ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అధికారం చుట్టూ అదే పరుగు!

ABN, Publish Date - Dec 19 , 2024 | 02:10 AM

అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు మాసాలు గడిచాయో లేదో, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ‘మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కండి!’ అన్న ధోరణిలోనే పార్టీ శ్రేణులకు...

అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు మాసాలు గడిచాయో లేదో, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ‘మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కండి!’ అన్న ధోరణిలోనే పార్టీ శ్రేణులకు పిలుపు ఇవ్వటం చూస్తుంటే – లేచిందే లేడికి పరుగు అన్న సామెత గుర్తొస్తుంది. మరో అడుగు ముందుకు వేసి 2027లోనే జమిలి ఎన్నికలు వస్తున్నాయని, 40 శాతం ఓటు బ్యాంకు ఉందంటూ పార్టీ శ్రేణులను పుష్‌ చేయటం గమనార్హం. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ళ పరిపాలనా కాలాన్ని కడుపులో నీళ్ళు కదలకుండా పూర్తి చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలతో మాట్లాడేందుకు, మీడియాను అడ్రస్‌ చేసేందుకు కూడా రాలేదు. ఎక్కువ కాలం తాడేపల్లిలోనే గడిపేవారు. వై నీడ్‌ జగన్‌ అని ఇంటింటికీ తన బొమ్మ పంపి ప్రచారం చేశారు. వై నాట్‌ 175 అనీ చెప్పారు. చొక్కాలు మడతెయ్యండి అన్నారు. చంద్రబాబు కుప్పంలో గెలవడని, లోకేష్‌ మంగళగిరిలో గెలవడని, పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురంలో ససేమిరా గెలవడనీ మంత్రివర్గ సహచరులతో హల్‌చల్‌ చేయించారు. చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీ కథ సమాప్తం అవుతోందని కౌరవ వ్యూహాలు రచించారు. ఆయన పన్నిన అన్ని రాజకీయ వ్యూహాలూ బెడిసికొట్టాయి. ఊకదంపుడు ఉపన్యాసాలు ఫలించలేదు. ఆయన ఉత్తర కుమార ప్రగల్భాలు ఏవీ నెరవేరలేదు. ఫలితంగా 151 సీట్ల అరుదైన బలం కాస్తా 11 స్థానాలకు పడిపోవటంతో


ప్రతిపక్ష హోదా కోసం అధికార పార్టీని అడుక్కోవటం, కోర్టుకు వెళ్ళి హోదా ఇప్పించమని ప్రాధేయపడటం మొదలుపెట్టారు. ఇంత జరిగినా ఓటమికి ఉన్న కారణాలను జగన్‌ ఏ ఒక్క రోజూ పార్టీ సమావేశం పెట్టి సమీక్షించ లేదు. పోనీ ఆయన కూడా ఎందుకు ఓడామో, పార్టీ శ్రేణులకు చెప్పలేదు. ఈవీఎంల మాయ అని ఒకసారి, 40 శాతం ఓట్ల బలం ఉందని ఒకసారి, సూపర్‌ సిక్స్‌ పథకాలతో చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చారని ఇంకోసారి ప్రచారం మొదలు పెట్టారు. తనను తాను తగ్గించుకోకుండా, తక్కువ కాకుండా మాట్లాడటం ఆయనకు స్వతహాగా ఉన్న వింత వైఖరే. ఆయన పాలనలో తీసుకున్న తుగ్లక్‌ నిర్ణయం మూడు రాజధానుల అంశం. ఈ అంశాన్ని వెనక్కి తీసుకున్నారా, మళ్ళీ మూడు ముక్కల ఆటతోనే ముందుకు వెళతారా? అన్న అంశంపై కూడా స్పష్టత లేదు.


ఐదేళ్ళ పాలనలో జరిగిన పాలనా విధ్వంసంపై నోరు మెదపరు. మరోవైపు చెరువుకు గండి పడ్డట్టు వై‍సీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పొలోమంటూ ఇతర పార్టీల వైపు పరుగులు తీస్తున్నా, ఉంటే ఉండండి, పోతే పోండి అన్న తరహాలోనే ఉన్నారు. రేపోమాపో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి, అందరూ ఎలర్ట్‌గా ఉండమని, చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ ఇవ్వలేడు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, అది మనపై ప్రేమగా మారుతుందని అసంబద్ధ ఆలోచనలతోనే ఉండటం గమనార్హం. ఏ ప్రభుత్వానికి ఐనా ఒకసారి అధికారం పోయిన తరువాత రాజకీయ పరిణతి పెరగాలి. ప్రజలు చాలా నిశితంగా పరిశీలిస్తారు అన్న జ్ఞానం కలగాలి. ఈ రెండూ మాజీ సీఎంకు లేకపోవటం వైసీపీ దురదృష్టం. ప్రజాస్వామ్యంలో ఎన్ని సీట్లు వచ్చినా, ప్రజలు ఇచ్చిన సీట్లను బాధ్యతగా భావించి అసెంబ్లీకి వెళ్ళాలి. లేకపోతే రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి. కూతవేటు దూరంలో ఉన్న అసెంబ్లీని ఎగ్గొట్టి, నాలుగు గోడల మధ్య పాత్రికేయుల మీటింగ్‌లు పెడితే ఏం ప్రయోజనం? ఇలా ప్రజాస్వామిక నడక లేకుండా, ‘అంతా నా ఇష్టం’ అన్నట్లు వ్యవహరిస్తే, మళ్ళీ అవే ఫలితాలు వస్తాయి.

పోతుల బాలకోటయ్య

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు

Updated Date - Dec 19 , 2024 | 02:10 AM