కువైట్ ఎయిర్‌పోర్టులో భారతీయుల పడిగాపులు
ABN, Publish Date - Dec 02 , 2024 | 03:19 AM
కువైట్ విమానాశ్రయంలో భారతీయులు సుమారు 23 గంటలపాటు పడిగాపులు పడాల్సి వచ్చింది.
న్యూఢిల్లీ, డిసెంబరు 1: కువైట్ విమానాశ్రయంలో భారతీయులు సుమారు 23 గంటలపాటు పడిగాపులు పడాల్సి వచ్చింది. బహ్రెయిన్ నుంచి మాంచస్టర్ వెళ్లాల్సిన గల్ఫ్ ఎయిర్ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆదివారం వేకువజామున దాన్ని కువైట్ మళ్లించారు. అప్పటి నుంచి భారతీయ ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కువైట్‌లో భారతీయులకు వీసా ఆన్ అరైవల్ (వీఓఏ) సౌకర్యం లేదు. ఆ సదుపాయం ఉంటే నగరంలోని హోటళ్లకు వెళ్లే సదుపాయం ఉండేది. బ్రిటన్, గల్ఫ్ దేశాల వారికి వీఓఏ ఉండడంతో వారు హోటళ్లకు వెళ్లారు. విమానాశ్రయంలోని హోటళ్లలో ఉందామంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమావేశాల కారణంగా అవన్నీ నిండిపోయాయి. చివరకు భారతీయ రాయబార కార్యాలయం జోక్యం చేసుకొని వారిని విమానాశ్రయం లాంజ్‌లో విశ్రమించే ఏర్పాటు చేసింది. దీనిపై హైదరాబాద్‌కు చెందిన ఆనందపు సాయి సామ్రాట్ అనే ప్రయాణికుడు ట్వీట్ ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Updated Date - Dec 02 , 2024 | 03:19 AM