Political Reform : జమిలితో కొత్త ఎన్నికల వ్యవస్థ
ABN, Publish Date - Dec 21 , 2024 | 03:28 AM
దేశమంతా లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు ఈ ప్రక్రియలో ఒక ముందడుగు వేసింది. డిసెంబర్ 17న జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు–2024,
దేశమంతా లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు ఈ ప్రక్రియలో ఒక ముందడుగు వేసింది. డిసెంబర్ 17న జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు–2024, కేంద్రపాలిత చట్ట సవరణ బిల్లు–2024 అనే రెండు ముసాయిదా బిల్లులను లోక్‌సభలో కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ప్రధాని మోదీ సూచన మేరకు ఈ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించనున్నట్లు మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ స్పష్టం చేశారు. దీని ద్వారా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశాలు కల్పించినట్టు అవుతుందనే భావన కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అందరూ ఊహించినట్లుగానే ఈ బిల్లులు రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నాయంటూ ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇవి రాజ్యాంగ మూల స్వరూపానికి, సమాఖ్య వ్యవస్థకు ఎటువంటి భంగం కలిగించవని పేర్కొంది. ఈ సవరణల ద్వారా రాష్ట్రాల అధికారాలను తగ్గించడం లేదా లాగేసుకోవడం జరగదని స్పష్టం చేసింది. జమిలి ఎన్నికలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. రాజ్యాంగ సవరణలు కూడా చేయాలి కాబట్టి దీనిపై పార్లమెంట్‌లో కూడా పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకేసారి ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయిలో భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉంటుంది కానీ, ప్రాంతీయ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉండదనే భయంతో ఈ జమిలి ఎన్నికల విధానాన్ని సహజంగానే కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తాయి. అందులోనూ మన దేశంలో ఏ విధానం పైనైనా విభేదాలు తలెత్తగానే పార్టీలు ఆరోగ్యకరమైన చర్చను ప్రోత్సహించే బదులు త్వరపడి ఏకపక్ష నిర్ణయానికి వచ్చేస్తాయి. కీలకమైన అంశాలపై సామరస్య వాతావరణంలో చర్చ జరగడం చాలా అరుదవుతోంది. ప్రత్యర్థుల భావాలను సానుభూతితో అర్థం చేసుకునే ప్రయత్నం గానీ, తమ వాదనను సాక్ష్యాధారాలతో హేతుబద్ధంగా వివరించి ఎక్కువమందిని తమ మార్గం వైపు ఆకర్షింపజేసుకునే ప్రయత్నం గానీ మన సమాజంలో కొరవడుతున్నాయి.
దేశమంతా ఒకేసారి ఎన్నికలు అనేది మొత్తం దేశాన్ని ప్రభావితం చేసే అంశం కాబట్టి పార్లమెంట్‌లో పూర్తిస్థాయిలో చర్చ జరగాలి. కేవలం జమిలి ఎన్నికల నిర్వహణ ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసమే అయితే అది వృథా ప్రయాసే అవుతుంది. ఈ విధానంపై ఇప్పుడు సర్వత్రా కనిపిస్తున్న ఆసక్తిని మన ఎన్నికల వ్యవస్థను మెరుగుపరిచే సదవకాశంగా వినియోగించుకోవడం అవసరం. ఎన్నికల సంస్కరణలు అనగానే నేర చరితులు, పార్టీల విరాళాలు, సంపన్న అభ్యర్థులు, నల్ల డబ్బుతో ప్రచారం, ఓట్ల కొనుగోలు తదితర అంశాలన్నీ ప్రస్తావనకు వస్తాయి. తరచి చూస్తే ఇవన్నీ ఒకే సంక్షోభానికి బహురూపాలు. ఒకే రోగానికున్న రకరకాల లక్షణాలు అని కూడా చెప్పుకోవచ్చు. నేతలు వ్యక్తిగతంగా అవినీతి చేసినా, పార్టీ గెలుపు కోసం చేసినా ప్రజలకు మాత్రం నష్టంలో తేడా ఏమీ ఉండదు. పోయేది ప్రజల సొమ్మే. మనం చేస్తున్న తప్పిదం ఏమిటంటే.. మనం కోరుకుంటున్న లక్ష్యాల్ని సాధించుకోవడానికి, తగిన వ్యవస్థల్ని నిర్మించుకోవడానికి కావలసిన సంస్కరణల కోసం ప్రయత్నించకపోవడం.
మన దేశంలో గత ఏడు దశాబ్దాలుగా ప్రజల సమస్యలు మరింత పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ముసుగులో మన దేశంలో జరిగే ఎన్నికలు... ఒక తంతు మాత్రమే అని మనమంతా ఒప్పుకోక తప్పదు. అటు నేతలు, ఇటు ప్రజలు చెరోదిక్కున సమస్యను పెంచి పోషిస్తూ సంక్షోభం దిశగా వెళ్తున్నారు తప్ప, ఈ విష వలయాన్ని ఛేదించే పరిష్కారాల మీద దృష్టి పెట్టడం లేదు. పేదరికంలో ఉన్నవారు ఈ రాజకీయం ఇంతే, అవినీతిపరులైన నేతల నుంచి దక్కిందే చాలు అన్నట్టు ఓటును వృథా చేస్తున్నారు. ఈ రాజకీయం కుళ్లిపోయింది, ఎవరో దైవదూతలు వస్తే తప్ప మార్పు తేవడం కుదరదు అనుకునే చాలామంది ఆలోచనాపరులు, మధ్యతరగతి వారు ఎన్నికల ప్రక్రియ పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. అసలు ఈ వ్యవస్థే మంచిది కాదు, దీన్ని పూర్తిగా కూలదోసి మరో వ్యవస్థను తేవాలని మరికొందరు పిడివాదులు భావిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఉన్న వ్యవస్థను పూర్తిగా కూలదోసి, దాంతో సంబంధం లేకుండా కొత్త వ్యవస్థ వచ్చి విజయవంతమైన దాఖలాలు లేవు. కాబట్టి గతంలో మన వ్యవస్థలోని మంచిని కొనసాగిస్తూ వినియోగించుకుంటూనే, నూతన వ్యవస్థల నిర్మాణం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు ఉన్న ఎన్నికల వ్యవస్థని ప్రక్షాళన చేయాలి.
పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండాలంటే ఇప్పుడైనా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలూ కలిసి కొన్ని కఠిన నిర్ణయాలు, కొన్ని సంస్థాగత నిర్ణయాలు తీసుకోక తప్పదు. మొదటిది– సమర్థులు, నిజాయితీపరులైన అధికారులను ఎంపికచేసి, వారికి తగిన అధికారాలను, సిబ్బందిని ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సహించడం. రెండవది– నేరగాళ్ళను, ముఠా నాయకులను ఎన్నికలకు దూరంగా ఉంచడం. ఆత్మస్తుతి, పరనింద మాని అన్ని రాజకీయ పార్టీలూ ఇకనైనా పరిస్థితిని మార్చడానికి నడుం కట్టాలి. నాలుగు సీట్లు పోయినా ఫర్వాలేదు, మేం మాత్రం మా పద్ధతి మార్చుకుంటున్నాం అని ప్రజలకు ప్రత్యక్షంగా రుజువు చేయగలగాలి.
ఇదే సందర్భంలో ధన రాజకీయాలకు లభిస్తున్న తాత్కాలిక ఆదరణను జన రాజకీయంగా భ్రమింపజేయకుండా... సమర్థులు, నిజాయితీపరులు, ముఖ్యంగా యువత నాయకత్వం బాధ్యతల్ని అందుకోవాలి. వారు వీలున్నంతకాలం చేశాక తమ తర్వాతి తరానికి ఆ బాధ్యతల్ని బదిలీ చేసేలా రాజకీయ, పాలనా, ఎన్నికల వ్యవస్థల్ని మార్చే సంస్కరణల్ని తెచ్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయడం ఇప్పుడు ప్రజల ముందున్న ప్రధాన లక్ష్యం. ఎన్నికల విషయంలో ప్రభుత్వాలు, పార్టీలు, ప్రజలు ఈ వాస్తవాల్ని గుర్తిస్తే... ఖచ్చితంగా జమిలి విధానం ఎన్నికల సంస్కరణలో ఒక కీలక ముందడుగు అవుతుంది.
కూసంపూడి శ్రీనివాస్
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి
Updated Date - Dec 21 , 2024 | 03:28 AM