International : టెక్నాలజీతో కొడుతోంది!
ABN, Publish Date - Jul 16 , 2024 | 05:32 AM
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందని సామెత! అవసరం నూతన ఆవిష్కరణలకు మూలం.. అని మరో సామెత!! పిచుక మీద బ్రహ్మాస్త్రంలా తనపై దండయాత్రకు దిగిన రష్యాపై యుద్ధంలో..
‘ఆటోమేటెడ్ ఆర్మీ’తో రష్యాను సమర్థంగా ఢీకొంటున్న ఉక్రెయిన్
ఆ దేశంలో రెండేళ్లలో వెలసిన డిఫెన్స్
స్టార్టప్‌ల సంఖ్య 250కిపైనే!
గ్రౌండ్ డ్రోన్లు, ఏఐతో పనిచేసే
ఆయుధాల తయారీలో నిమగ్నం
సామాన్యులూ డ్రోన్ల తయారీ
నేర్చుకోవాలంటున్న ఆ దేశ ఉపప్రధాని
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందని సామెత! అవసరం నూతన ఆవిష్కరణలకు మూలం.. అని మరో సామెత!! పిచుక మీద బ్రహ్మాస్త్రంలా తనపై దండయాత్రకు దిగిన రష్యాపై యుద్ధంలో.. ఉక్రెయిన్ ఈ రెండు సామెతలనూ నిజం చేస్తోంది! భారీ సాధన సంపత్తి ఉన్న అంత పెద్ద అగ్రరాజ్యాన్ని.. ఉక్రెయిన్ డ్రోన్, ఏఐ టెక్నాలజీల సాయంతో నిలువరించగలుగుతోంది. యుద్ధరంగంలో తన సైనికుల ప్రాణాలు పోకుండా కాపాడుకోవడానికి ‘ఆటోమేటెడ్ ఆర్మీ’తో శాయశక్తులా పోరాడుతోంది. ఏ యుద్ధంలోనైనా త్రివిధ దళాలు ఉంటాయి. ల్యాండ్ డ్రోన్లు, ఉక్రెయిన్‌లో ఆ మూడు దళాలకూ దన్నుగా నిలుస్తున్న నాలుగో దళంలా మారిందీ ఆటోమేటెడ్ ఆర్మీ!!
డ్రోన్లంటే.. మానవ రహిత విమానాలని మనకు తెలుసు! ఒక చిన్నపాటి యుద్ధట్యాంకును కూడా అలా డ్రోన్‌లాగానే శత్రువుల సమీపానికి తీసుకెళ్లి పేల్చేస్తే? దానికో ఆటోమేటెడ్ మెషీన్‌గన్‌ను అమర్చి అల్లంత దూరం నుంచే రిమోట్‌తో కాల్పులు జరపగలిగితే? సూపర్ ఐడియా కదూ! అత్యంత విలువైన తన సైనికుల ప్రాణాలు పోకుండా రష్యాపై యుద్ధాన్ని కొనసాగించడానికి ఉక్రెయిన్ ఇప్పుడు ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీలనే ఆశ్రయిస్తోంది.
ఉదాహరణకు.. ఆ దేశానికి చెందిన వీరియ్ అనే డ్రోన్ కంపెనీ ‘ఒడిస్సే’ పేరుతో.. కారు పరిమాణంలో ఉండే ప్రోటోటైప్ ‘అన్‌మ్యాన్‌డ్ గ్రౌండ్ వెహికల్’ను తయారు చేసింది. మినీ యుద్ధట్యాంకు తరహాలో ఉండే ఆ వెహికల్ బరువు 800 కిలోలు. దాని బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల దూరం వెళ్తుంది.
కీవ్ శివార్లలోని వ్యవసాయక్షేత్రాల్లో.. వీరియ్ కంపెనీ సీఈవోనే దాన్ని స్వయంగా పరీక్షించారు. ఒడిస్సేపై మెషీన్‌గన్‌ను అమర్చి ఆటోమేటెడ్ దాడులకే కాక.. రిమోట్‌కంట్రోల్‌తో ఆపరేట్ చేస్తూ యుద్ధరంగంలోని సిబ్బందిని కాపాడే రెస్క్యూ అండ్ సప్లై ప్లాట్‌ఫామ్‌గా కూడా వాడుకోవచ్చని వీరియ్ సిబ్బంది తెలిపారు. ఇంతా చేస్తే.. దాని నిర్మాణానికి అయిన ఖర్చు 35 వేల డాలర్లు.
అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.30 లక్షలు. వీరియ్ కంపెనీ తరహాలో ఆ దేశంలో ఆటోమేటెడ్ ఆయుధాలను తయారుచేసే స్టార్ట్‌పలు 250కి పైగా ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉక్రెయిన్‌వ్యాప్తంగా అవి రహస్యంగా ఆటోమేటెడ్ ఆయుధాలను, రష్యన్లపై పోరాడే రోబో ఆర్మీని తయారుచేస్తున్నాయి.
ఆన్‌లైన్ వీడియోలు చూసి..
ఇంతకీ ఉక్రెయిన్ స్టార్టప్ కంపెనీలు వీటిని ఎలా తయారుచేయగలుగుతున్నాయి? అంటే.. డిఫెన్స్ మ్యాగజైన్లు, ఆన్‌లైన్ వీడియోలను చూసి వాటికి తమ ఊహలను జోడించి కొత్తకొత్త ఉత్పత్తులను డిజైన్ చేస్తున్నారు. అది కూడా అందుబాటులో ఉన్న వనరులతో అతి తక్కువ ధరలకే తయారుచేయగలుగుతున్నారు. ఉదాహరణకు..
డ్రోన్ల రెక్కల తయారీకి తేలికపాటి చెక్కను వినియోగించడం, సూపర్ మార్కెట్లలో వాడే ‘కేబుల్ టై’లను ఉపయోగించి డ్రోన్లకు మందుగుండు సామగ్రిని కట్టి, సరిహద్దులకు పంపి పేల్చేయడం వంటి విధానాలను పాటిస్తున్నారు. ఇప్పటికే తయారుచేసిన ఆయుధాలను ఇంకా సమర్థంగా ఉపయోగించే విధానాలను అన్వేషిస్తున్నారు. టో ట్రక్కులు, మైన్‌లేయర్లు, డీమైనర్స్..
ఇలా రకరకాల రోబోలను తయారుచేస్తున్నారు. ‘ఫస్ట్ పర్సన్ వ్యూ’ డ్రోన్లను పెద్ద ఎత్తున తయారుచేస్తున్నారు. వర్చువల్ రియాలిటీ తరహా కళ్లజోళ్లకు అనుసంధానమై ఉండే డ్రోన్లు ఇవి. యుద్ధరంగంలోకి వెళ్లే డ్రోన్‌కు అమర్చిన కెమెరాల ద్వారా.. ఆ ప్రదేశం మొత్తాన్నీ గాగుల్‌ను ధరించిన ఆపరేటర్ చూడగలుగుతాడు. ఎక్కడ దాడి చేయాలో అతడే నిర్ణయించగలుగుతాడు.
అలాగే, డేవ్‌డ్రాయిడ్ అనే మరో కంపెనీ.. కదిలే లక్ష్యాలను గుర్తించి, గురిపెట్టి కాల్పులు జరిపే ఏఐ ఆధారిత ఆటోమేటెడ్ గన్‌ను తయారుచేసింది. కానీ.. ప్రస్తుతానికి ఆ గన్‌పై నియంత్రణను సైనికులకే అప్పగించింది. అంటే ముందున్న లక్ష్యాలను ఆ గన్ గుర్తిస్తుంది. కానీ, కాల్చాలా వద్దా అనే నిర్ణయం మాత్రం వెనకాల ఎక్కడో ఉండే సైనికుడిదేనన్నమాట. కంపెనీలే కాక..
ఉక్రెయిన్‌లోని సాధారణ ప్రజలందరూ కూడా ఇలాంటి డ్రోన్ల, ఆయుధాల తయారీకి సంబంధించి ఆన్‌లైన్‌లో ఉచితంగా లభించే కోర్సులను నేర్చుకోవాలని ఉక్రెయిన్ ఉప ప్రధాని మిఖాయిలో ఫెదొరోవ్ ప్రోత్సహిస్తున్నారు.
దేశ ప్రజలు ఏడాదికి పది లక్షల డ్రోన్లను తయారుచేయాలన్నది ఆయన నిర్దేశించిన లక్ష్యం. కృత్రిమ మేధను యుద్ధరంగంలో ఉపయోగించడం అంతమంచిది కాదని ఐక్యరాజ్యసమితి, మానవహక్కుల సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
కానీ ఉక్రెయిన్ డిప్యూటీ పీఎం చెబుతున్న మాట ఒక్కటే.. ‘ముందు మేం గెలవాలి. అందుకు మేం చేయగలిగిందంతా చేస్తాం. మా సైనికుల ప్రాణాలు కాపాడుకోవడానికి ఆటోమేషన్‌ను వాడి తీరుతాం’’ అని!! టెక్నాలజీనే తమ విజయానికి మొదటి మెట్టు అన్నది ఆయన నినాదం.
- సెంట్రల్ డెస్క్
Updated Date - Jul 16 , 2024 | 05:32 AM