Kuwait fire accident: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం, క్షతగాత్రుల్లో పలువురు భారతీయులు
ABN, Publish Date - Jun 12 , 2024 | 04:37 PM
దక్షిణ కువైట్ లోని మంగాఫ్ నగరంలో బుధవారం తెల్లవారు జామున 6 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో 41 మంది సజీవదహనమయ్యారు.
మంగాఫ్: దక్షిణ కువైట్ (Kuwait)లోని మంగాఫ్ (Mangaf) నగరంలో బుధవారం తెల్లవారు జామున 6 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో 41 మంది సజీవదహనమయ్యారు. మరో 50 మంది వరకూ గాయపడ్డారు. ఇందులో 30 మందికి పైగా భారతీయ కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.
మంటలు అంటుకున్న భవనంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారని, చాలా మందిని రక్షించినప్పటికీ మంటలు దట్టంగా వ్యాప్తించడం, పొగ అలుముకోవడంతో పలువురు మరణించినట్టు సీనియర్ పోలీస్ కమాండర్ ఒకరు తెలిపారు. భవంతుల్లో ఎక్కువ మంది కార్మికులకు చోటు కల్పించడంపై తాము ప్రతిసారి హెచ్చరికలు చేస్తూనే ఉంటామని ఆయన అన్నారు. అయితే అగ్నిప్రమాదం సంభవించిన భవనంలో ఏ తరహా కార్మికులు నివసిస్తున్నారని, వారు ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై ఆయన వివరాలు వెల్లడించలేదు. అగ్నిప్రమాద కారణాలతో విచారణ జరుపుతున్నారు.
ఎస్.జైశంకర్ దిగ్భ్రాంతి..
కువైట్ సిటీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా మరణించగా, 50 మందికి పైగా ఆసుపత్రిపాలైనట్టు తెలుస్తోందని అన్నారు. కువైట్‌లోని భారతదేశ రాయబారి కూడా ఘటనా స్థలికి వెళ్లారని, మరింత సమాచారం కోసం వేచిచూస్తున్నారని చెప్పారు. కాగా, కువైట్‌లో భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ప్రమాదంలో గాయపడిన భారతీయ కార్మికులకు అన్నివిధాలా సహాయసహకారులు అందజేస్తామని తెలిపింది. కువైట్‌లో భారత రాయబారి ఆదర్శ్ స్వాయికా సైతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ కార్మికులను పరామర్శించారు. వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
Updated Date - Jun 12 , 2024 | 04:37 PM