డ్రోన్ దాడులు చేసినా అణ్వస్త్ర ప్రయోగం!
ABN, Publish Date - Sep 27 , 2024 | 03:37 AM
ఉక్రెయిన్ నుంచి డ్రోన్ దాడులు భయపెడుతున్న వేళ.. రెండున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధం కొలిక్కిరాని సమయంలో.. పాశ్చాత్య దేశాలు మరిన్ని ఆయుధాలిస్తే ప్రత్యర్థిని ఓడిస్తామని జెలెన్ స్కీ కోరుతున్న సందర్భంలో రష్యా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రత్యర్థులు భారీ వైమానిక, క్షిపణి దాడులు చేసినా..
రష్యా అణు విధానంలో అత్యంత కీలకమైన మార్పులు
పాశ్చాత్య దేశాలకు ఇది హెచ్చరికగా పేర్కొన్న క్రెమ్లిన్
మాస్కో, సెప్టెంబరు 26: ఉక్రెయిన్ నుంచి డ్రోన్ దాడులు భయపెడుతున్న వేళ.. రెండున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధం కొలిక్కిరాని సమయంలో.. పాశ్చాత్య దేశాలు మరిన్ని ఆయుధాలిస్తే ప్రత్యర్థిని ఓడిస్తామని జెలెన్ స్కీ కోరుతున్న సందర్భంలో రష్యా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. తమ అణ్వస్త్ర స్పందన విధానంలో అత్యంత కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు రష్యా లేదా దాని మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తే.. అణ్వాయుధాలను వాడేందుకు రష్యా సిద్ధపడుతుంది. కొత్తగా చేపట్టిన సవరణల ప్రకారం.. వ్యూహాత్మక ఆయుధాలు, వైమానిక, హైపర్ సోనిక్, క్రూయిజ్ క్షిపణులతో పాటు డ్రోన్ దాడులు చేసినా అణ్వస్త్రాలను వాడేందుకు తగిన నిర్ణయం తీసుకుంటుంది. సన్నిహిత దేశమైన బెలార్‌సపై దాడికి దిగినా రష్యా అణ్వాయుధాలను ప్రయోగిస్తుంది.
ఇది ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్న పాశ్చాత్య దేశాలకు ఓ గట్టి హెచ్చరికని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రకటించింది. అణ్వాయుధాలే కాక.. ఇతర మార్గాల్లో దాడులకు దిగినా స్పందన ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ మార్పులు చేసినట్లు వివరించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ దేశ భద్రతా మండలి సమావేశంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వస్త్ర విధానంలో మార్పుల గురించి ప్రస్తావించారు. తమపై దాడి చేస్తోన్న అణ్వస్త్రాలు లేని దేశానికి (ఉక్రెయిన్).. అణ్వస్త్రాలున్న మరో దేశం అండగా నిలుస్తోందంటూ మండిపడ్డారు. దీనిని ఆ రెండు దేశాలు కలిపి చేస్తున్న దాడిగానే చూస్తామన్నారు. పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలతో తమ మీద దాడి చేసేందుకు ఉక్రెయిన్‌కు అనుమతిస్తే.. నాటో కూటమి కూడా యుద్ధంలో చేరినట్లేనని భావిస్తామని స్పష్టం చేశారు.
Updated Date - Sep 27 , 2024 | 03:37 AM