Vitamin-D: విటమిన్-డి సప్లిమెంట్లను రోజూ తీసుకున్నా కొందరికి పనిచేయవు ఎందుకని..
ABN, Publish Date - Oct 24 , 2024 | 08:19 PM
చాలామంది విటమిన్-డి లోపాన్ని అధిగమించడానికి సప్లిమెంట్లు వాడుతుంటారు. ఇవి వాడినా కొందరికి ఎలాంటి ఫలితం కనిపించదు.
ఈ మధ్యకాలంలో విటమిన్ల గురించి అవగాహన బాగా పెరిగింది. శరీరానికి అవసరమైనంత విటమిన్లు లభించకపోతే శరీరంలో ఏదో ఒక ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. అలాగే శరీర పనితీరు కూడా దెబ్బతింటుంది. శరీరానికి ముఖ్యమైన విటమిన్లలో విటమిన్-డి ఒకటి. ఇది ఎముకల ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. శరీరం లేత సూర్య కిరణాలకు గురైనప్పుడు శరీరంలో విటమిన్-డి తయారవుతుంది. అయితే ఇప్పటి బిజీ జీవితాలలోనూ, ఉద్యోగాల దృష్ట్యా సూర్యరశ్మిలోకి వెళ్ళడం తగ్గిపోయింది. ఇక అపార్ట్మెంట్లలో నివాసం ఉండటం వల్ల ఉదయం నుండి రాత్రి వరకు ఎండ అనేది తెలియకుండా జీవితాలు గడిచిపోతున్నాయి. ఈ కారణం వల్ల విటమిన్-డి లోపం చాలామందిలో ఉంటోంది. ముఖ్యంగా మహిళలలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది విటమిన్-డి లోపాన్ని అధిగమించడానికి సప్లిమెంట్లు వాడుతుంటారు. ఇవి వాడినా కొందరికి ఎలాంటి ఫలితం కనిపించదు. దీనికి గల కారణాలను వైద్యులు తెలిపారు.
Skin Care: నారింజ తొక్కలు ఇలా వాడితే.. మచ్చలు లేని చర్మం గ్యారెంటీ..
విటమిన్-డి సప్లిమెంట్లు తీసుకున్నా అవి పనిచేయకపోవడానికి ప్రధాన కారణం జీవ లభ్యత. అంటే ఎన్ని పోషకాలు కలిగిన ఆహారం తీసుకున్నా సరే.. ఆహారంలో పోషకాలను శరీరం గ్రహించగలగాలి. విటమిన్-డి కొవ్వులో కరికే విటమిన్. విటమిన్-డి ని శరీరం గ్రహించాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవాలి. తక్కువ కొవ్వులు ఉన్న ఆహారం తీసుకునే వ్యక్తులు ఉదరకుహుర వ్యాధి, క్రోన్స్ వంటి కొవ్వు శోషణను దెబ్బతీసే సమస్యలతో ఇబ్బంది పడేవారు విటమిన్-డి ని గ్రహించలేరు. అందుకే విటమిన్-డి సప్లిమెంట్లు తీసుకున్నా వారి శరీరంలో ఎలాంటి మార్పు ఉండదు.
విటమిన్-డి సప్లిమెంట్లు తీసుకున్నా.. ఆ సప్లిమెంట్ రకం కూడా దాని శోషణను ప్రభావితం చేస్తుంది. విటమిన్-డి లో రెండు రకాలు ఉంటాయి. వాటిలో విటమిన్-డి2 ఒకటి కాగా.. విటమిన్-డి3 మరొకటి. విటమిన్-డి2 ను ఎర్గోకాల్సిఫెరోల్ అని, విటమిన్-డి3 ని కొలెకాల్సిఫెరోల్ అని అంటారు. విటమిన్-డి2 కంటే విటమిన్-డి3 బలమైనది.
Ghee Coffee: నెయ్యి కాఫీ బరువు తగ్గడంలో నిజంగా సహాయపడుతుందా..
మోతాదు..
విటమిన్-డి మోతాదు అందరికీ ఒకే మొత్తంలో సరిపోదు. వ్యక్తి వయసు, బరువు, నివసించే ప్రదేశాన్ని బట్టి విటమిన్-డి అవసరం మారుతుంది. చాలామంది పెద్దలకు 600 నుండి 800 యూనిట్ల విటమిన్-డి అవసరం అవుతుంది. విటమిన్-డి లోపం ఉన్నా, ఏవైనా ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులలో 1000 నుండి 2000 యూనిట్లు కూడా సరిపోదు. రక్త స్థాయిలను పరిశీలించకుండా విటమిన్-డి ని ఎక్కువ తీసుకొంటున్నారో లేదా తక్కువ తీసుకొంటున్నారో తెలుసుకోవడం అసాధ్యం అవుతుంది. ఈ కారణంగా చాలామంది విటమిన్-డి ని ఎక్కువ లేదా తక్కువ తీసుకోవడం జరుగుతోందని పరిశోధనలు చెబుతున్నాయి.
జన్యు కారణాలు..
విటమిన్-డి సప్లిమెంట్లు తీసుకున్నా అవి శరీరానికి వంటకపోవడం లేదా శరీరం గ్రహించక పోవడం అనేది జన్యు కారణాల వల్ల కూడా జరుగుతుంది. శరీరంలో ఉండే VDR జన్యువు శరీరం విటమిన్-డి ని ఎలా ప్రాసెస్ చేస్తుందో, ఎలా ఉపయోగిస్తుందో నిర్దేశిస్తుంది. ఈ జన్యువు వ్యక్తికి, వ్యక్తికి వేర్వేరుగా ఉంటుంది. సూర్యరశ్మితో సంబంధం లేకుండా కొంతమంది వ్యక్తులు విటమిన్-డి లోపాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తులు విటమిన్-డి లోపాన్ని అధిగమించాలంటే ఎక్కువ మోతాదులో సప్లిమెంట్లు అవసరం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
White Hair: ఈ 5 సూపర్ ఫుడ్స్ తినండి చాలు.. తెల్లజుట్టు మంత్రించినట్టు మాయమవుతుంది..
దక్షిణ భారతదేశంలో తప్పక చూడాల్సిన 7 దేవాలయాలు ఇవి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 24 , 2024 | 08:19 PM