Japan: జపాన్‌లో భారీగా తగ్గుతున్న జనాభా.. ఎందుకో తెలుసా
ABN, Publish Date - Jul 26 , 2024 | 12:13 PM
అభివృద్ధి చెంది, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన జపాన్‌ని(Japan Population) ఇప్పుడు ఓ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇబ్బడిముబ్బడిగా జనాభా పెరిగిపోతుండగా.. జపాన్‌లో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది.
టోక్యో: అభివృద్ధి చెంది, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన జపాన్‌ని(Japan Population) ఇప్పుడు ఓ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇబ్బడిముబ్బడిగా జనాభా పెరిగిపోతుండగా.. జపాన్‌లో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. వరుసగా 15వ ఏడాది జపాన్‌లో జనాభా తగ్గింది. జన్మిస్తున్నవారి కంటే చనిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది.
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఇందుకు సంబంధించిన గణాంకాలను(2023) విడుదల చేసింది. 2023లో దేశ జనాభాలో జపనీయుల సంఖ్య 5.50లక్షల వరకు తగ్గింది. 2024 జనవరి 1నాటికి అక్కడి జనాభా 12 కోట్ల 49 లక్షలే ఉంది. గతేడాది 7 లక్షల 30వేల మంది జన్మించారు. 15 లక్షల 80 వేల మంది మృతి చెందినట్లు మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.
వివిధ దేశాల నుంచి 3 లక్షలకుపైగా (11.01 శాతం) విదేశీయులు జపాన్‌కి వలస వచ్చారు. తద్వారా విదేశీయుల సంఖ్య 33 లక్షల 23 వేలకు చేరింది. విదేశీ నివాసితుల సంఖ్య పెరగడం వరుసగా ఇది రెండోసారి. 2009 నుంచి జనాభా తగ్గుదల ప్రారంభమై నిరంతరం క్షీణిస్తోంది.
దేశంలో మరణాల సంఖ్య అత్యధికంగా ఉంది. నవజాత శిశువుల సంఖ్య మరింతగా తగ్గింది. టోక్యో, కనగావా, ఒసాకా, ఐచి, సైతామా, చిబా, హ్యోగో, ఫుకుయోకా ప్రిఫెక్చర్ నగరాల్లో దేశం మొత్తం జనాభాలో సగానికిపైగా నివసిస్తున్నారు. పెద్ద నగరాలైన వీటిలో జనాభా గణనీయంగా తగ్గుతోంది.
వివాహాలపై తగ్గుతున్న ఆసక్తి..
జనాభా తగ్గుదలకు యువత వివాహాలపై ఆసక్తి చూపకపోవడమే కారణమని తెలుస్తోంది. పెళ్లైనా పిల్లలను కనకపోతుండటంతో జనాభా భారీగా తగ్గుతోంది. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, అధిక జీవన వ్యయం, మహిళల పట్ల వివక్ష తదితర సమస్యలు అక్కడి ప్రజలను వేధిస్తున్నాయి. వివాహం చేసుకుని సంతానాన్ని కనే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా యువత నిర్ణయాల్లో పెద్దగా మార్పు రావట్లేదు.
అందుకే ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య భారీగా తగ్గిందని.. నవజాత శిశువుల సంఖ్య దేశ వ్యాప్తంగా నామమాత్రంగానే ఉంటోందని అధికారులు చెబుతున్నారు. 2050 నాటికి 40శాతం మేర జనాభాను జపాన్ కోల్పోయే ప్రమాదం ఉందని నివేదిక తేటతెల్లం చేస్తోంది.
For Latest News and National News click here
Updated Date - Jul 26 , 2024 | 12:13 PM