Donald Trump : పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాం!
ABN, Publish Date - Dec 24 , 2024 | 06:18 AM
తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పనామా కాలువ నియంత్రణను అమెరికా ఆధీనంలోని తీసుకువస్తానని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. పనామా దేశం అమెరికా కార్గో నౌకల నుంచి అడ్డగోలుగా రుసుములు వసూలు చేస్తోందని
నౌకలపై రుసుముల పేరుతో పనామా అమెరికాను దోచుకుంటోంది
గతంలో అమెరికా మూర్ఖంగా ప్రవర్తించి నియంత్రణను వదులుకొంది
డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
కాలువలోని ప్రతీ చదరపు మీటరు మాదే: పనామా అధ్యక్షుడు రౌస్
ఫీనిక్స్, డిసెంబరు 23: తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పనామా కాలువ నియంత్రణను అమెరికా ఆధీనంలోని తీసుకువస్తానని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. పనామా దేశం అమెరికా కార్గో నౌకల నుంచి అడ్డగోలుగా రుసుములు వసూలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ రుసుములను తగ్గించాలని లేకపోతే మరో మాట లేకుండా కాలువ నియంత్రణను తమకు అప్పగించాలని పనామా దేశాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం అరిజోనాలోని టర్నింగ్ పాయింట్ వద్ద రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులతో ఆయన మాట్లాడారు. గతంలో అమెరికా మూర్ఖంగా ప్రవర్తించిందని, కాలువ నియంత్రణను పనామా దేశానికి అప్పగించిందని అన్నారు. అప్పటి నుంచి పనామా దేశం రుసుముల పేరుతో అమెరికాను దోచుకుంటోందన్నారు. దీంతో పాటు తన కలల క్యాబినెట్ అమెరికా ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుందన్నారు. సరిహద్దుల్లో నిఘాను పెంచి అక్రమవలసదారులను అడ్డుకుంటామన్నారు. ఇజ్రాయెల్, ఉక్రెయిన్ యుద్ధాలు ఆగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ మునిలో స్పందించారు. ‘‘పనామా కాలువలోని ప్రతి చదరపు మీటరు మాదే. పనామా సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడబోం’’ అన్నారు. పనామా కాలువ నుంచి ప్రయాణించే నౌకల రుసుములను నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందని, సప్లై-డిమాండ్ ఆధారంగా ఇది పనిచేస్తుందని చెప్పారు. 82 కిలోమీటర్ల పొడవైన పనామా కాలువ అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. 1914లో దీనిని ప్రారంభించారు. 1977 వరకు ఈ కాలువపై అమెరికా నియంత్రణ ఉండేది. 1977 జిమ్మీ కార్టర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. 1999లో అమెరికా తన నియంత్రణను పూర్తిగా పనామాకు వదులుకొంది. పనామా దేశానికి ఐదింట ఒక వంతు ఆదాయం ఈ కాలువ నుంచే వస్తోంది. పనామా కాలువ మీదుగా ఏటా రూ.23లక్షల కోట్ల వాణిజ్యం జరుగుతోంది. మరోవైపు, 2017లో తైవాన్‌తో పనామా దౌత్య సంబంధాలను తెంచుకొంది. చైనాతో సంబంధాలను ఏర్పర్చుకుంది. భారీ పెట్టుబడులతో చైనా పనామాకు ముఖ్యమైన మిత్రదేశంగా మారింది. ఈ నేపథ్యంలో పనామా కాలువ ఉన్నది చైనా కోసం కాదని ట్రంప్ ఆదివారం వ్యాఖ్యానించారు. ఈ కాలువ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. అయితే, ఈ కాలువపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చైనా నియంత్రణ లేదని పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ మునిలో బదులిచ్చారు. ట్రంప్ పేరు ప్రస్తావించకుండా ఆయన ఎక్స్‌లో ఈ మేరకు వీడియో పోస్టు చేశారు.
డెన్మార్క్, కెనడా, మెక్సికోలతోనూ కయ్యం!
డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్‌ల్యాండ్‌ను కూడా కొనుగోలు చేస్తామని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఆయన 2016లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఇదే ప్రతిపాదన చేశారు. మరోవైపు, వాణిజ్య లోటు భర్తీ కోసం పొరుగుదేశాలపై భారీగా సుంకాలు విధిస్తామన్న ట్రంప్ ఒక దశలో కెనడా, మెక్సికోలను తమ దేశంలో రాష్ట్రాలుగా చేరుస్తామని ఎద్దేవా చేశారు. ట్రూడో విషయంలో మరో అడుగు ముందుకేసి అమెరికా 51వ రాష్ట్రం కెనడా, గవర్నర్ ట్రూడో అని వ్యాఖ్యానించారు. అమెరికా ఏటా కెనడాకు 100బిలియన్ డాలర్లు, మెక్సికోకు 300బిలియన్ డాలర్లు రాయితీలు ఇస్తోందన్నారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు, డ్రగ్స్ వస్తున్నాయని ఆరోపించారు.
Updated Date - Dec 24 , 2024 | 06:18 AM