P.Chidabaram : వినిపించడం లేదా మణిపూర్ రోదన?
ABN, Publish Date - Sep 14 , 2024 | 05:24 AM
మణిపూర్ ఆవేదనను పట్టించుకుంటున్నామా? మునుపటి ‘పళని పలుకు’ పుటలు తిప్పుతూ నన్ను నేనే నిందించుకున్నాను. ఎందుకు? సంక్షుభిత మణిపూర్ గురించి తరచు రాయనందుకు.
మణిపూర్ ఆవేదనను పట్టించుకుంటున్నామా? మునుపటి ‘పళని పలుకు’ పుటలు తిప్పుతూ నన్ను నేనే నిందించుకున్నాను. ఎందుకు? సంక్షుభిత మణిపూర్ గురించి తరచు రాయనందుకు. జూలై 29, 2023న నేను చివరిసారి మణిపూర్ గురించి రాశాను (‘మణిపూర్‌లో జాతుల ముసలం’). 13 నెలల అనంతరం మళ్లీ ఇప్పుడు రాస్తున్నాను. ఇది గర్హనీయం, అంగీకరిస్తున్నాను. అంతే కాదు క్షమార్హం కాదు, ఒప్పుకుంటున్నాను. సకల భారతీయులు తమ ఉమ్మడి స్మృతిలో మణిపూర్‌ను అట్టడుగుకు నొక్కివేశారు. ఏమయింది మన ఉచితానుచిజ్ఞత? ఇదీ క్షమార్హం కాదు, ముమ్మాటికీ.
గత ఏడాది జూలైలో మణిపూర్ గురించి రాసినప్పుడు భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించలేదు అన్నీ అమంగళకరంగానే కనిపించాయి. ‘మణిపూర్‌లో జాతి సంహారం ఆరంభమయింది’ అని అప్పుడు చెప్పాను. ఇంకా ఇలా చెప్పాను: ‘ఈ రోజు నేను చదివిన వార్తలు, అందుకున్న నివేదికల ప్రకారం ఇంఫాల్ లోయలో ఒక్క కుకీ జోమీ కూడా లేడు. కుకీజోమీల ప్రాబల్యమున్న ప్రాంతాలలో ఒక్క మెయిటీ కూడా కన్పించడం లేదు’. ఈ పరిస్థితిని మరి కొంచెం ఇలా చెప్పాను: ‘ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు ఇంటి వద్ద నుంచే తమ అధికారిక విధులు నిర్వర్తిస్తున్నారు. అల్లర్ల ప్రభావిత ప్రాంతాలలోని బాధితులను పరామర్శించేందుకు వెళ్లడానికి వారు సిద్ధంగా లేరు’. ఈ శోచనీయ పరిస్థితిపై ఇంకా ఇలా వ్యాఖ్యానించాను: మణిపూర్ పోలీసులను కుకీలుకానీ, మెయిటీలు కాని ఏ మాత్రం విశ్వసించడంలేదు. దాడులలో గాయపడిన లేదా మరణించిన వారి గురించిన అధికారిక అంకెలను ఏ ఒక్కరూ నమ్మడంలేదు’.
విచారకరమైన విషయమేమిటంటే నేను రాసిన ప్రతి మాట నిజమయింది. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్న వారిలో ఒకరు గానీ, అంతకంటే ఎక్కువ మంది గానీ మణిపూర్ విషాద ఘటనలకు బాధ్యత వహించి తీరాలి. మరి అధికారంలో ఉన్న ముగ్గురు ప్రముఖులు మణిపూర్‌కు ఊరట కల్పించడానికి ఏమి చేశారో చూద్దాం.
మొదటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మణిపూర్‌లో మిన్ను విరిగి మీద పడినా ఆ రాష్ట్రాన్ని సందర్శించకూడదని ఆయన సంకల్పించుకున్నారు కాబోలు! ‘మణిపూర్ మండనీ, చావనీ నేను మాత్రం మణిపూర్ గడ్డపై అడుగుపెట్టే ప్రసక్తే లేదు’ అని తీర్మానించుకున్నట్టుగా ఆయన వైఖరి ఉన్నది. జూన్ 9, 2024న మూడో పర్యాయం ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన మోదీకి ఇటలీ సందర్శించేందుకు (జూన్ 13, 14), రష్యా పర్యటన (జూలై 8, 9)కు, ఆస్ట్రియా వెళ్లేందుకు (జూలై 10), పోలండ్‌లో పర్యటించేందుకు (ఆగస్టు 21, 22), ఉక్రెయిన్‌లో శాంతి చర్చలకు (ఆగస్టు 23, 24), బ్రూనేలో మంతనాలకు (సెప్టెంబర్ 3, 4), సింగపూర్‌లో పర్యటించేందుకు (సెప్టెంబర్ 4, 5) సమయం లభించింది. ఇంకా ఈ ఏడాది మిగిలిన నెలల్లో ఆయన అమెరికా, లావోస్, సమోస్, రష్యా, అజర్ బైజాన్, బ్రెజిల్ మొదలైన దేశాలలో పర్యటించనున్నారు. చెప్పవచ్చిందేమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణిపూర్‌ను సందర్శించనిది సమయం లభించక కాదు, ఆ దురదృష్టకర, నిస్సహాయ రాష్ట్రానికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నందువల్లేనన్నది స్పష్టం.
మణిపూర్‌ను సందర్శించేందుకు మోదీ ససేమిరా అనడం ఆయన మూర్ఖపు పట్టుదలకు నిదర్శనం. గుజరాత్ మారణకాండ, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తినప్పుడు, మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించినప్పుడు ఆయన అనుసరించిన వైఖరిలో మొండితనం మాత్రమే ఉంది. పార్లమెంటు ఉభయ సభలలో అత్యావశ్యక విషయాలపై తక్షణ చర్చకు నిరాకరిస్తూ వాయిదా తీర్మానాలను వ్యతిరేకించాలని తన మంత్రులకు ఆదేశాలు జారీ చేయడంలోను ఆయన మొండి స్వభావమే స్పష్టంగా కనిపిస్తుంది.
రెండో వ్యక్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మణి పూర్‌లో సీనియర్ అధికారుల నుంచి భద్రతా దళాలను మొహరించే వరకు ఆ రాష్ట్ర పరిపాలన సమస్తమూ అమిత్ షా ఆదేశాల ప్రకారమే నడిచింది, నడుస్తోంది. ఆయనే మణిపూర్ ప్రభుత్వం సుమా! అమిత్ షా కావలిలోనే హింసాకాండ ప్రజ్వరిల్లింది. మణిపూర్ ప్రజలు పరస్పరం తుపాకులు, బాంబులతో మాత్రమే పోరాడుకోవడం లేదు. స్వతంత్ర భారతదేశంలో ప్రప్రథమంగా రాకెట్లు, ఆయుధీకరణ అయిన డ్రోన్‌లను ఉపయోగించారు. గతవారం మణిపూర్‌లోని రెండు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఐదు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు, ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఇంఫాల్ నగరంలో పోలీసులు వీధులలో విద్యార్థులతో పోరాడుతున్నారు. మణిపూర్‌లో ఇప్పటికే ఉన్న 26 వేలమంది భద్రతా సిబ్బందికి సహాయంగా మరో రెండు సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ల (2000 మంది స్త్రీ పురుషులు) తరలించారు.
మూడో వ్యక్తి ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్. ఈయన తనకు తానుగా నిర్మించుకున్న కారాగారంలో ఖైదీగా ఉన్నారు. ఇంఫాల్ లోయలో సైతం ఆయనగానీ, ఆయన మంత్రులుగానీ పర్యటించలేకపోతున్నారు కుకీ జోమీలు ఆయన్ని అసహ్యించుకుంటున్నారు. బీరేన్ సింగ్ తమకు భద్రత సమకూర్చగలరని మెయిటీలు భావించారు. వారికి ఆశాభంగమే మిగిలింది. మణిపూర్‌లో చివరకు మెయిటీలకు సైతం ఆయన చాలా అప్రియమైన వ్యక్తిగా ఉన్నారు.
పరిపాలన అనేది లేకుండా పోయింది. మణిపూర్‌ను దహించివేస్తున్న పౌర అశాంతికి బీరేన్ సింగ్ అవివేక, అసమర్థ పాలనే ప్రధాన కారణమనడం సత్యదూరం కాదు అన్ని పక్షాలూ, వర్గాలూ ఆయన్ని ఒక సమస్యగా పరిగణిస్తున్నాయి. చాలా నెలల క్రితమే ఆయన రాజీనామా చేసి ఉండవలసింది. మరి బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వైనం తమ తప్పులను ఒప్పుకునేందుకు రవ్వంత కూడా సిద్ధపడని నరేంద్ర మోదీ, అమిత్ షా అహంకారపూరిత వైఖరిని ప్రతిబింబిస్తోంది. మణిపూర్ ఇప్పుడు యథార్థంగా రెండు రాష్ట్రాలు.
చురాచంద్‌పూర్, ఫెర్జవాల్, కాంగ్ పోక్పి జిల్లాలు పూర్తిగా కుకీల నియంత్రణలో ఉన్నాయి. సరిహద్దు పట్టణం మోరేతో సహా టెంగ్‌నౌపాల్ జిల్లాలు కుకీల నియంత్రణలో ఉన్నవి. ఈ జిల్లాలో నాగాలు కూడా గణనీయంగా ఉంటారు. కుకీలు తమ ప్రత్యేక పాలనను నిర్వహిస్తున్నారు. మెయిటీ జాతికి చెందిన ప్రభుత్వోద్యోగులు కుకీల నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో లేరు. మెయిటీలు అందరూ ఇంఫాల్ లోయలో మాత్రమే ఉన్నారు. మెయిటీలు మెజారిటీగా ఉన్న రాష్ట్రంలో (మణిపూర్ శాసనసభలోని 60 మంది సభ్యులలో 40 మంది మెయిటీలే) ఉండడానికి ఇష్టపడడం లేదు. మణిపూర్ ప్రాదేశిక సమగ్రత, అస్తిత్వాన్ని సంరక్షించుకోవాలని మెయిటీలు ఆకాంక్షిస్తున్నారు. మెయిటీలు, కుకీల మధ్య ఎటువంటి మినహాయింపులు లేని వైరభావం నిండుగా నెలకొని ఉంది.
ప్రభుత్వం, భిన్న జాతుల మధ్యగానీ, మెయిటీలు, కుకీల మధ్య గానీ చర్చలు జరగడంలేదు. అందుకు ఆస్కారం కూడా కనిపించడంలేదు ఇక నాగాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చారిత్రక ఫిర్యాదులు ఉన్నాయి. మెయిటీలు, కుకీల ఘర్షణల్లో భాగం కావడానికి నాగాలు ఇష్టపడడం లేదు. అపనమ్మకాలు, వంచన, జాతుల ఘర్షణ సాలెగూడులో మణిపూర్ చిక్కుకున్నది. శాంతి భద్రతలను కాపాడి ఒక ప్రభుత్వాన్ని నిర్వహించడమనేది అంత సులువైన విషయం కాదు. దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అదే పార్టీ పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగా మణిపూర్‌లో పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. మన భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంలో ఒక రాష్ట్రమైన మణిపూర్‌కు ప్రయాణించడమంటే చందమామలోని సుదూర, నిగూఢ, అజ్ఞాత ప్రదేశాలకు వెళ్లడమంత ప్రమాదభరితమన్న సత్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహుశా తెలుసుకున్నారేమో?!
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
Updated Date - Sep 14 , 2024 | 05:30 AM