South Korea: రన్‌వేపై దూసుకెళ్లి.. రక్షణ గోడను ఢీకొట్టి.. పేలిపోయిన విమానం..
ABN, Publish Date - Dec 30 , 2024 | 04:44 AM
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రాజధాని సియోల్‌కు 290 కిలోమీటర్ల దూరంలోని మువాన్ నగరంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
179 మంది దుర్మరణం దక్షిణ కొరియాలో ఘోరం.. బతికింది ఇద్దరే
బ్యాంకాక్ నుంచి మువాన్ వచ్చిన ‘జెజు’ విమానం
ల్యాండింగ్ గేర్ విఫలమవడంతోనే ప్రమాదం!
పక్షి ఢీకొట్టడంతోనే విఫలమైందన్న అనుమానాలు
మరో రెండు విమానాలకు తప్పిన ప్రమాదం
ఎయిర్ కెనడాలో మంటలు.. నార్వేలో మరో ఘటన
సియోల్, డిసెంబరు 29: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రాజధాని సియోల్‌కు 290 కిలోమీటర్ల దూరంలోని మువాన్ నగరంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయల్దేరిన జెజు ఎయిర్‌కు చెందిన 7సి2216 నంబర్ బోయింగ్ 737-800 విమానం మువాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ అదుపుతప్పింది. ఈ విమానం 15 ఏళ్ల నాటిదని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో రన్‌వే పైనుంచి అతివేగంగా దూసుకెళ్లి, రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 179 మంది మంటల్లో చిక్కుకొని, మరణించినట్లు వెల్లడించారు. ఇద్దరు సిబ్బందిని కాపాడారు. ప్రమాదానికి గల కారణాలపై వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విమానం ఇంజన్‌ను పక్షి ఢీకొనడం, ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా, ఈ విమానం అప్పటికే ల్యాండింగ్‌కు యత్నించి విఫలమైందని అధికారులు చెబుతున్నారు. నేలపైకి దిగిన తర్వాత, రన్‌వేపై వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైనట్లు చెప్పారు. విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు పనిచేయడం లేదని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే అవి పనిచేయకపోయి ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. వీటిని బలపర్చేలా విమానం ల్యాండింగ్ సమయంలో ఓ ఇంజన్ నుంచి నిప్పులు వచ్చిన దృశ్యాలను స్థానిక టీవీ చానల్ ప్రసారం చేసింది. ప్రమాద వీడియోలో కూడా విమానం రన్‌వేపై అదుపుతప్పి దూసుకెళుతూ గోడను ఢీకొనే సమయానికి ల్యాండింగ్ గేర్ వెనక్కే ఉన్నట్లు భావిస్తున్నారు. విమానాన్ని పక్షి ఢీకొన్నట్లు ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ టవర్ నుంచి సందేశం వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం ఉందని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
జెజు ఎయిర్ క్షమాపణలు
ఈ ప్రమాదం పట్ల థాయ్‌లాండ్‌కు చెందిన జెజు ఎయిర్ సంస్థ క్షమాపణలు తెలిపింది. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని పేర్కొంది. దక్షిణ కొరియాలో 1997లో జరిగిన విమాన ప్రమాదంలో 228 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదం కావడం గమనార్హం. కాగా, ఈ విమాన ప్రమాదంపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ స్పందించారు. తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నా చివరి మాటలు చెప్పనా?
మువాన్‌లో విమాన ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు ఓ ప్రయాణికుడు తన బంధువుకు పంపిన మెసేజ్ వైరల్‌గా మారింది. విమానం రెక్కలో పక్షి ఇరుక్కుందని మెసేజ్‌లో తెలిపారు. తర్వాత ‘నా చివరి మాటలు చెప్పనా?’ అని ఉన్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది.
Updated Date - Dec 30 , 2024 | 04:44 AM