తరం మారనన్నది!
ABN, Publish Date - Dec 30 , 2024 | 04:39 AM
India Dominates Air Power, But Pakistan Fast-Tracking Air Force Modernization
భారత్ వద్ద ప్రస్తుతం 4వ తరం యుద్ధ విమానాలే
ఆరో తరం ఫైటర్‌జెట్‌నూ ప్రదర్శించిన చైనా
రెండేళ్లలో చైనా నుంచి 40 జే-35 ఫైటర్‌జెట్లు
కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న పాక్
ఆ తరహా ఫైటర్ జెట్ల తయారీకి భారత్ ‘ఏఎంసీఏ’ ప్రాజెక్ట్
2034లో మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం!
తాజా పరిణామాలపై మన రక్షణ రంగ నిపుణుల ఆందోళన
భారత్ తన ప్రయత్నాలను వేగవంతం చేయాలని సూచన
వాయుశక్తిలో పాకిస్థాన్‌తో పోలిస్తే ప్రస్తుతానికి భారత్‌దే పైచేయి! కానీ.. పాకిస్థాన్ తన వైమానిక దళ శక్తిసామర్థ్యాలను మెరుగుపరుచుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది!! అందులో భాగంగా.. రాడార్లకు అందని, సూపర్ క్రూయిజ్ సామర్థ్యాలున్న అత్యంత అధునాతన ఐదో తరం యుద్ధవిమానాలను చైనా నుంచి కొనుగోలు చేయడానికి పాక్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. దాని ప్రకారం.. వచ్చే రెండేళ్లలో పాకిస్థాన్‌కు చైనా నలభై ‘జే-35’ యుద్ధ విమానాలను సరఫరా చేయనుంది. ఇవి చైనా రూపొందించిన ఐదో తరం ఫైటర్ జెట్లు. అమెరికా వద్ద ఉన్న ‘ఎఫ్-35 లైట్నింగ్ 2’ యుద్ధవిమానాలతో సమానమైన శక్తిసామర్థ్యాలు కలిగినవని సమాచారం. అవి అందుబాటులోకి వస్తే భారత వైమానిక దళం (ఐఏఎ్‌ఫ)పై పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ (పీఏఎఫ్) పైచేయి సాధించినట్లవుతుంది. పాక్‌కు ఐదో తరం యుద్ధవిమానాలు సరఫరా చేయడమే కాదు.. తాజాగా తాను తయారుచేసిన ఆరోతరం యుద్ధ విమానాన్ని సైతం చైనా ప్రదర్శించింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. అధునాతన యుద్ధ విమాన సాంకేతిక పరిజ్ఞానం పోటీలో భారత్ వెనుకబడిపోతోందని హెచ్‌ఏఎల్ మాజీ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రశాంత్ భడోరియా ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నా హృదయం ముక్కలైంది. డ్రాగన్ (చైనా) మనల్ని భారీ తేడాతో ఓడించింది’’ అంటూ ఆయన ఇటీవల ట్వీట్ చేశారు. భారతదేశం వద్ద ప్రస్తుతం ఉన్నవి నాలుగోతరం యుద్ధ విమానాలు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫెల్ యుద్ధ విమానాలు కూడా ఆ తరానివే. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన తదుపరి తరం యుద్ధవిమానాల అభివృద్ధి దిశగా భారత్ రూ.15వేల కోట్లతో ‘అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ)’ ప్రాజెక్టు చేపట్టినప్పటికీ.. అవి 2034కు గానీ మన వైమానిక దళానికి అందుబాటులోకి రావని అంచనా. ఈ క్రమంలోనే.. ‘‘జే-35లు పాక్‌కు అందుబాటులోకి వస్తే వచ్చే 12-14 సంవత్సరాలూ భారతదేశంపై పాకిస్థాన్‌కు పైచేయి లభిస్తుంది’’ అని పీఏఎఫ్ రిటైర్డ్ అధికారి జియా ఉల్ హక్ షమ్సీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పాక్ వద్ద ఉన్న ఎఫ్-16, జే-10సిలకు జే-35లు తోడైతే పాక్ శక్తిసామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయని ఐఏఎఫ్ రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ విజయేందర్ కె.ఠాకూర్ హెచ్చరించారు.
ఏమిటీ ఐదోతరం?
స్టెల్త్.. అంటే శత్రు రాడార్లకు చిక్కకుండా ఉండగలగడం, మళ్లీ మళ్లీ ఇంధనం సరఫరా చేయాల్సిన అవసరం లేకుండానే గంటకు 1200కిలోమీటర్లకు పైబడిన వేగంతో ప్రయాణించగలగడం, వేగంగా ప్రయాణిస్తూనే సమతూకాన్ని కోల్పోకుండా ఎటైనా తిరగగలిగే సత్తా.. ఇలా నిర్ణీత ఫీచర్లను కలిగి ఉన్న విమానాలను ఐదో తరం యుద్ధ విమానాలుగా పరిగణిస్తారు. అలాంటి కంబాట్ రెడీ ఫైటర్ జెట్లు ప్రస్తుతానికి అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. అమెరికా వద్ద ఎఫ్-22 ర్యాప్టర్ (2005లో అందుబాటులోకి వచ్చింది), ఎఫ్-35 లైట్నింగ్ 2 (2015) అనే రెండు రకాల ఐదో తరం ఫైటర్ జెట్లు ఉండగా.. చైనా వద్ద జె-20 (2017లో అందుబాటులోకి వచ్చింది), ఈ ఏడాది నవంబరులో అందుబాటులోకి వచ్చిన జే-35 ఉన్నాయి. తాజాగా చైనా ప్రదర్శించిన ఆరోతరం యుద్ధవిమానం దానికి అదనం. చైనా దాన్ని ‘వైట్ ఎలిఫెంట్’/జె-36గా వ్యవహరిస్తోంది. ఇక రష్యా వద్ద ఉన్న ఎస్‌యు-57 యుద్ధవిమానం 2020లో అందుబాటులోకి వచ్చింది.
-సెంట్రల్ డెస్క్
పీఎ్‌సఎల్వీ-సీ60 ప్రయోగం నేడే
సూళ్లూరుపేట, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇస్రో మరో సరికొత్త అంతరిక్ష ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ ప్రయోగం ద్వారా సోమవారం స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పాడెక్స్) ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. దీని ద్వారా స్పేస్ డాకింగ్ టెక్నాలజీకి సంబంధించి 440 కిలోల బరువున్న స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం రాత్రి 9:58 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఆదివారం రాత్రి 8:58 గంటలకు మొదలైంది. 25 గంటల పాటు కొనసాగే ఈ కౌంట్‌డౌన్ పూర్తికాగానే షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలో స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. భూమికి 470 కిలోమీటర్ల దూరంలోని వృత్తాకార కక్ష్యలో స్పాడెక్స్ ఉపగ్రహాలు తిరుగుతూ పరిశోధనలు చేస్తాయి. వివిధ పరిశోధనల నిమిత్తం ఇస్రో అధికారులు రాకెట్ నాలుగో దశలో 24 ఉపకరణాలను పంపిస్తున్నారు.
చైనా దూకుడు..
అమెరికా, రష్యాతో పోలిస్తే ఈ యుద్ధవిమానాల తయారీలో చైనా చాలా దూకుడుగా ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే చైనా వద్ద 300కు పైగా జే-20లు ఉన్నాయి. 2030 నాటికి 800కు పైగా జే-20, 2030 నాటికి 1500 జే-35 యుద్ధవిమానాల తయారీని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే.. 2035 నాటికి చైనా వద్ద ఒక్క ఐదో తరం యుద్ధ విమానాలే 2,300కు పైగా ఉంటాయన్నమాట. ఒకవైపు చైనా.. మరోవైపు ఆ దేశం నుంచి కొన్న ఐదో తరం యుద్ధ విమానాలతో పాకిస్థాన్.. పక్కలో బల్లేల్లాగా బలపడడం భారత్‌కు ఆందోళన కలిగించే విషయమే.
Updated Date - Dec 30 , 2024 | 04:39 AM