ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పురానవ మైత్రీ బంధం

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:05 AM

నిష్క్రమించనున్న 2024, భారత్‌కు దౌత్య రంగంలో ఒక సంతృప్తికరమైన సంవత్సరం. చైనాతో సంబంధాలు, ఐదేళ్ల ఉద్రిక్తతల తగ్గదలతో మెరుగుపడ్డాయి. ఇతర ఇరుగు పొరుగు దేశాలలో శ్రీలంక, మాల్దీవులు భారత్‌తో...

నిష్క్రమించనున్న 2024, భారత్‌కు దౌత్య రంగంలో ఒక సంతృప్తికరమైన సంవత్సరం. చైనాతో సంబంధాలు, ఐదేళ్ల ఉద్రిక్తతల తగ్గదలతో మెరుగుపడ్డాయి. ఇతర ఇరుగు పొరుగు దేశాలలో శ్రీలంక, మాల్దీవులు భారత్‌తో సుస్థిర స్నేహ సంబంధాలు నెరపాల్సిన ఆవశ్యకతను గుర్తించాయి. నేపాల్, భూటాన్‌ల అభీష్టం ఏమైనప్పటికీ న్యూఢిల్లీని అవి దూరం చేసుకోలేవు. ఇక పాకిస్థాన్‌ దాయాది జగడాలు ఇప్పట్లో తీరేవి కావు. బంగ్లాదేశ్‌ నుంచి సంక్లిష్ట సవాళ్లు అనివార్యం. అవి మన దౌత్య దక్షతకు పరీక్షలే. ఇదలా ఉంచితే మనకు మరీ దగ్గరగాను, మరీ దూరంగాను లేని కువైత్‌తో భారత్‌ సంబంధాలలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభం కావడం ముదావహం.


ఇటీవల కువైత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన చరిత్రాత్మకమైనది. భారత ప్రధానమంత్రి ఒకరు ఇందిరా గాంధీ అనంతరం ఆ గల్ఫ్‌ రాజ్యాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. మనస్పర్థలు, మనస్తాపాలు పూర్తిగా తొలగిపోయిన వాతావరణంలో మోదీ పర్యటన జరిగింది. దశాబ్దాలుగా కువైత్‌తో మన సంబంధాలు ఉండవలసిన రీతిలో ఉండకపోవడానికి బాధ్యత మనదే అని అంగీకరించక తప్పదు. ఇరాక్‌ 1990లో కువైత్‌ను దురాక్రమించినప్పుడు, న్యూఢిల్లీ కొన్ని కారణాల వల్ల కువైత్‌ సార్వభౌమత్వానికి మద్దతు నివ్వలేదు. ఇది కువైత్‌ను బాధించింది. కష్ట కాలంలో విరోధి ఎత్తి పొడుపుల కంటే మిత్రుడి మౌనమే ఎక్కువగా కలవరపరుస్తుంది కదా. కువైత్‌ సహజంగానే మన పట్ల కినుక వహించింది. అయితే భారతీయ కార్మికులు, వృత్తి నిపుణులను యథావిధిగా ఆహ్వానించినా ద్వైపాక్షిక సంబంధాలు ముక్తసరి స్థాయిలోనే ఉండిపోయాయి. ప్రపంచ ఆర్థిక శక్తిగా, భౌమ రాజకీయాలలో కీలక దేశంగా భారత్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీతో సంబంధాలను పటిష్ఠం చేసుకునేందుకు కువైత్‌ మళ్లీ సుముఖమయింది.

కువైత్‌తో భారత్‌ సంబంధాలకు పురాతన చరిత్ర ఉన్నది. సింధు నాగరికతకు పూర్వం నుంచే భారత్‌ పశ్చిమ తీర ప్రాంతాలు, కువైత్‌ మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నట్లు ఇటీవలి పురావస్తు తవ్వకాలు ధ్రువీకరించాయి. ప్రాచీన కువైత్‌ వ్యాపారులు తమ సహజ ముత్యాలు, అరేబియన్‌ గుర్రాలు, బస్రా ఖర్జూరాలను తీసుకువచ్చి మన వస్త్రోత్పత్తులు, సుగంధ ద్రవ్యాలను తీసుకువెళ్లేవారు. 1929 ప్రపంచ ఆర్థిక మాంద్యం ఈ ముత్యాల వ్యాపారాన్ని చావుదెబ్బ తీసింది. ఆ తరువాత కొద్ది కాలానికే కువైత్‌లో చమురు నిక్షేపాలు వెలుగులోకి రావడంతో వాణిజ్య సంబంధాలు దాదాపుగా క్షీణించిపోయాయి. అయినప్పటికీ 1961లో బ్రిటిష్‌ వలసపాలన నుంచి స్వాతంత్ర్యాన్ని పొందే వరకు కువైత్‌లో భారతీయ రూపాయి ఆ దేశ అధికారిక కరెన్సీగా ఉండేది.


వాణిజ్యం, ప్రజల స్థాయిలో జీవన బంధాలు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సుదృఢ ప్రాతిపదికలు. కువైట్‌ వాణిజ్య భాగస్వాములలో భారత్‌ అగ్రగామిగా ఉన్నది. 2023–24లో ఉభయ దేశాల మధ్య దాదాపు 1100 కోట్ల డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలోనే కువైట్‌ మనకు సరఫరా చేసిన క్రూడాయిల్‌ మన మొత్తం ఇంధన అవసరాలలో 3 శాతాన్ని తీర్చింది. కువైత్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ మన దేశంలో పరోక్షంగా 1000 కోట్ల డాలర్లకు పైగా మదుపులు చేసింది. కొవిడ్‌ విలయంలో కువైత్‌కు మన దేశం రెండు లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు సమకూర్చింది. ఆ ఆపత్సమయంలో కువైత్‌ మనకు 282 ఆక్సిజన్‌ సిలెండర్లు, 60 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు తదితర వైద్య సామగ్రిని సరఫరా చేసింది. ప్రజల స్థాయిలో సంబంధాలను చూస్తే అరకోటి కువైత్‌ జనాభాలో పది లక్షలమంది ప్రవాస భారతీయులే. తమ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి వారు విశేషంగా దోహదం చేస్తున్నందునే కువైట్‌ పాలకులు సాధారణ సమయాలలోను, ఏవైనా ఆపదలు సంభవించినప్పుడు ఈ ప్రవాసులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు.

నాలుగు దశాబ్దాల అనంతరం తమ అతిధిగా వచ్చిన భారత ప్రధానమంత్రికి కువైట్‌ రాచరిక పాలకులు అపూర్వరీతిలో స్వాగతం పలికారు; అతిథి మర్యాదలు ఘనంగా చేశారు. తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌’ను మోదీకి ప్రదానం చేశారు. ‘భారత్‌ నుంచి కువైత్‌కు చేరేందుకు నాలుగు గంటల ప్రయాణమే అయినా (భారత) ప్రధానమంత్రికి నాలుగు దశాబ్దాలకు పైగా పట్టిందని’ నరేంద్ర మోదీ తన గౌరవార్థం కువైట్‌ అమీర్‌ షేక్‌ మెషాల్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ జాబెర్‌ అల్‌ సబాహ్ ఇచ్చిన విందు సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత్‌ కువైత్‌ల మధ్య మోసులెత్తిన కొత్త స్నేహ సంబంధాలు సుదీర్ఘకాలం పాటు నిరంతరంగా, సుస్థిరంగా వర్థిల్లాలని భారతీయులూ, కువైతీలూ ఆకాంక్షిస్తున్నారనడంలో సందేహం లేదు.

Updated Date - Dec 26 , 2024 | 12:05 AM