పాకిస్థాన్‌లో ఫిదాయీ దాడి.. 27 మంది దుర్మరణం
ABN, Publish Date - Nov 10 , 2024 | 03:46 AM
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మానవబాంబు దాడిలో 27మంది దుర్మరణంపాలయ్యారు. వారిలో 14మంది సైనికులు ఉన్నారు. మరో 62 మంది తీవ్రగాయాలపాలవ్వగా.. వారిలో 46మంది జవాన్లు ఉన్నారు.
మృతుల్లో 14 మంది సైనికులు
బలూచిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో సైనికులే లక్ష్యంగా మానవబాంబు
62 మందికి గాయాలు
ఇస్లామాబాద్, నవంబరు 9: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మానవబాంబు దాడిలో 27మంది దుర్మరణంపాలయ్యారు. వారిలో 14మంది సైనికులు ఉన్నారు. మరో 62 మంది తీవ్రగాయాలపాలవ్వగా.. వారిలో 46మంది జవాన్లు ఉన్నారు. క్షతగాత్రుల్లో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బలూచిస్థాన్ ఐజీ మహమ్మద్ జా అన్సారీ, క్వెట్టా ఎస్పీ మహమ్మద్ బలూచీ కథనం ప్రకారం.. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో నెలరోజులుగా క్వెట్టా-పెషావర్ మధ్య రైలు సేవలు నిలిచిపోయాయి. శనివారం ఉదయమే అధికారులు భారీ భద్రత నడుమ సర్వీసులను పునఃప్రారంభించారు. దాంతో 100 మందికిపైగా ప్రయాణికులు ఉదయమే రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఉదయం 8.25 గంటల సమయంలో టికెట్ కౌంటర్, ప్లాట్‌ఫామ్ మధ్యలో జవాన్లే లక్ష్యంగా ఓ ఫిదాయి(ఆత్మాహుతి దళం) తనను తాను పేల్చుకున్నాడు.
ఈ పేలుడు కారణంగా 27 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. వారిలో 14 మంది జవాన్లున్నారని, రైల్వేస్టేషన్‌లో భద్రత బలగాలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు గుర్తించామన్నారు. కాగా.. ఈ ఘటనకు తమదే బాధ్యత అని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది. ఓవైపు బీఎల్‌ఏ, మరోవైపు ఆఫ్ఘానిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్(టీటీపీ) ఖైబర్ పంఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లలో పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దా డులు జరుపుతున్నాయి. బీఎల్‌ఏ ప్రధాన పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్‌కు సంబంధాలు, రవాణా నెట్‌వర్క్‌ను కట్ చేసేలా బాంబుదాడులు చేస్తోంది. కోల్‌పూర్-మాచ్ రైల్వే బ్రిడ్జిని ఆగస్టు 26న పేల్చేసింది.
Updated Date - Nov 10 , 2024 | 03:46 AM