క్రికెట్ మేధావి
ABN, Publish Date - Dec 20 , 2024 | 01:22 AM
బ్యాటర్ బుర్రను చదివేసే మేధావి అతను. ఏ షాట్‌కు ఎలా వికెట్ పడగొట్టాలన్న ప్రణాళిక వేసుకునే ఇంజనీర్ అతను. బంతిపై పట్టు సాధించి వేళ్లతోనే మాయ చేసే మాంత్రికుడు. మొత్తంగా విభిన్నమైన అస్ర్తాలతో ప్రత్యర్థి జట్టును...
బ్యాటర్ బుర్రను చదివేసే మేధావి అతను. ఏ షాట్‌కు ఎలా వికెట్ పడగొట్టాలన్న ప్రణాళిక వేసుకునే ఇంజనీర్ అతను. బంతిపై పట్టు సాధించి వేళ్లతోనే మాయ చేసే మాంత్రికుడు. మొత్తంగా విభిన్నమైన అస్ర్తాలతో ప్రత్యర్థి జట్టును కకావికలం చేయగల స్పిన్ యోధుడు. ప్రపంచ క్రికెట్‌లో అతికొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే ఘనతలెన్నో అందుకున్న బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటను ముగించాడు. పద్నాలుగేళ్ల తన సుదీర్ఘ కెరీర్‌కు తెరదించుతూ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.
అనిల్ కుంబ్లే రిటైరయ్యాడు.. హర్భజన్ సింగ్ కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. మరి.. దశాబ్దాలుగా భారత బౌలింగ్‌కు ప్రధాన ఆయుధంగా ఉన్న స్పిన్ దళాన్ని ముందుకు నడిపించేదెవరు? కుంబ్లే, హర్భజన్‌ల వారసత్వాన్ని కొనసాగించేదెవరు? ఇలాంటి సందేహాలు ముసురుకున్న వేళ భారత జట్టులోకి వచ్చాడు అశ్విన్. ఆరంభంలో సాధారణ బౌలర్‌గానే కనిపించినా, రానురాను తన శైలిని అసాధారణంగా మార్చుకున్నాడు. తన అమ్ములపొదిలోని ఒక్కో అస్ర్తాన్ని బయటకు తీస్తూ ముందుకు సాగాడు. ఒక ఓవర్‌లో ఆరు బంతులను ఆరు రకాలుగా వేయగలిగే నైపుణ్యాన్ని సంతరించుకొని బ్యాటర్లకు కఠిన పరీక్షలా నిలిచాడు. బంతిని మధ్యవేలితో పట్టుకొని సంధించే క్యారమ్‌బాల్‌తో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టడం అశ్విన్‌కే చెల్లింది.
క్రీడాకారులు చిన్నప్పుడు ఆటలను కెరీర్‌గా ఎంచుకునే క్రమంలో చదువుపై అంతగా దృష్టి సారించరు. కానీ, అశ్విన్ అందుకు భిన్నం. క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంటూనే చదువులోనూ రాణించాడు. ఏకంగా ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు. మొదట మీడియం పేసర్‌గా క్రికెట్‌లోకి అడుగుపెట్టినా, అమ్మ సూచనతో ఆఫ్ స్పిన్ బౌలింగ్‌కు మారడం, అతని కెరీర్‌కు ఎంతో దోహదం చేసింది. కెరీర్ ఆరంభంలో అశ్విన్‌కు మోకాలి నొప్పి సమస్యగా ఉండేది. ఆ సమయంలో అమ్మ..‘పేస్ బౌలింగ్‌తో ఎక్కువగా ఎందుకు పరుగులు పెడతావు? కొన్ని అడుగులు వేసేలా స్పిన్ బౌలింగ్ వేయొచ్చు కదా’ అని కుమారుడికి సలహా ఇచ్చింది. వెంటనే బౌలింగ్ తీరును మార్చుకొన్న అశ్విన్.. తర్వాతి కాలంలో స్పిన్నర్‌గా అత్యున్నతస్థాయికి ఎదిగిన తీరు అమోఘం. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడుతున్న సందర్భంలో తన తల్లికి గుండెపోటు వచ్చిందని తెలియడంతో పరామర్శకు వెళ్లి వచ్చి మళ్లీ ఆడడం అశ్విన్ అంకితభావానికి నిదర్శనం.
‘ప్రతి ఒక్కరికీ వీడ్కోలు సమయం వస్తుంది.. ఇప్పుడు నా వంతు’ అని అశ్విన్ మీడియా సమావేశంలో హుందాగా వెల్లడించి ఆట నుంచి తప్పుకొన్నాడు. ప్రతి ఆటగాడు ఏదో ఒకరోజు గుడ్‌బై చెబుతాడు. ఇందులో విశేషమేమీ లేకపోవచ్చు. కానీ, తానెంచుకున్న ఆటపై అతని ప్రభావం ఎంత అనేదే ప్రధానాంశం. 106 టెస్టులాడిన అశ్విన్ 537 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే తర్వాత రెండోస్థానంలో ఉన్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఘనతను 37 పర్యాయాలు అందుకున్నాడు. టెస్టుల్లో పదకొండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నిసార్లు ఈ అవార్డు అందుకున్న ప్రథముడిగా శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్‌తో సమంగా నిలిచాడు. స్పిన్నర్ అంటే తమకు అనుకూలమైన పిచ్‌లపై మాత్రమే ప్రభావం చూపగలరన్న ముద్రను చెరిపేసిన బౌలర్. బంతితోనే కాదు, బ్యాటుతోనూ సత్తాచాటిన ప్రతిభావంతుడు అశ్విన్. ఎన్నో సందర్భాల్లో తనదైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత జట్టు విజయాల్లో తోడ్పాటు అందించిన అతడు నాలుగువేలకు పైగా పరుగులు కూడా రాబట్టాడు. టెస్టుల్లో ఆరుసార్లు శతకాలు సాధించి ఆల్‌రౌండర్‌గానూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ప్రత్యర్థి జట్టును జయించే క్రమంలో సారథి రచించే ప్రణాళికలు, వ్యూహాల్లో ఎన్నోసార్లు భాగస్వామి అయ్యాడు. ఆటను సునిశితంగా పరిశీలిస్తూ, వైవిధ్యమైన ఆలోచనలతో రాజుకు మంత్రి తరహాలో అండగా నిలవడంలోనూ అశ్విన్‌కు మరెవరు సాటిరారు. ఇలా తనకు అంది వచ్చిన ప్రతి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన అతను ఆటకు వందశాతం న్యాయం చేశాడు. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకొన్నాడు. క్రికెట్ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆటను ప్రదర్శించి కెరీర్‌ను పరిపూర్ణంగా ముగించాడు.
Updated Date - Dec 20 , 2024 | 06:25 AM