పాపం.. పుణ్యం.. రాజ్యాంగం!
ABN, Publish Date - Dec 24 , 2024 | 04:52 AM
రాజకీయాలకు అతీతమైన చరిత్ర ఉండదు! అది రోజూ రుజువవుతూనే ఉంది. నేటి రాజకీయ అవసరాలు ఏనాటి చరిత్రనో ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అందుకే చరిత్రను మారని కఠినశిలగా భావించలేం. నిన్నటిదాకా ఘనమైనది నేడు హీనం...
రాజకీయాలకు అతీతమైన చరిత్ర ఉండదు! అది రోజూ రుజువవుతూనే ఉంది. నేటి రాజకీయ అవసరాలు ఏనాటి చరిత్రనో ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అందుకే చరిత్రను మారని కఠినశిలగా భావించలేం. నిన్నటిదాకా ఘనమైనది నేడు హీనం అవుతుంది. మొన్నటి స్మరణీయం నేడు విస్మరణీయం అవుతోంది. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఇదే అర్థమవుతుంది. గడిచిన పదేళ్లలో వందేళ్లకు మించిన విధ్వంసాన్ని తెలంగాణ చూసిందని రేవంత్ పదేపదే చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, భారీ సంస్థలు ఏర్పాటై తెలంగాణ అభివృద్ధికి తోడ్పడ్డాయనీ అంటున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిందని చెబుతున్న ‘పదేళ్ల విధ్వంసానికి’ ముందు తెలంగాణ అభివృద్ధికి గట్టి పునాదులు పడ్డాయన్న భావనను రేవంత్ తన వాగ్ధాటితో బలంగా వినిపిస్తున్నారు. చరిత్రలో సొంత పార్టీ నిర్వహించిన ఘనమైన పాత్రను చెప్పుకోవటం ఏ నేతకైనా అవసరమే! కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన వాదోపవాదాల్లో ఈ తరహా వ్యాఖ్యలు మనకు అంతగా కనపడవు. గతాన్ని గురించి అప్పుడు అందించిన చిత్రం పూర్తిగా భిన్నమైంది! కొంచెం తేడాలతో అన్ని పార్టీల నేతలు ఆంధ్ర పాలకుల విధానాలతో జీవన విధ్వంసం జరిగిందన్న చిత్రాన్నే అందించారు. ఇక ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో చేసిన త్యాగాలకు సముచిత స్థానం ఇవ్వకుండా పదేళ్లు అధికారం చలాయించిన వాళ్ల చరిత్రనే అసలుసిసలు చరిత్రగా ప్రచారం చేస్తున్నారనీ ఇకనైనా దానికి వీడ్కోలు చెప్పాలనీ కూడా రేవంత్ గట్టిగా సూచించారు.
రాజకీయ దృష్టి.. చరిత్రను చూసే తీరును మార్చుతుందనటానికి ఈ వ్యాఖ్యలకు మించిన నిదర్శనం ఉండదు. నిజమైన ప్రజానుకూల పాలన రేవంత్ దృష్టి నుంచి చూస్తే తెలంగాణలో 2023 డిసెంబర్ నుంచే మొదలైంది! ఇక బీఆర్‌ఎస్ దృష్టి నుంచి చూస్తే 2014 నుంచే అసలైన తెలంగాణ చరిత్ర ఆరంభమవుతుంది. అంతకు ముందు అంతా విధ్వంసం.. వనరుల దోపిడి.. సాంస్కృతిక జీవన విచ్ఛిన్నం.. అంతర్గత వలసవాద విధానాల వైపరీత్యం.. 2014 నుంచి 2023 వరకూ తెలంగాణకు స్వర్ణయుగమైతే ఇప్పుడు కటిక చీకటి యుగం నడుస్తోంది.
పరస్పరం కత్తులు దూసుకునే పార్టీలు.. చరిత్రను ఇంతటి విరుద్ధ దృష్టితో చూస్తున్నాయి. ఎవరి దృష్టికి భవిష్యత్తులో ఆమోదం లభిస్తుంది? అసలు భవిష్యత్తులో ఈ రెండు విపరీత దృష్టికోణాలకు సముచిత స్థానం ఉంటుందా? వీటికి పూర్తిగా భిన్నమైన మరో సముచిత, సహేతుక దృష్టికోణం ముందుకొస్తుందా? అన్నవి కీలక ప్రశ్నలు. భవిష్యత్తులో కూడా రాజకీయాలే వాటికి జవాబులను నిర్దేశిస్తాయి. వాటిని బట్టే జవాబులు ఆధారపడి ఉంటాయి. ఏదోలా అధికారాన్ని దక్కించుకోవటమే పరమ లక్ష్యమై.. విపరీత అసమానతలతో కూడిన ఇప్పుడున్న సమాజాన్నే కొనసాగించే పోటీ రాజకీయాలదే పైచేయి అయితే పక్షపాత చరిత్రలే రాజ్యమేలతాయి. స్వర్ణ, చీకటి యుగాల స్వరాలను వైరివర్గాలు వినిపిస్తాయి! జన జీవితాల చరిత్రకు చెందిన అసలు స్వరాలు మాత్రం అట్టడుగున పడిపోతాయి.
రాజకీయ అవసరాలు నిర్దేశించే చరిత్రనే అసలైనదిగా ప్రచారం చేయటంలో ప్రధాని మోదీకి ఎవరూ సాటిరారు. ఆయన దృష్టిలో 2014 తర్వాతే దేశం అన్నిరంగాల్లో సొంత అడుగులు వేస్తోంది. వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వానికి (1998–2004) కొంత మినహాయింపు ఉన్నా 2014 తర్వాతి పాలనతో దాన్ని పోల్చలేం. కేంద్రంలో ఒకనాటి కాంగ్రెస్ పాలన తప్పులతడకల మయం.. అన్ని విధానాల్లోనూ అపసవ్యతలే... విదేశీ విధానంలోనూ అదే ధోరణి.. బానిస ఆలోచనల నుంచి బయటపడలేదు.. భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని గుర్తించలేదు.. ముస్లింలను బుజ్జగిస్తూ హిందువులను చిన్నబుచ్చారు.. సోషలిస్టు విధానాలతో ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించారు.. వ్యాపార చొరవను నీరుగార్చారు.. రాజ్యాంగాన్ని బలహీనపర్చారు.. అవినీతిని వ్యవస్థీకృతం చేశారు.. కుటుంబ పాలనకు తెరతీశారు.. హిందూత్వ జాతీయవాదాన్ని ఎదగనీయలేదు. కుహనా లౌకికవాదాన్ని ప్రోత్సహించారు.. ఇలా చెప్పుకుంటూపోతే మోదీ పేర్కొనే వైపరీత్యాల చిట్టాను ఒక పట్టాన ముగించలేం. ఇవన్నీ ఒకరకమైన చరిత్రనే మనకు చెబుతాయి.
రాజ్యాంగ 75వ అవతరణ దినోత్సవాల సందర్భంగా మోదీ చేసిన విమర్శలూ వ్యాఖ్యలూ చాలా తీవ్రమైనవి. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చివేసి రిజర్వేషన్లను రద్దుచేయటానికి మోదీ ప్రయత్నిస్తున్నారనే ప్రచారమే కాంగ్రెస్‌కు ఇటీవల ప్రధాన అస్త్రంగా మారింది. అందుకే రాజ్యాంగం కేంద్రంగానే కాంగ్రెస్‌పై మోదీ విమర్శలను ఎక్కుపెట్టారు. రాజ్యాంగ సవరణల పాపమంతా కాంగ్రెస్‌దేనని మోదీ బలంగానే వాదించారు. అందుకోసం 75 ఏళ్ల రాజ్యాంగ చరిత్ర నుంచి చాలా విషయాలను తవ్వితీశారు. రాజ్యాంగ మొదటి సవరణనే మహాపాపంగా వర్ణించారు. లేని అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా మొదటి రాజ్యాంగ సవరణకు నెహ్రూ పాల్పడి తాత్కాలిక పార్లమెంటులో దాన్ని ఆమోదింపచేసుకున్నారనీ ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో పూర్తయ్యాయి. అనంతరమే రాజ్యసభ ఉనికిలోకి వచ్చింది. 1952కు ముందు ఉన్నది రాజ్యాంగ పరిషత్తు మాత్రమే. రాజ్యాంగరచన పూర్తయిన తర్వాత దాన్నే తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించారు.
తాత్కాలిక పార్లమెంటుకు రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎక్కడిది అని మోదీ వేసిన ప్రశ్నలో ఔచిత్యాన్ని తేల్చుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాల్సిందే. మొదటి సవరణ చాలా ముఖ్యమైంది. దేన్ని ఆశించి దాన్ని చేశారన్నది నిశితంగా చూడాలి. మన రాజ్యాంగ చరిత్రపై ఇప్పటికే వేల పుస్తకాలు వచ్చాయి. గ్రాన్‌విల్ ఆస్టిన్ రాసిన ‘వర్కింగ్ ఎ డెమక్రాటిక్ కానిస్టిట్యూషన్’ పుస్తకం వాటిల్లో ఎన్నతగినది. ఆస్టిన్ అభిప్రాయం ప్రకారం మొదటి రాజ్యాంగ సవరణ చేయటానికి మూడు అంశాలు ప్రధాన కారణాలు అయ్యాయి. మొదటిది భావప్రకటన సమస్యలకు సంబంధించినది. రెండోది జమిందారీ వ్యవస్థ రద్దు–భూసంస్కరణలకు సంబంధించినది. మూడోది విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించినది. వీటిపై 1950 నాటికి కోర్టులు ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకుని మొదటి సవరణను తీసుకువచ్చారు. భావప్రకటన స్వేచ్ఛకు పరిమితులు విధించటాన్నీ జమిందారీ రద్దు చట్టాలనూ సర్దార్‌పటేల్ సమర్థించారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పువచ్చే నాటికి పటేల్ చనిపోయారు. ఇక న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేడ్కర్ ఈ మూడు అంశాలకు సంబంధించిన సవరణలను పూర్తిగా సమర్థించారు. అప్పటికే కొన్ని రాష్ట్రాలు తీసుకువచ్చిన భూసంస్కరణల బిల్లులను వ్యతిరేకిస్తూ జమిందార్లు కోర్టులకు వెళ్లారు. తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందనీ వాదించారు. అనుకూల తీర్పులూ వచ్చాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని రూపొందించిన బిహార్ భూసంస్కరణల చట్టాన్ని హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ రవాణా సర్వీసులను వ్యతిరేకిస్తూ కూడా కేసులు దాఖలయ్యాయి. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలను పెద్దఎత్తున ఏర్పాటు చేయబోయే మొత్తం ప్రక్రియకే ఆటంకం కలగుతుందని ప్రభుత్వం భయపడింది. 1948లో రూపొందించిన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయలేని పరిస్థితి తలెత్తుతుందని ఆదుర్దా చెందింది. మరోవైపు మద్రాస్ రాష్ట్రంలోని రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టూ సమర్థించింది.
సామాజిక, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కోర్టుల నుంచి తగులుతున్న ఎదురుదెబ్బలు ఒకవైపు ఉంటే మరోవైపు మత, ప్రాంతీయ తత్వాల ప్రచారం ఊపందుకుంది. అప్పటికే కొన్ని రాష్ట్రాలు తీసుకువచ్చిన ప్రజాభద్రతా చట్టాలను కోర్టులు కొట్టివేశాయి. వామపక్ష అనుకూల ‘క్రాస్‌రోడ్స్’ మ్యాగజీన్‌ను నిషేధించిన ఉత్తర్వును కొట్టివేస్తూ మద్రాస్ ప్రజాభద్రతా చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమైందిగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు శ్యామప్రసాద్ ముఖర్జీ దేశవిభజనను రద్దుచేయాలనే డిమాండును వినిపించటం ప్రారంభించారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భావప్రకటనా స్వేచ్ఛను (ఆర్టికల్ 19) మరింతగా పరిమితం చేయాలని నిర్ణయించారు. ప్రజాభద్రతకు భంగం కలిగించే ప్రమాదం, నేరానికి పురికొల్పే అవకాశం ఉన్నప్పుడు భావప్రకటన స్వేచ్ఛపై సహేతుక పరిమితులు విధించవచ్చంటూ సవరణ సందర్భంగా చేర్చిన నిబంధనలను తర్వాతి కాలంలో ప్రభుత్వ వ్యతిరేక అసమ్మతిని అదుపులో పెట్టటానికి విస్తృతంగా ఉపయోగించారు. అలా కొంత దుర్వినియోగమూ జరిగింది.
మొదటి సవరణతో రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూలు అదనంగా చేరింది. భూసంస్కరణల చట్టాలను కోర్టుల నుంచి రక్షించటానికి దాన్ని తీసుకువచ్చినా తర్వాత వేరే అవసరాలకూ వాడారు. ఇక అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ తొలి రాజ్యాంగ సవరణ బిల్లుని అడ్డుకోటానికి చాలా ప్రయత్నించారు. గత్యంతరంలేని పరిస్థితుల్లోనే దానికి ఆమోదముద్ర వేశారు. హిందూ కోడ్ బిల్లు విషయంలోనూ అలాగే వ్యవహరించారు. మొదటి సవరణను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రముఖులు. ఒకరకంగా చూస్తే ముఖర్జీ, రాజేంద్రప్రసాద్‌ల అభిప్రాయాలనే మోదీ పునరుద్ఘాటించారు. వాటిని ఆనాటి తాత్కాలిక పార్లమెంటే ఖాతరు చేయలేదు. సవరణకు అనుకూలంగా 228 ఓట్లు వస్తే వ్యతిరేకంగా 20 ఓట్లు మాత్రమే వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా చివరకు సవరణను సమర్థించింది. రాజ్యాంగాన్ని రూపొందించిన సభకు దాన్ని మార్చే అధికారం ఉందనీ స్పష్టంచేసింది.
సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ను విమర్శించటానికి చాలా విషయాలు ఉన్నాయి. స్వాతంత్య్ర ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలతో, ప్రకటించిన లక్ష్యాలతో సాధించిన ప్రగతిని తూకంవేస్తే కాంగ్రెస్ వెలుగునీడలు స్పష్టంగా కనపడతాయి. పరిమితులెన్ని ఉన్నా మొదటి రాజ్యాంగ సవరణ మొత్తాన్ని తప్పుపట్టలేం. కనీసస్థాయి ప్రగతిశీల దృక్పథంతో చూసినా అదే తేలుతుంది. సామాజిక, ఆర్థిక న్యాయ సాధనలో ఆనాటికి అదొక ముందడుగు. ఆ అడుగు అడుగే కాదనీ మొత్తం రాజ్యాంగ సవరణనే మహాపాపంగా చూస్తే పటేల్, అంబేడ్కర్‌ల పాత్రనూ అందులో తోసిపుచ్చలేం! పాక్షిక దృష్టితో చరిత్రను చూడటం ఎప్పుడూ తేలికే! సమగ్ర దృష్టితో చూడటం ఎప్పుడూ కష్టమే!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
Updated Date - Dec 24 , 2024 | 04:52 AM