పిల్లల్లో రోగ నిరోధకశక్తి పెరగాలంటే...
ABN, Publish Date - Dec 15 , 2024 | 09:31 AM
పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా రోగ నిరోధకశక్తి పెరగడానికి మంచి ఆహారపు అలవాట్లే కాక ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా ముఖ్యం. పిల్లల ఆహారంలో తగినంత శక్తినిచ్చే పదార్థాలు, ప్రొటీన్లు లేకపోయినా రోగ నిరోధకశక్తి తగ్గుతుంది.
ఈ తరం పిల్లలు కాలంతో సంబంధం లేకుండా తరచూ జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. వారిలో రోగ నిరోధకశక్తి పెరగాలంటే ఏమి చేయాలి?
- యశ్వంత్, నల్గొండ
పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా రోగ నిరోధకశక్తి పెరగడానికి మంచి ఆహారపు అలవాట్లే కాక ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా ముఖ్యం. పిల్లల ఆహారంలో తగినంత శక్తినిచ్చే పదార్థాలు, ప్రొటీన్లు లేకపోయినా రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు వంటి అన్ని రకాల ధాన్యాలు... బాదాం, పిస్తా, ఆక్రోట్, వేరుశెనగ వంటి గింజలు... గుడ్లు, పాలు, పెరుగు, చికెన్, చేప వంటి మాంసాహారం... రకరకాల ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు అన్నీ కూడా సమ తులాహారమే.
విటమిన్లు ఎ, సి, ఈ, ఫోలిక్ ఆసిడ్ ఉండే గింజలు, పళ్ళు, ఆకు కూరలు తప్పనిసరిగా ప్రతిరోజూ తీసుకోవాలి. జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు కూడా ఈ సమతులాహారం నుంచి లభిస్తాయి. అధికబరువు, ఊబకాయానికి కారణమయ్యే ఫాస్ట్‌ఫుడ్స్, చిప్స్, బేకరీ ఫుడ్స్, స్వీట్స్, చాకోలెట్స్ మొదలైనవి రోగ నిరోధకశక్తిని తగ్గిస్తాయి. పిల్లలు కనీసం రోజుకు రెండుగంటలైనా ఆటలాడడం వలన వారి రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. అరగంట ఎండలో ఆడడం వలన ఇమ్యూనిటీకి అవసరమైన విటమిన్ డీ కూడా అందుతుంది. సమయానికి ఆహారం, తగినంత నిద్ర తప్పనిసరి.
నలభై ఏళ్ళు దాటిన తరువాత ఆడవాళ్ళలో రక్తహీనత, నరాల బలహీనత రాకుండా ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
- మాధురి, హైదరాబాద్
సాధారణంగా రక్తహీనత లేదా రక్తలేమి అనేది రక్తంలో ఎర్రరక్త కణాలు ఆరోగ్యంగా లేకపోవడం వలన వస్తుంది. దీనినే ‘అనీమియా’ అంటారు. దీనికి ప్రధాన కారణం ఐరన్ లోపం. ఐరన్ బాగా తక్కువగా ఉన్నప్పుడు కేవలం ఆహారంలో మార్పులతో దానిని పెంచడం సాధ్యం కాదు. మందులు లేదా సప్లిమెంట్లు వాడాలి. అయితే మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఐరన్ మళ్లీ పడిపోకుండా స్థిరపడేలా చూసుకోవచ్చు. మాంసాహారులైతే కోడి, చేప వంటివి వారానికి కనీసం మూడుసార్లు తీసుకుంటే తగినంత ఐరన్ లభిస్తుంది.
శాకాహారులైతే అన్నిరకాల పప్పులు, నల్ల శనగలు, అలసందలు, ఉలవలు, సోయాబీన్స్, చిక్కుళ్లు మొదలైన గింజలను ప్రతిరోజూ తీసుకోవాలి. ఇంకా ప్రతి పూటా తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకు కూరలు తప్పనిసరి. వైద్యుల సలహాతో ఐరన్ సప్లిమెంట్లు (టాబ్లెట్లు లేదా టానిక్) ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. వాటితో పాటుగా నిమ్మ, నారింజ, కమలావంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను లేదా పండ్ల రసాలు తీసుకుంటే... మందులలోని ఐరన్‌ను శరీరం పూర్తి స్థాయిలో పీల్చుకోగలుగు తుంది. నరాల బల హీనత రాకుండా ఉండాలంటే బి 12 అధికంగా ఉండే మాంసాహారం, పాలు, పెరుగు, పనీర్, గుడ్డు మొదలైనవి దైనందిన ఆహారంలో భాగం కావాలి.
శాకాహారులు బీ 12 కొరకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
- చంటి, కిష్టారెడ్డిపేట
న్యూరాన్ల ఆరోగ్యానికి, వివిధ జీవప్రక్రియలు సక్రమంగా ఉండేందుకు, జన్యు పదార్థమైన డిఎన్‌ఏ తయారీ వంటి వాటికి బీ 12 చాలా అవసరం. పెద్దలకు రోజుకు 2.4 మైక్రోగ్రాముల బీ 12 అవసరం. గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు అవసరమైన పరిమాణంలో కొంచెం తేడాలుంటాయి. దీర్ఘకాలికంగా తగినంత బీ 12 అందనపుడు శారీరక, మానసిక పరిణామాలుంటాయి. నరాల బలహీనత, చేతులు కాళ్ళు తిమ్మిర్లుగా ఉండడం, జ్ఞాపకశక్తి, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, నీరసంగా ఉండడం, ఏ పనిమీదా ఆసక్తి ఉండకపోవడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
కేవలం ఆహారంలో బీ 12 లేకపోవడమేకాక కొన్నిసార్లు ఆహారంలోని బీ 12 శరీరం శోషించుకోలేకపోయినా సమస్య వస్తుంది. అరవయ్యేళ్లు దాటిన వారిలో పోషకాలను శోషించే శక్తి తగ్గుతుంది కాబట్టి వారికి బీ 12 లోపం ఉండే అవకాశం ఎక్కువ. శాకాహారం నుంచి లభించదు. మాంసం, గుడ్లు, పాలు, పెరుగు, పన్నీర్ వంటి ఆహారం నుంచి మాత్రమే బీ 12 లభిస్తుంది. ఆహారంలో తగినంత బీ 12 అందనపుడు నిపుణుల సలహాతో సప్లిమెంట్లను తీసుకోవాలి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
Updated Date - Dec 15 , 2024 | 09:31 AM