాఖ్యలు తగవు...
అయితే, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలతోపాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ వంటి వాళ్లు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో ఉండాలంటే అణిగి మణిగి ఉండాలని, లేదంటే ఆంధ్రాకు వెళ్లిపోవాలని హెచ్చరికలు చేయడం సమంజసం కాదు. మొట్టమొదటగా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మద్రాసులో స్థిరపడిన తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు ఆహ్వానించారు. అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కృష్ణ వంటి వాళ్లకు స్టూడియోల నిర్మాణాలకు భూములు కేటాయించారు. సినిమా ప్రముఖుల నివాసాల కోసం ప్రస్తుత ఫిల్మ్‌నగర్‌లోని స్థలాలు కూడా ఆయనే కేటాయించారు. చెన్నారెడ్డితోపాటు ఆ తర్వాత ముఖ్యమంత్రుల కృషి కారణంగా చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడొక దురదృష్టకర సంఘటన జరిగిన కారణంగా... ఉంటే ఉండండి లేదంటే పోండని హెచ్చరించడం సమర్థనీయం కాదు. ఇలాంటి ధోరణులను అరికట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఉంటుంది. స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్లు కూడా అహం తగ్గించుకోవాలి. పుష్ప–2 సినిమాలో స్మగ్లర్‌తో ఫొటో దిగడానికి నిరాకరించిన ముఖ్యమంత్రినే మార్చినట్టు చూపించి ఉండవచ్చు కానీ, నిజ జీవితంలో ముఖ్యమంత్రులతో పెట్టుకుంటే ఏమవుతుందో యావత్ సినిమా పరిశ్రమకూ ఇప్పుడు తెలిసి వచ్చింది. సంధ్యా థియేటర్ సంఘటనలో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి కేటీఆర్ ఖండించడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. తనకు రాజకీయాలతో సంబంధం లేదని అల్లు అర్జున్ చెప్పుకుంటున్నప్పటికీ ఈ ఖండనల వల్ల ఆయనకు రాజకీయం అంటుకుంది. అరెస్టు సమయంలోనూ, జైలు నుంచి తిరిగి వచ్చినప్పుడు అల్లు అర్జున్‌ను పరామర్శించడానికి సినిమా ప్రముఖులు బారులు తీరడం కూడా ముఖ్యమంత్రి రేవంత్‌కు కోపం తెప్పించి ఉంటుంది. ఆయనకు కాలు విరిగిందా? చేయి విరిగిందా? పరామర్శలు ఎందుకు? అని ముఖ్యమంత్రి నిలదీశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తప్పు చేశారు. ఆయన కూడా అల్లు అర్జున్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి సిల్లీ తప్పులు చేయడం చంద్రబాబుకు అలవాటే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చంద్రబాబుకు సత్సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబును రేవంత్ కూడా గౌరవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ను పరామర్శించడం అంటే రేవంత్ సర్కార్ తప్పు చేసిందన్న భావన ప్రజల్లో కల్పించడమే అవుతుంది.
తప్పదు... తగ్గాలి
ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ముఖ్యంగా స్టార్లు తమ పరిధులను గుర్తించి మెలగడం మంచిది. చిత్ర పరిశ్రమ మొత్తం టర్నోవర్ ఏడాదికి రెండు మూడు వేల కోట్లకు మించి ఉండదు. ఇంతకంటే ఎక్కువ టర్నోవర్‌తో వ్యాపారాలు చేస్తున్న సంస్థలు హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఉన్నాయి. వారెవరికీ దక్కని గుర్తింపు, గౌరవం చిత్ర పరిశ్రమ వారికి వస్తున్నాయంటే అందుకు గ్లామర్ ప్రధాన కారణం. ఈ గ్లామర్‌ను గ్లామర్‌గానే చూడకుండా తాము ఇంత, తాము అంత అనుకుంటే ఎదురు దెబ్బలు తప్పవు. సినిమా పరిశ్రమ వల్ల అనేక మందికి ఉపాధి లభిస్తోంది. ఈ వాస్తవాన్ని అనుచిత వ్యాఖ్యలు చేసేవారు గుర్తుంచుకోవాలి. అతి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడం, పెట్టుబడులు తిరిగి రాబట్టుకునేందుకు టికెట్ ధరలను వెయ్యి రూపాయల వరకు పెంచడం, ప్రేక్షకులపై భారం మోపడం దీర్ఘకాలంలో మంచిది కాదని చిత్ర పరిశ్రమ గుర్తించాలి. మితి మీరిన అహంకారం వల్ల అనర్థమే తప్ప ప్రయోజనం ఉండదు. అల్లు అర్జున్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. పుష్ప–2 సినిమా సక్సెస్‌ను కూడా ఆయన ఆస్వాదించలేకపోతున్నారు. సినిమా బాగా రావడానికి అల్లు అర్జున్ విపరీతంగా కష్టపడతారని, ఆయనలా కష్టపడే నటుడు మరొకరు లేరని నిర్మాతలు చెబుతుంటారు. కష్టపడే మనస్తత్వంతో పాటు కాస్త వినయం కూడా అలవర్చుకుంటే అల్లు అర్జున్ మరిన్ని విజయాలను అందుకుంటారు. మొన్నటి సమావేశం తర్వాత వివాదం ప్రస్తుతానికి సమసిపోయింది. ముఖ్యమంత్రి చెబుతున్నట్టుగా మునుముందు ఇటువంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత చిత్ర పరిశ్రమ పైనే ఉంటుంది. ప్రేక్షకులలో నటులపై ఉండే క్రేజ్‌ను సినిమా ప్రమోషన్లకు ఉపయోగించుకొనే విధానానికి చిత్ర పరిశ్రమ ఇకనైనా స్వస్తి చెప్పాలి. సినిమా విడుదల సందర్భంగా మొదటి రోజు మొదటి ఆటను ప్రేక్షకులతో కలసి కూర్చొని థియేటర్లలో చూసే విధానానికి స్టార్లు కూడా దూరంగా ఉండాలి. ఏ సినిమాకైనా మొదటి ఆటలో ఆ హీరో అభిమానులు అధికంగా వస్తారు. అలాంటప్పుడు వారి మధ్యకు వెళ్లి సినిమా చూస్తే తొక్కిసలాట జరగకుండా ఉంటుందా? మొత్తమ్మీద ‘అంతా నీవల్లే’ అనే నిందను బన్నీ భరించాల్సి వస్తోంది. ఇతర స్టార్లు భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి తమ దాకా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం!
ఆర్కే
యూట్యూబ్‌లో
‘కొత్త పలుకు’ కోసం
QR Code
scan
చేయండి
Updated Date - Dec 29 , 2024 | 12:23 AM