US Elections 2024: అమెరికా అధ్యక్ష రేసులో కమలా.. ఆమె జీవిత విశేషాలివే
ABN, Publish Date - Jul 22 , 2024 | 09:50 AM
భారతీయ మూలాలున్న కమలా హారిస్(Kamala Harris) అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ 2024 అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని నిర్ణయించగా, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
న్యూయార్క్: భారతీయ మూలాలున్న కమలా హారిస్(Kamala Harris) అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ 2024 అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని నిర్ణయించగా, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. 81 ఏళ్ల బైడెన్ వయోభారంతో, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దేశ ప్రయోజనాల కోసం తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. డెమొక్రాట్ల సీనియర్ల ఒత్తిడిని గౌరవిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అయితే డెమొక్రాట్ల నుంచి కమలా హారిస్‌కే అనూహ్యమైన మద్దతు లభిస్తోంది.
కమలా హారిస్ ఎవరు...
కాలిఫోర్నియాలోని జమైకా-అమెరికన్ ప్రొఫెసర్ డోనాల్డ్ జె హారిస్, తమిళ జీవశాస్త్రవేత్త శ్యామాల గోపాలన్ దంపతులకు కమలా దేవి హారిస్1964 అక్టోబర్ 20న జన్మించారు. కమలా హారిస్ భారత సంతతి మహిళగా గుర్తింపు పొందారు. అయితే ఆమె తల్లిదండ్రులు కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. అనంతరం కమలా తన తల్లితో కలిసి జీవిస్తున్నారు. ఆమె తన బ్యాచిలర్ డిగ్రీ కోసం చారిత్రాత్మక ఆల్ బ్లాక్ కళాశాల అయిన హోవార్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు.
కమలా హారిస్ పొలిటికల్ సైన్స్, ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. అనంతరం న్యాయశాస్త్రంలో చేరారు. 1990 లో బార్ అసోసియేషన్ సభ్యురాలిగా మారి, అదే ఏడాది కాలిఫోర్నియాలో డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా వృత్తిని ప్రారంభించారు. 2003లో శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఎన్నికయ్యారు. 2007 చివరలో, అప్పటికే జిల్లా న్యాయవాదిగా పనిచేస్తూ.. అధ్యక్ష బరిలో నిలిచిన బరాక్ ఒబామాకు మద్దతు తెలిపారు. ఒబామా అధ్యక్షుడైన తర్వాత 2010లో ఒకసారి, 2014లో మరోసారి అటార్నీ జనరల్‌గా విధులు నిర్వహించారు. 2017లో ఆమె తన స్వరాష్ట్రం నుంచి జూనియర్ యూఎస్ సెనేటర్ అయ్యారు.
ఆ ఘటనలతో వెలుగులోకి..
ఆరోగ్య సంస్కరణలు, పన్ను, వలసదారులకు పౌరసత్వం, తుపాకీ నియంత్రణ చట్టాల మీద ప్రచారాలతో ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా మార్మోగిపోయింది. సెనేట్‌లో పనిచేసిన రెండో ఆఫ్రికన్ అమెరికన్, తొలి ఆగ్నేయాసియా మహిళగా గుర్తింపు పొందారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కమలా హారిస్, జో బైడెన్‌కు మద్దతుగా రేసు నుంచి తప్పుకున్నారు.
అనంతరం ఆయన పాలనలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా అమెరికా అధ్యక్ష బరిలో దిగుతున్నారు. ఆగస్ట్‌లో జరగనున్న ఈవెంట్‌లో డెమొక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఈ నామినేషన్లో గెలిస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి భారత సంతతి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తారు.
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే, దేశానికి మొదటి భారతీయ సంతతి మహిళ అధ్యక్షురాలు కాగలరు. "అమెరికా అధ్యక్ష రేసులో నిలిచేందుకు అధ్యక్షుడి ఆమోదం పొందడం గౌరవంగా ఉంది," అని కమలా పేర్కొన్నారు. “జో బైడెన్ కన్నా కమలా హారిస్‌ను ఓడించడమే చాలా సులభం” అని ట్రంప్ వ్యాఖ్యానించడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
For Latest News and National News click here
Updated Date - Jul 22 , 2024 | 09:53 AM