Health: భోజనానికి ముందు, తరువాత టీ, కాఫీలు తాగొద్దు! ఎందుకో తెలుసా?
ABN, Publish Date - May 14 , 2024 | 09:58 PM
భోజనానికి ముందు, తరువాత వెంటనే కాఫీ లేదా టీ తాగొద్దని ఐసీఎమ్ఆర్ సూచించింది. వీటిల్లోని పాలీఫినాల్స్, టానిన్స్.. శరీరం ఐరన్‌ను గ్రహించకుండా అడ్డుపడతాయని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆహార నియమాలకు (Health Tips) సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్‌ఆర్) ఇటీవల కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రకరకాల ఆహార పదార్థాలు ఉన్న సమతుల భోజనం తినాలని సూచించింది. దీంతో పాటు కాఫీ, టీలకు సంబంధించి కీలక సూచన చేసింది. భోజనానికి ముందు, తరువాత గంట వ్యవధిలో కాఫీ లేదా టీ తాగొద్దని పేర్కొంది.
ఐసీఎమ్‌ఆర్ ప్రకటన ప్రకారం, టీ, కాఫీల్లో కెఫీన్ అధికంగా ఉంటుంది. కెఫీన్ మెదడు మీద పనిచేస్తుంది. ఫలితంగా టీ తాగిన వెంటనే ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది. చివరకు ఇది అలవాటుగా మారి కాఫీ, టీ తాగనిదే తోచని పరిస్థితి వస్తుంది. అయితే, టీ, కాఫీల్లో పాలీఫీనాల్స్, టానిన్స్ వంటి రసాయనాలు కూడా ఉంటాయి. ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించకుండా ఇవి అడ్డుపడతాయి. కాబట్టి, భోజనానికి ముందు, తరువాత వెంటనే కాఫీ, టీలు తాగొద్దని ఐసీఎమ్ఆర్ హెచ్చరించింది.
Omega-3: శాఖాహారులలో ఒమేగా-3 లోపమా? ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
కాఫీ, టీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఐసీఎమ్ఆర్ పేర్కొంది. రోజుకు 300 మిల్లీగ్రాములకు మించి కెఫీన్ తీసుకోకూడదని పేర్కొంది. కప్పు కాఫీలో గరిష్ఠంగా 120 మిల్లీ గ్రాముల కెఫీన్, టీలో గరిష్ఠంగా 65 మిల్లీ గ్రాముల కెఫీన్ ఉంటుందని పేర్కొంది. కాబట్టి, భోజనానికి గంట ముందు, గంట తరువాత ఎట్టి పరిస్థితుల్లో కాఫీ తాగొద్దని పేర్కొంది. ఇక శరీరంలో ఐరన్ లోపిస్తే నీరసం, ఆయాసం, గుండెదడ, తలనొప్పి, చర్మం రంగు పాలిపోయినట్టు ఉండటం వంటి సమస్యలు వస్తాయని పేర్కొంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - May 14 , 2024 | 10:00 PM