అందుకో దండాలు అంబేడ్కరా!
ABN, Publish Date - Dec 20 , 2024 | 01:16 AM
‘ట్రై నాట్ టు స్పిట్ ఆన్ స్కై’ అంటూ ఈ రోజు ఉదయం మా ఇంటి ముందు ఒక పదేళ్ళ అమ్మాయి, అబ్బాయి ఒకరి తరువాత ఒకరు బిగ్గరగా ఉచ్చరిస్తూ కనిపించారు. పిల్లలకు దాని అర్థం తెలుసో తెలియదో...
‘ట్రై నాట్ టు స్పిట్ ఆన్ స్కై’ అంటూ ఈ రోజు ఉదయం మా ఇంటి ముందు ఒక పదేళ్ళ అమ్మాయి, అబ్బాయి ఒకరి తరువాత ఒకరు బిగ్గరగా ఉచ్చరిస్తూ కనిపించారు. పిల్లలకు దాని అర్థం తెలుసో తెలియదో.. కానీ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను దేశ ప్రజలు పదే పదే ప్రస్తావిస్తూ, ఆయన రచనలు, ఆలోచనలు, ఉద్యమాలు, ఆచరణ గురించి కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా మాట్లాడుతున్నారు. బాబాసాహెబ్ అంతరాల నిచ్చెనమెట్ల వ్యవస్థ దౌర్జన్యాలపై అవిశ్రాంత పోరాటం చేసిన యోధ. కరుణా! ప్రజ్ఞ! సమతలను సమాజం అవలంబించాలన్న నవ బౌద్ధుడు. బాబాసాహెబ్ అనుభవించిన అంటరానితనం, వివక్ష, తిరస్కారం, సంఘజీవన బహిష్కారం వందేళ్ళ నుంచీ మారలేదు. వివిధ రూపాల్లో కరుడుగట్టుకుపోయింది. పాలనా రంగం మతం ఊబిలో దిగబడి క్రూరంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చి తమ ధర్మం, మతం అంటూ దేశ ప్రజలను ఒత్తిడికీ, అలజడికీ గురిచేస్తున్నది. ఓట్ల కోసమైతే సమతా రాగం.. ఏరు దాటిన తరవాత వికృతమైన పరిహాసాలతో ప్రజలను పదే పదే అవమానించడం.
ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత జన సమూహాలు ఇస్తున్నాయో ఆ వ్యక్తులపై అసూయతో పాలకులు రగిలిపోతున్నారు. లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడవలసిన రాజకీయ జనజీవన స్రవంతిని సమూలంగా కలుషితం చేసి, దారి మళ్ళించాలని కుట్రలు పన్నుతున్నారు.
అత్యుత్తమైన మన రాజ్యాంగాన్ని రచించిన మేధావి, అధ్యయనశీలి, ఆర్థికవేత్త, న్యాయశాస్త్ర కోవిదుడు, రచయిత బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన పట్లా అక్కసేనా? అంత వెరుపా? దేశ ప్రజల మనోభావాలు ఎంతగా దెబ్బతింటున్నాయో పట్టించుకోరా.. నీచమైన మీ వికారాలు ఎంత రోత పుట్టిస్తాయో పట్టించుకోరా? అధికార బలం ఉందికదా అని తప్పుడు మాటలు మాట్లాడినా, ఆకాశాన్ని చూసి అంత ఎత్తా అని పైకి రాయి విసిరినా, ఏం జరుగుతుందో వివేకంతో ఆలోచించండి! మహాత్మా పూలేను తన గురువుగా భావించిన భారతరత్నపై మీ లోపల ఏ భావాలు ఉన్న నోరు పారేసుకుంటూ కన్నెత్తి చూసే దుస్సాహసానికి పూనుకొని మీ తలకు మీరే కొరివి పెట్టుకోకండి.
అందుకో దండాలు బాబాసాహెబ్ అంబేడ్కరా!
అనిశెట్టి రజిత
Updated Date - Dec 20 , 2024 | 01:16 AM