Share News

Vikram Misri: హిందువులపై దాడులు.. స్పందించిన బంగ్లాదేశ్

ABN , Publish Date - Dec 11 , 2024 | 09:28 AM

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు ప్రజలు సైతం మద్దతు ప్రకటించారు. దీంతో ఈ నిరసన హింసాత్మకంగా మారింది. దాంతో పరిణామాలు తీవ్రంగా మారాయి.

Vikram Misri: హిందువులపై దాడులు.. స్పందించిన బంగ్లాదేశ్

ఢాకా, డిసెంబర్11: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై దాడులు పెచ్చురిల్లాయంటూ సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతోన్నాయి. అలాంటి వేళ.. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో ఆ దేశ ఉన్నతాధికారులతో విక్రమ్ మిస్రీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో హిందువుల దాడులపై బంగ్లాదేశ్ బుధవారం స్పందించింది.

Also Read: ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు


దేశంలో ఈ ఏడాది ఆగస్ట్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 22వ తేదీ మధ్య మత కలహాలు చోటు చేసుకున్నాయని తెలిపింది. దీంతో 88 కేసులు నమోదయ్యాయని బంగ్లాదేశ్ వెల్లడించింది. అయితే ఈ దాడులతో ప్రమేయమున్న 77 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఈశాన్య సునమ్‌గంజ్, మధ్య గాజీపూర్‌‌తోపాటు ఇతర ప్రాంతాలలో మరిన్ని హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నందున ఈ కేసులతోపాటు అరెస్టుల సంఖ్య సైతం పెరిగే అవకాశముందని తెలిపింది.


అయితే ఈ దాడులపై బంగ్లాదేశ్ స్పష్టమైన వివరణ ఇచ్చింది. హిందువులే లక్ష్యంగా చేసుకోని ఈ దాడులు జరగలేదని తెలిపింది. గత అధికార పార్టీకి చెందిన మాజీ సభ్యులను లక్ష్యంగా చేసుకుని.. అలాగే వ్యక్తిగత వివాదాల కారణంగా ఈ దాడులు చోటు చేసుకున్నాయని సోదాహరణగా వివరించింది. ఇక హింసాత్మక సంఘటనలు చోటు చేసుకొంటున్నా.. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారని వివరణ ఇచ్చింది. ఇక అక్టోబర్ 22వ తేదీ అనంతరం చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని బంగ్లాదేశ్ వెల్లడించింది.


ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులతోపాటు ఇతర మైనారిటీలపై వరుసగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకొంటున్నాయి. బంగ్లాదేశ్‌లోని దేవాలయాలపై సైతం దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో హిందువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే చిన్మోయ్ కృష్ణ దాస్‌ సైతం అరెస్ట్ అయ్యారు. దీంతో బంగ్లాదేశ్‌లో పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన చెందారు.


అలాంటి వేళ.. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకున్నారు. అనంతరం ఆ దేశంలో కేర్ టేకర్ అడ్మినిస్ట్రేటర్ చీఫ్ ముహమ్మద్ యూనస్‌, విదేశాంగ మంత్రి తౌహిద్ హుస్సేన్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు ఇరు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలపై ఈ సందర్భంగా వారు చర్చించినట్లు సమాచారం.


కొన్ని నెలల కిత్రం బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు ప్రజలు సైతం మద్దతు ప్రకటించారు. దీంతో ఈ నిరసన హింసాత్మకంగా మారింది. దాంతో దేశంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేాయాలంటూ.. ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఆ క్రమంలో ఆమె.. తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.


అనంతరం ఆమె భారత్‌లో తల దాచుకున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లోొ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఆ తర్వాత.. దేశంలో హిందువులపై దాడులు చోటు చేసుకున్నాయి. అలాగే బంగ్లాదేశ్‌లో దేవాలయాలపై దాడులు సైతం అధికమయ్యాయి.


అదే విధంగా పలువురు హిందువులు సైతం అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు.

For international And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 09:35 AM