ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Editorial : నీళ్ల మంటలు!

ABN, Publish Date - Sep 21 , 2024 | 01:46 AM

సింధు నదీజలాల ఒప్పందాన్ని సవరించుకుందామంటూ ఇటీవల భారతదేశం ఇచ్చిన నోటీసుకు పాకిస్థాన్‌ తనదైన ధోరణిలో స్పందించింది.

  • తమసోమా జ్యోతిర్గమయ

సింధు నదీజలాల ఒప్పందాన్ని సవరించుకుందామంటూ ఇటీవల భారతదేశం ఇచ్చిన నోటీసుకు పాకిస్థాన్‌ తనదైన ధోరణిలో స్పందించింది. ఆరుదశాబ్దాలనాటి ఆ ఒప్పందాన్ని సమీక్షించి, సవరించుకోవాలని భారత ప్రభుత్వం గత ఏడాది కూడా పాకిస్థాన్‌ను డిమాండ్‌ చేసింది. అప్పట్లో తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్‌ ఈ మారు మాత్రం కాస్తంత తగ్గింది. పాకిస్థాన్‌ ఈ ఒప్పందాన్ని ఎంతో గౌరవిస్తుందని, భారత్‌ కూడా అలాగే భావిస్తూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హితవుచెప్పింది. తొమ్మిదేళ్ళ సుదీర్ఘచర్చల అనంతరం 1960లో నెహ్రూ–అయూబ్‌ఖాన్‌ సంతకాలు చేసిన ఈ ఒప్పందంలో పటిష్టమైన నిబంధనలు, పలుదశల వివాద పరిష్కారమార్గాలు ఉన్నందునే అది ఇప్పటికీ బలంగా నిలబడింది. ప్రపంచవ్యాప్తంగా చాలా నదీజలాల పంపకాలకు ఇది ఆదర్శమని కూడా అంటారు. మరీముఖ్యంగా, భారత్‌–పాకిస్థాన్‌ మధ్య ఇన్ని దశాబ్దాలుగా వీసమెత్తు సయోధ్య లేకున్నా, చివరకు యుద్ధాలు జరిగినా ఈ ఒప్పందం నిలిచింది. అయితే, కిషన్‌గంగ, రాటిల్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టుల విషయంలో రెండుదేశాల మధ్యా ఉన్న వివాదం ఈ ఒప్పందాన్ని ప్రమాదంలో పడవేసేట్టు కనిపిస్తోంది.


పరిస్థితులు, అవసరాలు పూర్తిగా మారిపోయాయని, ఇప్పుడు ఒప్పందాన్ని తిరగరాసుకోవాలని భారత్‌ వాదిస్తూ, పెరిగిన జనాభా, క్లీన్‌ ఎనర్జీ, పర్యావరణ మార్పులు, ఉగ్రవాదం తదితర కారణాలను భారత్‌ ప్రస్తావించింది. నోటీసులు ఇవ్వడానికి ఇవన్నీ సముచిత కారణాలేనన్నది అటుంచితే, సరిహద్దు ఉగ్రవాదం హెచ్చినప్పుడో, కశ్మీర్‌తో అవసరాలు పెరిగినప్పుడో ఈ ఒప్పందాన్ని భారత్‌ తరచుగా పాకిస్థాన్‌కు గుర్తుచేస్తూ ఉంటుంది. గత ఏడాది ఇచ్చిన నోటీసుకు ఇప్పటిది కొనసాగింపు మాత్రమేనని, ఈ రెండు జలవిద్యుత్‌ ప్రాజెక్టుల విషయంలో పాకిస్థాన్‌ ఒత్తిడికి లొంగకూడదన్న పట్టుదలతోనే భారత్‌ ఈ విధంగా వ్యవహరిస్తున్నదని అంటారు. సింధునదీ జలాల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్‌ నదులు పాకిస్థాన్‌కు దక్కాయి. రావి, బియాస్‌, సట్లెజ్‌ భారతదేశానికి వచ్చాయి.


ప్రపంచబ్యాంకు మధ్యవర్తిగా కుదిరిన ఈ ఒప్పందం సజావుగా అమలుజరగడానికి సింధు శాశ్వత కమిషన్‌ ఏర్పాటైంది, రెండు దేశాలనుంచి అందులో కమిషనర్లు ఉన్నారు. చీనాబ్‌, జీలం నదులమీద జమ్మూకశ్మీర్‌లో ఈ జల విద్యుత్‌ ప్రాజెక్టుల అంశాన్ని ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవచ్చునన్నది భారత్‌ వాదన. కానీ, తనవాటా నదులమీద వీటి నిర్మాణంపై పాకిస్థాన్‌ దశాబ్దంన్నరకాలంగా రచ్చచేస్తున్నది. భారత్‌ స్వేచ్ఛగా ఉపయోగించుకోగలిగే జలాల పరిధిలోనే ఈ ప్రాజెక్టులు ఉన్నా, ఆ జలాలను విద్యుత్‌ వినియోగానికి తప్ప భారత్‌ ఇతరత్రా వినియోగించుకోకున్నా, ప్రవాహాలకు ఆటంకం కాకున్నా ఈ ప్రాజెక్టులను పాకిస్థాన్‌ వ్యతిరేకిస్తోంది. నిజానికి హేగ్‌ ఆర్బిట్రేషన్‌కోర్టు అనుమతించిన మేరకే జీలం నదిమీద కిషన్‌గంగ ప్రాజెక్టు పూర్తయింది. చీనాబ్‌ మీద రాటిల్‌ మాత్రం పూర్తికాని స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో, సింధునదీ జలాల ఒప్పందంలో భాగంగా వివాద పరిష్కారానికి తటస్థ నిపుణుడిని నియమించవలసిందిగా పాకిస్థాన్‌ ప్రపంచబ్యాంకును 2015లో కోరింది. అది జరిగిన మరుసటి ఏడాది పాకిస్థాన్‌ ఆ ప్రతిపాదన ఉపసంహరించుకొని, హేగ్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టునుంచి న్యాయం కావాలన్నది. ఇందుకు కూడా ప్రపంచబ్యాంకు తలూపడంతో భారత్‌కు ఆగ్రహం కలిగింది.


అంతవరకూ తటస్థ నిపుణుడికి సహకరించిన భారతదేశం హేగ్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టు విచారణకు మాత్రం గైర్హాజరైంది. తనకు దక్కాల్సిన నీటిని ఈ రెండు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాయన్న పాకిస్థాన్‌ ఆరోపణకు తగిన ఆధారాలు లేవని భారతదేశం అంటోంది. పాక్‌ ఒత్తిడికి లొంగి ప్రపంచబ్యాంకు ఏకకాలంలో రెండు సమాంతర ప్రక్రియలకు అనుమతించడం సరికాదనీ, భిన్నమైన తీర్పులతో మరింత గందరగోళం ఏర్పడుతుందనీ భారత్‌ వాదన. వివాద పరిష్కారానికి తనకు అర్హత ఉన్నదని హేగ్‌ కోర్టు ఇటీవల చెప్పినప్పటికీ, ముందుగా తటస్థ నిపుణుడే అమీతుమీ తేల్చాలని భారత్‌ వాదన. హేగ్‌ కోర్టు తీర్పును అడ్డుకోవడానికే సింధునదీజలాల ఒప్పందాన్ని తిరగదోడాలన్న ప్రతిపాదన భారత్‌ తెస్తోందని పాకిస్థాన్‌ ఆరోపణ. 850 మెగావాట్ల రాటిల్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టును రక్షించుకోవడానికి వీలుగా, పాకిస్థాన్‌ మెడలు వంచేందుకు భారత్‌ ఈ ప్రతిపాదన చేస్తున్నదని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.

Updated Date - Sep 21 , 2024 | 02:21 AM