Presidential Election : స్వింగ్‌లో ట్రంప్ క్లీన్ స్వీప్
ABN, Publish Date - Nov 11 , 2024 | 03:30 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 7 స్వింగ్ రాష్ట్రాల్లో విజయం సాధించి ట్రంప్ క్లీన్ స్వీప్ చేశారు. తాజాగా ఆరిజోనాలో విజయం సాధించి మరో 11 ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు.
మొత్తం 7 స్వింగ్ రాష్ట్రాలు ట్రంప్‌కే జై
వాషింగ్టన్, నవంబరు 10: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 7 స్వింగ్ రాష్ట్రాల్లో విజయం సాధించి ట్రంప్ క్లీన్ స్వీప్ చేశారు. తాజాగా ఆరిజోనాలో విజయం సాధించి మరో 11 ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. రిపబ్లికన్‌ల తరపున బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌కు మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు రాగా డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారి్‌సకు 226 ఓట్లు వచ్చాయి. కాగా, తన తాజా కార్యవర్గంలోకి నిక్కీ హేలీ, మైక్ పాంపియోలను తీసుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టిన ట్రంప్ గతంలో వారు దేశానికి చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో మాజీ రాయబారిగా పనిచేసిన నిక్కీ హేలీ.. ట్రంప్ తాజా నిర్ణయంపై స్పందించారు. గతంలో ట్రంప్‌తో కలిసి పనిచేయడం తనకు ఆనందాన్నిచ్చిందని, రాబోయే నాలుగేళ్లలో అమెరికాను మరింత పటిష్టం చేయాలని ఆమె ఆకాంక్షించారు. భారత సంతతికి చెందిన నిక్కీ హెలీ గతంలో సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేశారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో పాటు మాజీ రాయబారి రిక్ గ్రెనెల్, ఫ్లోరిడా సెనేటర్ మార్కో రుబియో, రాబర్ట్ ఎఫ్.కెన్నెడీలకు ట్రంప్ కార్యవర్గంలో కీలక పదవులు దక్కే అవకాశం ఉంది.
కమలా హారిస్‌కు అప్పులు మిగిలాయ్!
అమెరికా రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమయింది. అప్పుల్లో ఉన్న తన ప్రత్యర్థికి ఆర్థికంగా సాయపడాలంటూ అధ్యక్షునిగా ఎన్నికయిన ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ) తన మద్దతుదారులను కోరడం పాధ్రాన్యం సంతరించుకొంది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీ్‌సకు ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,500 కోట్లు) ఎన్నికల విరాళాలుగా వచ్చాయి. కానీ చివరకు ఆమెకు 20 మిలియన్ డాలర్ల (సుమారు రూ.170 కోట్లు) అప్పులు మిగిలాయి. దీనిపై ట్రంప్ శనివారం ఎక్స్ ద్వారా స్పందిస్తూ ‘‘అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లు రికార్డు స్థాయిలో విరాళాలు సేకరించారు. ప్రస్తుతం వారి దగ్గర డాలర్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఐక్యత దృష్ట్యా ఇలాంటి కష్ట సమయంలో వారిని ఆదుకోవాలి’’ అని కోరారు. అప్పుల కారణంగా ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగులు, వివిధ వస్తువులు సరఫరా చేసిన వారికి చెల్లింపులు జరపలేని పరిస్థితి డెమోక్రటిక్ పార్టీకి ఎదురయింది.
హౌతీలపై అమెరికా దాడులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత తొలిసారిగా యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆయుధ డిపోలే లక్ష్యంగా అగ్రరాజ్యం యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో హౌతీలకు భారీ నష్టం వాటిల్లింది. కనీసం మూడు చోట్ల అత్యాధునిక ఆయుధ డిపోలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అమెరికా అధికారులు తెలిపారు. మరోవైపు, గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. జబాలియాలోని శరణార్ధి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 33 మంది చనిపోయారు. లెబనాన్‌లోని అల్మాత్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 23 మంది చనిపోయారు.
Updated Date - Nov 11 , 2024 | 03:30 AM