Donald Trump: మస్క్ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేరు: డొనాల్డ్ ట్రంప్
ABN, Publish Date - Dec 23 , 2024 | 09:28 AM
టెస్లా అధినేత మస్క్ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేరని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయన అమెరికాలో పుట్టిన పౌరుడు కాడని స్పష్టం చేశారు. అధ్యక్ష బాధ్యతలు మస్క్ చేతుల్లోకి వెళతాయన్న వార్తలను తోసిపుచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి పాటుపడిన టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్.. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించనున్నారు. అయితే, ప్రభుత్వంలో ఆయన ప్రాముఖ్యం అసాధారణ స్థాయికి చేరుతోందంటూ ప్రతిపక్షం గగ్గోలు పెడుతోంది. సెటైర్లు పేలుస్తోంది. టెస్లా అధినేతను ప్రెసిడెంట్ మస్క్ అంటూ విపక్ష నేతలు సంబోధిస్తున్నారు. ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. మస్క్ అధ్యక్షుడవడం అసాధ్యమని స్పష్టం చేశారు. అమెరికా రాజ్యాంగం ఇందుకు ఒప్పుకోదని స్పష్టం చేశారు (Donald Trump).
Trump:హష్‌మనీ కేసులో...చిక్కుల్లో ట్రంప్
‘‘లేదు.. ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకోవట్లేదు. అది జరగదు. నేను సేఫ్. ఇది ఎందుకో తెలుసా.. అమెరికాలో జన్మించని వారు ఈ దేశానికి అధ్యక్షులు కాలేరు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం, దేశంలో పుట్టిన వారే అధ్యక్ష బాధ్యతలు చేపట్టగలరని చెప్పుకొచ్చారు. ఈ ప్రచారాలన్నీ అభూత కల్పనలేనని కొట్టి పారేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం, అమెరికాలో పుట్టిన వారు, అమెరికన్ పౌరులకు విదేశాల్లో జన్మించిన సంతానం మాత్రమే సహజ పౌరులుగా గుర్తింపు పొందుతారు. మిగతా వారు ఇతర నిబంధనల ప్రకారం అమెరికా పౌరసత్వం పొందుతారు. వీరికి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అర్హత ఉండదు.
Donald Trump: ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిన్‌పింగ్!
ఇటీవల అమెరికా ప్రభుత్వం స్తంభించిపోకుండా కీలక బిల్లుకు ఆమోదం కోసం ట్రంప్‌తో పాటు మస్క్ అమెరికా చట్టసభలతో చర్చల్లో కూర్చోవడంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. త్వరలో అగ్రరాజ్య పగ్గాఅలు మస్క్ చేతుల్లోకి వెళతాయన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే మస్క్ పనితీరుపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయన తన బాధ్యతలు అద్భుతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ‘‘తెలివిగల వాళ్లు నా టీంలో ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. మస్క్ అద్భుత పనితీరు కనబరుస్తున్నారు. అలాంటి వాళ్లే మనకు కావాలి’’ అని అన్నారు. ఇక వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్ష ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాటు విషయం తెలిసిందే. ఆ తరువాత అధ్యక్ష పీఠం అధిరోహించిన అత్యంత పెద్ద వయస్కుడిగా ట్రంప్ రికార్డు సృష్టిస్తారు.
Read Latest and International News
Updated Date - Dec 23 , 2024 | 09:37 AM