LokSabha Elections: సోరెన్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు..!
ABN, Publish Date - May 22 , 2024 | 02:41 PM
భూ కుంభకోణం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బుధవారం సోరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఎదుటకు వచ్చింది.
న్యూఢిల్లీ, మే 22: భూ కుంభకోణం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బుధవారం సోరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఎదుటకు వచ్చింది.
నిజాలను తొక్కి పెట్టి బెయిల్ కోసం ట్రయిల్ కోర్టును సోరెన్ ఆశ్రయించారని బెంచ్ ఈ సందర్బంగా అభిప్రాయపడింది. సోరెన్ మచ్చ లేని వ్యక్తి కాదని పేర్కొంది. సోరెన్ చాలా విషయాలను దాచారని పేర్కొంది. అయితే ఈ పిటిషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. లేకుంటే ఈ పిటిషన్ డిస్మిస్ చేయవలసి ఉంటుందని సోరెన్ తరపు న్యాయవాది కపిల్ సిబల్‌కు వెకేషన్ బెంచ్ సూచించింది. జార్ఖండ్ ట్రెయిల్ కోర్టులో మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా ప్రాధమిక సాక్ష్యాధారాలున్నాయని సదరు బెంచ్ ఈ సందర్బంగా గుర్తు చేసింది.
అలాగే డిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఈ సందర్బంగా వెకేషన్ బెంచ్ ప్రస్తావించింది. అంతేకాదు.. కేజ్రీవాల్ వ్యవహారంలో, హేమంత్ సోరెన్ వ్యవహారంలో ఉన్న వ్యత్యాసాన్ని వెకేషన్ బెంచ్ ఈ సందర్బంగా విపులీకరించింది.
ఆ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఏ విధమైన న్యాయ పరమైన చిక్కులు లేవని పేర్కొంది. కానీ హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద జార్ఖండ్ ట్రయిల్ కోర్టులో కేసు ఉందని.. దులోభాగంగా సోరెన్‌కు బెయిల్ నిరాకరిస్తున్నట్లు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. మరోవైపు ఏప్రిల్ 4వ తేదీన సోరెన్‌కు సంబంధించిన ప్రాధమిక సాక్ష్యాలపై జార్ఖండ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను వెకేషన్ బెంచ్ ఈ సందర్భంగా ప్రస్తావించింది.
దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వివిధ దశల్లో జరుగుతొంది. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని.. దాంతో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలో సోరెన్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్‌పై విధంగా స్పందించింది.
ఇంకోవైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ సైతం ఎన్నికల ప్రచారం కోసం తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మే 10న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2వ తేదీ తిరిగి లొంగిపోవాలని తన ఆదేశాల్లో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం విధితమే.
భూకుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య కల్పనా సోరెన్.. జార్ఖండ్ ముక్తి మోర్చ తరఫున రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే గాంధీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్పన బరిలో దిగారు.
Updated Date - May 22 , 2024 | 05:30 PM